ఢిల్లీ, గురుగ్రామ్‌కు చేరిన మిడతల దండు: అప్రమత్తం, ఆ రాష్ట్రాల్లో పంటలు నాశనం
న్యూఢిల్లీ: పంటలను నాశనం చేసే మిడతల దండు దేశ రాజధాని ఢిల్లీ పరిసరాలకు చేరుకున్నాయి. మొదట ఈ మిడతల దండు గురుగ్రామ్ చేరి, ఆ నగరంలోని సైబర్ హబ్ ప్రాంతంలో ఆకాశాన్ని కమ్మేశాయి. నగరపాలక సంస్థ అధికారులు ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలోని ప్రజలకు ఇళ్ల కిటికీలు మూసివేయాలని సూచించారు.

మిడతల దాడి..
ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దు ప్రాంతంలో రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. కాగా, పాత్రలను కొట్టడంతోపాటు పెద్దగా శబ్దాలు చేయడం ద్వారా మిడతలను నివారించేప్రయత్నం చేశారు. గురుగ్రామ్ జిల్లాలోని పలు గ్రామాల్లో భారీగా చేరుకున్న మిడతల దండుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
రైతులు అప్రమత్తం..
మరోవైపు పురుగు మందులను పిచికారీ చేసే పంపులను రైతులు సిద్ధంగా ఉంచాలని గురుగ్రామ్ జిల్లా అధికారులు సూచించారు. మిడతల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మిడతల దండు ఢిల్లీ వైపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఢిల్లీలోకి మిడతలు..
గురుగ్రామ్‌లో మిడతల దాడి పరిస్థితులపై చర్చించేందుకు ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. తాజా పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారులకు ప్రభుత్వం సలహాలు, సూచనలు అందించనున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.
ఢిల్లీ విమానాలు రాకపోకలపై హెచ్చరికలు
కాగా, ఢిల్లీ విమానాశ్రయం అధికారులను ఏటీసీ అప్రమత్తం చేసింది. పైలట్లు విమానాలు దిగే సమయంలో, ఎగిరే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఏటీసీ హెచ్చరికలు జారీ చేసింది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోకి ఈ మిడతల దండు ప్రవేశించి పంటలను నాశనం చేస్తున్నాయి. భారతదేశ దక్షిణం వైపునకు కూడా ఈ మిడతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలు కూడా మిడతలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి.