• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కోవిడ్‌-19 చికిత్సకు కొత్త మందు.. తయారీకి సిద్ధమవుతున్న హైదరాబాద్ కంపెనీలు: ప్రెస్ రివ్యూ

By BBC News తెలుగు
|

కరోనా మందులు

కరోనావైరస్ చికిత్సకు మోల్నుపిరవిర్‌ ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నట్లు ఈనాడు కథనం ప్రచురించింది.

మోల్నుపిరవిర్‌... ఇన్‌ఫ్లుయంజా వ్యాధికి వినియోగించే ఈ ఔషధం ఇప్పుడు శాస్త్రవేత్తల నోళ్లలో నానుతోంది.

కోవిడ్‌-19 వ్యాధిని అదుపు చేసే శక్తి ఈ మందుకు ఉందనే నమ్మకం వారిలో బలపడుతోంది.

కోవిడ్‌ తీవ్రతను గణనీయంగా తగ్గించే శక్తి దీనికి ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలింది. దీంతో దీనిపై తదుపరి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కోవిడ్‌-19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిణామం ఒక ఆశా కిరణంలా కనిపిస్తోంది.

ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ ఔషధం సమర్థత నిర్ధరణ కాగానే, వెంటనే దాన్ని ప్రజలకు అందించడానికి హైదరాబాద్‌కు చెందిన కొన్ని ఫార్మా కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి.

ఈ కంపెనీలు ఇప్పటికే మోల్నుపిరవిర్‌ ఫార్ములాను సమకూర్చుకోవడంతో పాటు అన్ని రకాల తయారీ ఏర్పాట్లు మొదలు పెట్టాయి.

అన్నీ కుదిరితే ఫావిపిరవిర్‌, రెమ్‌డెసివీర్‌ ఔషధాల మాదిరిగానే మోల్నుపిరవిర్‌ను సైతం స్థానిక ఫార్మా కంపెనీలు పెద్దఎత్తున తయారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మోల్నుపిరవిర్‌ ప్రత్యేకతలు

జార్జియా స్టేట్‌ యూనివర్సిటీ తొలిసారిగా దీన్ని ఆవిష్కరించింది.

ఇన్‌ఫ్లుయంజా వ్యాధికి చికిత్సలో ఈ మందు వినియోగిస్తున్నారు.

ఇది కోవిడ్‌-19 వ్యాధిని అదుపు చేయగలుగుతుందనే విశ్వాసంతో 'రీపర్పసింగ్‌' పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఫెర్రెట్‌ మోడల్‌ (ఒక రకమైన ఎలుక జాతి జంతువుల)పై చేసిన పరీక్షల్లో అత్యంత సానుకూల ఫలితాలు కనిపించాయి. తదుపరి అమెరికాలో 1450 మంది మనుషులపై ప్రయోగించగా ఈ మందు 24 గంటల వ్యవధిలో కోవిడ్‌-19 వ్యాధిపై ప్రభావం చూపుతుందని స్పష్టమైందని తెలుస్తోంది.

ఈ మందును ట్యాబ్లెట్ల రూపంలో నోటి ద్వారా తీసుకోవచ్చు.

అమెరికా, ఐరోపా దేశాల్లో దీనిపై ప్రస్తుతం ఫేజ్‌-3 క్లినికల్‌ పరీక్షలు (మనుషులపై ప్రయోగాలు) నిర్వహిస్తున్నారని ఈనాడు వివరించింది.

డ్రోన్లతో బాంబులు వేశారని మావోయిస్టుల ఆరోపణ

డ్రోన్లతో బాంబులు విడిచారు-మావోయిస్టుల ఆరోపణ

పోలీసులు తమపై డ్రోన్ సాయంతో బాంబులు వేశారని మావోయిస్టులు ఒక ప్రకటనలో ఆరోపించారని ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది.

మావోయిస్టు పార్టీని దెబ్బ తీసేందుకు పోలీసులు డ్రోన్‌ సాయంతో బాంబు దాడులు చేశారని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శి వికల్ప్‌ ఆరోపించారు.

ఈ నెల 19వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని బొత్తలంక, పాలగూడెం గ్రామాల్లో ఆదివాసీ ప్రాంతాలపై దాడులు చేశారంటూ ఫొటోలతో పాటు, పత్రికా ప్రకటనను బుధవారం విడుదల చేశారు.

విక్పల్‌ పేరుతో ఉన్న ఆ లేఖలో మావోయిస్టు పార్టీని దెబ్బ తీసేందుకు పోలీసులు వ్యూహాలు పన్నుతున్నారని ఆరోపించారు.

జనావాసాలపై ఈ దాడులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పాల్పడ్డాయని ఆరోపించారు. ప్రజాఉద్యమాలు, ప్రజలపై డ్రోన్‌ దాడి చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అన్నారని పత్రిక రాసింది.

దీన్ని బ్లాక్‌ డేగా పరిగణిస్తున్నామన్నారు. సమాధార్‌, ప్రహార్‌లో భాగంగా ఈ నెల 3న అడవుల్లోకి వచ్చిన పోలీసులను తమ పీఎల్‌జీఏ చంపడాన్ని మోదీ, అమిత్‌ షా, ఇతర పోలీసులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆంధ్రజ్యోతి చెప్పింది.

