బీజేపీ ఎంపీ దూకుడు: హుణుసూరులో ఉద్రిక్తత.. నేడు బంద్కు బీజేపీ పిలుపు
మైసూరు: సాక్షాత్ పార్లమెంట్ సభ్యుడు.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఏర్పాటుచేసిన బ్యారికేడ్లను ఢీ కొట్టి మరి ముందుకు దూసుకెళ్లారు. ఆయన మైసూర్ ఎంపీ ప్రతాప సింహా. కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా హుణుసూరు పట్టణంలో నిర్వహిస్తున్న హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు బయలుదేరిన ఎంపీ దూకుడుగా వ్యవహరించడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఆదివారం హనుమాన్ జయంతి మహోత్సవ సమితి ఆధ్వర్యంలో ఆరంభమైన ఊరేగింపు తోపులాట, లాఠీ చార్జ్, రాళ్లదాడులు, అరెస్టులతో భీతావహ వాతావరణం నెలకొంది.
బారికేడ్లను ఢీకొట్టి మహిళా పోలీసు అధికారి గాయమవడానికి కారణమయ్యారని ఎంపీపై బిళికెరె పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హనుమాన్ జయంతి నిర్వహణలో భాగంగా శోభయాత్రకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు.
అనుమతి ఇచ్చిన మార్గంలో కాక మరో మార్గంలో ఊరేగింపును చేయనున్నట్లు తెలిసి జిల్లా ఎస్పీ రవి చెన్నణ్ణవర్ సిబ్బందితో కలసి సమితి సభ్యులను, హిందూ సంఘాల కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేసి కే.ఆర్.నగర వాల్మీకి సముదాయ భవనానికి తరలించారు. అంతకుముందు హనుమాన్ జయంతి సమితి సభ్యులు, హిందూ సంఘాల కార్యకర్తలు పట్టణంలోని మునేశ్వర కావల్ మైదానం నుంచి శోభయాత్ర ప్రారంభించారు.

మహిళా పోలీసు అధికారికి గాయాలు
హుణుసూరులో హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొనడానికి హనుమ మాలను ధరించి మైసూరు నుంచి వస్తున్న ఎంపీ ప్రతాపసింహాను అడ్డుకోవడానికి పోలీసులు బిళికెరె గ్రామం వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆవేశం చెందిన ఎంపీ ప్రతాపసింహా తమను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కూడా వెనక్కి తగ్గకపోవడంతో మరింత ఆక్రోశం చెందిన ఎంపీ ప్రతాపసింహా ఎలా ఆపుతారో చూస్తానంటూ కారును వేగంగా నడుపుతూ బ్యారికేడ్లను గుద్దుకుంటూ దూసుకెళ్లారు. అక్కడే ఉన్న మహిళా పోలీసు అధికారి అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఎంపీ అదే వేగంతో దూసుకు రాగా, ఆమె పక్కకు దూకేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంగతి తెలుసుకున్న హుణుసూరు డీఎస్పీ మరో 50 మంది సిబ్బందితో కలసి హుణుసూరు పట్టణ శివార్లలోని డీ దేవరాజు అరసు విగ్రహం వద్ద ఎంపీ ప్రతాపసింహాను అడ్డుకొని అంతరసంతకు తరలించారు.

లాఠీచార్జీ, రాళ్లదాడిలో పోలీసులు, ఆందోళనకారులకు గాయాలు
దీంతో గురుజంగమ మఠాధీశుడు నటరాజస్వామి నేతృత్వంలో వందల మంది హనుమ భక్తులు, హిందూ సంఘాల కార్యకర్తలు, మాజీ మంత్రి విశ్వనాథ్, ముడా మాజీ అధ్యక్షుడు నాగేంద్ర తదితరులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. ఎంపీ ప్రతాపసింహా లేకుండా శోభయాత్ర ముందుకు సాగదని తేల్చిచెప్పి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో శోభయాత్ర రద్దు రద్దు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించడంతో హిందూ సంఘాల కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చెలరేగింది. ప్రదర్శకులు పోలీసులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఆందోళనకారులకు చెదరగొట్టడానికి పోలీసులు హఠాత్తుగా లాఠీఛార్జి చేశారు. దీనికి ప్రతిగా నిరసనకారులు పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. పరిస్థితిని అదుపు చేయడానికి అదనపు బలగాలను రప్పించగా, హుణుసూరులో పరిస్థితి ఉద్విగ్నంగా మారాయి. పోలీసుల లాఠీచార్జి, నిరసనకారుల రాళ్ల దాడిలో ఇరువర్గాలకూ గాయాలయ్యాయి.

నేడు హుణుసూర్ బంద్కు బీజేపీ పిలుపు
హుణుసూరు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు మిర్లే శ్రీనివాస్గౌడ మాట్లాడుతూ సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ మతానికి వ్యతిరేకంగా విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇతర మతాలకు ఊరేగింపు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇచ్చి హిందువుల పండుగలకు మాత్రం ఊరేగింపులకు అనుమతులు ఇవ్వకుండా పోలీసులతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఈ దాడులకు వ్యతిరేకంగా సోమవారం హుణుసూరు పట్టణం బంద్కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!