• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విశాఖ తెన్నేటి పార్క్‌ తీరానికి కొట్టుకొచ్చిన నౌకను మళ్లీ సముద్రంలోకి ఎలా పంపిస్తారంటే...

By BBC News తెలుగు
|

విశాఖ తీరంలో బంగ్లాదేశ్ నౌక

ఏదైనా నౌక ప్రమాదవశాత్తూ తీరం దగ్గర నేలని తాకితే దాన్ని రన్ ఏ గ్రౌండ్ (run a ground) అంటారు. ఇలాంటి నౌకలను తిరిగి సముద్రం లోపలకి పంపడం చాలా కష్టం. నీటిలోకి పంపడం ఆలస్యం అవుతున్న కొద్దీ పర్యావరణ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువ.

వాయుగుండం ప్రభావానికి బంగ్లాదేశ్‌కు చెందిన 'ఎంవీ మా' నౌక అవుటర్ హార్బర్ నుంచి తెన్నేటి పార్క్ బీచ్‌కు కొట్టుకొచ్చింది.

ఆ నౌక యాజమాన్యం దీన్ని తిరిగి సముద్రం లోపలికి తీసుకెళ్లే పనిని రెండు ఏజెన్సీలకు అప్పగించింది. ఇందులో ఎంఎస్ గిల్ మెరైన్ సంస్థ... నౌకలో ఉన్న దాదాపు 50 టన్నుల చమురును సురక్షితంగా బయటకు తీసే పనిలో ఉంది.

మరో సంస్థ... ఫ్లాగ్ షిప్ మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ చమురును తీసేసిన తర్వాత నౌకను సముద్రం లోపలికి పంపిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు సంస్థల అధీనంలోనే 'ఎంవీ మా' నౌక ఉంది. వీరికి పోర్టు, మెరైన్, కోస్టు గార్డు, స్థానిక పోలీసులు సహకరిస్తున్నారు.

ప్రస్తుతం ఎన్ని రోజుల్లోగా ఈ నౌకను తిరిగి సముద్రంలోకి పంపగలమన్న విషయాన్ని నిపుణుల బృందం నిర్ధారిస్తుందని మెరైన్ డీఎస్పీ విమల కుమారి బీబీసీతో అన్నారు.

"నిపుణుల బృందం వచ్చిన తర్వాతే నౌకని ఎన్ని రోజుల్లో సముద్రంలోకి పంపగలరో చెప్పగలం. అప్పటి వరకూ నౌకలోని ముడి చమురు, డీజీల్‌ను బయటకు తీయడమే ప్రధాన అజెండాగా పని చేస్తున్నాం. ఇప్పటి వరకూ ఎలాంటి పర్యావరణ సమస్యా ఎదురుకాలేదు. నౌక నుంచి యాంకర్‌కు ఉన్న గొలుసు తెగిపోవడాన్ని సిబ్బంది పట్టించుకున్నారా? లేదా? అలాగే నౌక గమనాన్ని నౌకలోని పరికరాల సహాయంతో తెలుసుకునే ప్రయత్నం చేశారా? లేదా? అనేవి కూడా చూడాలి. నౌకలు జీపీఎస్, రాడార్లతో అనుసంధానమై ఉంటాయి. దీంతో నౌక కదలికలూ ప్రయాణిస్తున్న మార్గాలూ ఈ రెండింటిలోనూ నమోదవుతుంటాయి. మేం వాటిని విశ్లేషిస్తాం" అని వివరించారు.

విశాఖ తీరంలో బంగ్లాదేశ్ నౌక

'ఆటుపోట్లు అనుకూలమే’

గత వారంలో వచ్చిన వాయుగుండం ప్రభావంతో వీచిన తీవ్రగాలులకు నౌక దాదాపు మూడు నాటికన్ మైళ్ల దూరం కొట్టుకొచ్చింది. ఇలా గాలులకు నౌక తీరానికి కొట్టుకురావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ విషయంపై ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని మెటరాలజీ, ఓషియనోగ్రఫీ విభాగం అధిపతి ప్రొఫెసర్ రామకృష్ణతో మాట్లాడినప్పుడు ఆయన ఇలా చెప్పుకొచ్చారు.

"యాంకరేజ్ బలంగా చేయకపోవడం వల్లే మూడు వేల టన్నుల బరువున్న నౌక కొట్టుకు వచ్చిందని అనుకుంటున్నాను. నౌకా యాజమాన్యాలు వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆసక్తి కొద్ది నేను స్వయంగా అక్కడికి వెళ్లి చూశాను. నౌకను తిగిరి జలాల్లోకి తీసుకెళ్లగలిగే పరిస్థితులున్నాయి. ప్రొపెల్లర్ బయటకు కనిపిస్తుండటం, నౌక ఉన్నది ఆటు పోట్లు ఎక్కువగా వచ్చే ప్రాంతం కావడం ఇక్కడ కలిసొచ్చే అంశాలు" అని చెప్పారు.

'మూడు వేల టన్నుల బరువే’

తీరానికి కొట్టుకొచ్చిన నౌక చూసేందుకు భారీగా కనిపిస్తోంది. 3 వేల టన్నుల బరువు 80 మీటర్లు పొడవు ఉన్న దీన్ని సాధారణ ప్రజలు 'పే...ద్ద నౌక’ అని అనుకుంటున్నారు. నిజానికి షిప్పింగ్, మెరైన్ రంగాల్లో పని చేసేవారు దీన్ని చిన్న నౌకగానే భావిస్తారు.

"తుపాను ప్రభావంతో యాంకరేజ్ ఉన్న ఎంవీ రివర్ ప్రిన్సెస్ అనే నౌక 2000 సంవత్సరం జూన్ 6 తేదీన గోవాలోని కండోలియం తీరానికి కొట్టుకుని వచ్చింది. అయితే దీన్ని తిరిగి జలాల్లోకి పంపేందుకు పన్నెండు ఏళ్లు ప్రయత్నించారు. కానీ ఫలితం దక్కలేదు. దీంతో అక్కడే ఆ నౌకను ముక్కలుగా చేశారు. దాని బరువు లక్షా పద్నాలుగు వేల టన్నులు. కానీ ఈ బంగ్లాదేశ్ నౌక బరువు కేవలం 3 వేల టన్నులు మాత్రమే. దీన్ని సముద్రంలోకి తిరిగి తీసుకుని వెళ్లడం పెద్ద సమస్య కాదు" అని మెరైన్ చీఫ్ ఇంజినీర్ ప్రసాద్ బీబీసీతో అన్నారు.

విశాఖ తీరంలో బంగ్లాదేశ్ నౌక

పోర్టు లోపలకి రావాల్సిన నౌక... తీరానికి కొట్టుకొచ్చింది

'ఎంవీ మా' నౌక బంగ్లాదేశ్ నుంచి ఎప్పుడూ వస్తూ ఉంటుంది. విశాఖ పోర్టు నుంచి స్టోన్, క్వార్జ్, ఫ్లైయాష్ తీసుకుని వెళ్తుంది. ఇది సెప్టెంబర్ 19న విశాఖ పోర్టుకు వచ్చింది. అయితే డాక్యుమెంట్ల విషయంలో సమస్యలు తలెత్తడంతో పోర్టు అవుటర్ హార్బర్‌లోని యాంకరేజ్‌లో ఉండిపోయింది. ఇందులో ఎలాంటి సరుకూ లేదని ఫ్లాగ్ షిప్ మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ భూపేష్ బీబీసీతో అన్నారు.

."తెన్నేటి పార్కు దగ్గరున్న రాళ్లకు నౌక దిగువ భాగం బలంగా గుద్దుకుంది. అక్కడ ఇసుక మేటలు ఎక్కువగా ఉండటంతో నౌక ఆగిపోయింది. అయితే దీనిలో ఎలాంటి రవాణా సరుకూ లేదు. కేవలం ఈ నౌక నడించేందుకు అవసరమైన ముడి చమురు, డిజీల్ మాత్రమే ఉన్నాయి. డాక్యుమెంటేషన్ పూర్తి చేసుకుని ఈ నెల 14న పోర్టు ఇన్నర్ హార్బర్‌లోకి రావాల్సి ఉంది. అయితే వాయుగుండం ప్రభావానికి అవుటర్ హార్బర్‌లో ఉన్న రెండు యాంకర్లూ తెగిపోయి తెన్నేటి పార్కుకి కొట్టుకుని వచ్చింది. దీనిలో 41 మెట్రిక్ టన్నుల క్రూడాయిల్, తొమ్మిది టన్నుల డిజీల్ ఉన్నాయి. వీటిని ముందుగా బయటకు తీయాలి. ఈ పని జరుగుతోంది" అని భూపేశ్ బీబీసీతో చెప్పారు.

విశాఖ తీరంలో బంగ్లాదేశ్ నౌక

'చమురు లీకైతేనే పెద్ద సమస్య’

నౌక అడుగుభాగం పెద్దగా దెబ్బ తినకపోతే...దాన్ని సముద్రంలోకి తీసుకెళ్లడం సులభమవుతుంది. పంపింగ్ ద్వారా చమురును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో చమురు లీకైతే పర్యావరణ సమస్యలు వస్తాయి. ఒకవేళ అనుకోకుండా చమురు లీకైతే... దానిని ఎదుర్కొనేందుకు విశాఖ పోర్టుకి చెందిన ఆయిల్ స్పిల్ రెస్పాన్స్ టీంలను కూడా సిద్ధంగా ఉంచారు.

"నౌకలో ఉన్న చమురు అన్‌లోడింగ్ ముందుగా పూర్తి చేయాల్సిన పని. ఈ పనిని ఈ నెల 15న ప్రారంభించాం. తొలుత నౌకలోని వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా జనరేటర్స్ నుంచి విద్యుత్ ఇస్తున్నాం. ఒక్కసారి అన్‌లోడింగ్ ప్రక్రియ మొదలైతే నౌకలో ఉన్న మొత్తం 50 టన్నుల చమురు రెండు రోజుల్లో అన్‌లోడ్ అయిపోతుంది" అని అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్న ఎంఎస్ గిల్ మెరైన్ సూపర్‌వైజర్ బీబీసీతో అన్నారు.

'నష్టం పి అండ్ ఐ క్లబ్ భరిస్తుంది’

ప్రమాదాల కారణంగా నౌకాయాన సంస్థలు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోకుండా ఉండేందుకు 'పి అండ్‌ ఐ' (ప్రొటెక్షన్‌ అండ్‌ ఇండెమ్నిటి - Protection and Indemnity) క్లబ్‌లో సభ్యత్వం తీసుకుంటాయి. ఆ సభ్యత్వం ఉన్న సంస్థలకు చెందిన నౌకలు ప్రమాదానికి గురైతే... ప్రమాద నష్టాన్ని పి అండ్ ఐ భరిస్తుంది. 'పి అండ్‌ ఐ ఇన్సూరెన్స్‌'గా ఆ సంస్థను వ్యవహరిస్తుంటారు. క్లబ్‌కు కొంతమంది సర్వేయర్లు ఉంటారు. ఎం.వి. మా నౌక కూడా 'పి అండ్‌ ఐ' క్లబ్‌లో ఉన్నందున ఆ సంస్థ సర్వేయర్లు కూడా సంఘటన స్థలానికి వచ్చారు.

"ఈ నౌకలో మొత్తం 15 మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా బంగ్లాదేశ్‌కు చెందిన వారే. గత ఎనిమిది రోజులుగా నౌకలోనే ఉంటున్నారు. వీరికి కావాల్సిన మందులూ, సరుకులూ పంపిస్తున్నాం. నౌకలో ఉన్న మొత్తం 50 టన్నుల చమురును బయటకు తీసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశాం. చమురు తీయడం పూర్తైన మరో 20 రోజులకు నౌకను జలాల్లోకి పంపగలం. నౌకలు తీరానికి కొట్టుకుని రావడం లేదా ఏదైనా ప్రమాదంలో చిక్కుకుపోవడం లాంటివి జరిగినప్పుడు కాపాడేందుకు ప్రత్యేక బృందాలు ఉంటాయి. వాటిని సాల్వేజ్ టీమ్స్ అంటారు. వీరు కూడా ఆపరేషన్‌లో జాయిన్ కాబోతున్నారు" అని ఫ్లాగ్‌షిప్ మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ భూపేశ్ చెప్పారు.

విశాఖ తీరంలో బంగ్లాదేశ్ నౌక

'ఫొటోలు తీసుకుంటున్నారు’

తీరానికి కొట్టుకొచ్చిన నౌకని చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు, పర్యాటకులు తెన్నేటి పార్కు బీచ్‌కి వస్తున్నారు. వీరందరూ నౌక దగ్గరకు రాకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు.

కార్గో నౌకను అక్కడి నుంచి సముద్రంలోకి పంపించే వరకూ తెన్నేటి పార్కులోకి సందర్శకుల్ని అనుమతించడం లేదు. అందుకే దూరం నుంచి నౌకను చూస్తూ...సెల్ఫీలు దిగుతున్నారు.

"ఇంత పెద్ద నౌకను చూడటం ఇదే తొలిసారి. చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. పోలీసులు నౌక దగ్గరకు వెళ్లనివ్వడం లేదు. ఒడ్డుకి వచ్చిన ఇంత భారీ నౌకని చూసేందుకే బీచ్‌కి ప్రత్యేకంగా వచ్చాం" అని సందర్శకురాలు కారుణ్య బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
This is how a ship that sank off the coast of Visakhapatnam is sent back into the sea
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X