అనంతరం 'మావోయిస్టులు చావడమో, పారిపోవడమో' అన్న కులదీప్‌సింగ్ మాటల్లో అర్థమే డ్రోన్‌ దాడులని విమర్శించారు.

ఆకాశం నుంచి అలా దాడులు చేయడం దెబ్బతిన్న పోలీసులకు మనోదైర్యాన్ని ఇవ్వడమే అన్నారు.

ఆకాశంలో డ్రోన్లు, హెలిక్రాప్టర్లు నిత్యం తిరగడాన్ని ప్రమాదంగా శంకించిన ప్రజలు, గెరిల్లాలు తప్పించుకున్నారని, కానీ అడవి జంతువులు, పక్షులకు ప్రమాదం జరిగిందని, ప్రకృతి వినాశనమైందని మావోయిస్టులు అన్నట్లు పత్రిక వివరించింది.

డబ్బు స్వాహా చేసిన బ్యాంక్ మేనేజర్

జగనన్న దీవెన డబ్బు స్వాహా చేసిన బ్యాంక్ మేనేజర్

నెల్లూరు జిల్లాలో ఒక బ్యాంక్ మేనేజర్ జగనన్న విద్యా దీవెన పథకం డబ్బును అప్పులకు జమ కట్టుకున్నట్లు సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.

పేద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పడిన జగనన్న విద్యాదీవెన పథకం సొమ్మును అప్పులకు జమకట్టుకున్న బ్యాంకు మేనేజరు నిర్వాకమిది.

పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

నాలుగు విడతలుగా ఇవ్వనున్న విద్యాదీవెన నగదును సోమవారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి వేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిట్టమూరులోని కెనరా బ్యాంకులో ఖాతాలున్న విద్యార్థుల తల్లులు ఆ నగదును డ్రా చేసుకునేందుకు వెళ్తే బ్యాంకు మేనేజరు వారిని అడ్డుకున్నారని సాక్షి రాసింది.

ఆ నగదును గతంలో వారు తీసుకున్న రుణాలకు జమ చేసుకున్నట్లు చెప్పారు.

కొందరికి రుణాలు లేకపోయినా.. వారి బంధువులు తీసుకున్న రుణాలు కట్టిస్తేనే ఈ నగదును ఇస్తామని తెలిపారని పత్రిక రాసింది.

జగనన్న విద్యాదీవెన నగదును డ్రా చేసుకుని వారంలోగా కాలేజీలకు చెల్లించకపోతే మిగిలిన మూడు విడతలు జమ కావని ప్రభుత్వం ఓ వైపు హెచ్చరిస్తుండటంతో సుమారు 50 మంది తల్లులు ఆవేదన చెందుతున్నారు.

బ్యాంకు మేనేజరు డబ్బు ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఏంచేయాలో దిక్కుతోచడంలేదని బాధపడుతున్నారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్‌ను వివరణ కోరగా సమాధానం చెప్పేందుకు నిరాకరించారని సాక్షి వివరించింది.

నిలకడగా సీఎం కేసీఆర్ ఆరోగ్యం

కరోనా పాజిటివ్‌ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైద్యులు పరీక్షలు నిర్వహించారని నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుంటారని పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వెల్లడించారు.

బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ సోమాజిగూడ యశోద దవాఖానలో సీఎం కేసీఆర్‌కు సీటీ స్కాన్‌తోపాటు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు.

సీఎం కేసీఆర్‌ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు ఆధ్వర్యంలో ఈ పరీక్షలు చేశారు. సీఎం కేసీఆర్‌ ఊపిరితిత్తులు సాధారణంగా ఉన్నాయని, ఎటువంటి ఇన్ఫెక్షన్‌ లేదని, సీటీ స్కాన్‌లో ఎలాంటి లక్షణాలు బయటపడలేదని డాక్టర్లు వివరించారు.

సాధారణంగా నిర్వహించే రక్త పరీక్షల నిమిత్తం కొన్ని రక్త నమూనాలు సేకరించారు. దీనికి సంబంధించిన రిపోర్ట్‌లు గురువారం రానున్నాయి.

సీఎం కేసీఆర్‌కు కరోనా లక్షణాలు తగ్గిపోయాయని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని కేసీఆర్‌ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు.

ముఖ్యమంత్రి పూర్తిగా కోలుకొని త్వరలోనే విధులకు హాజరయ్యే అవకాశం ఉన్నదని వివరించారు.

ఆయనకు దగ్గు, జలుబు, జ్వరం వంటి కరోనా లక్షణాలు ఏమీ లేవని, వైరస్‌ లక్షణాలు ఉన్నట్టు తేలిన మరుక్షణం నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్‌ హోం ఐసొలేషన్‌లో ఉన్నారని, ఇది మంచి ఫలితం ఇచ్చిందని ఎంవీ రావు చెప్పారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Hyderabad companies preparing to manufacture new drug for Covid-19 treatment
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X