• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వ్యాపారం పేరుతో హైదరాబాద్ యువతి హనీ ట్రాప్.. రూ. 1.2 కోట్లు పోగొట్టుకున్న గుంటూరు యువ రైతు - ప్రెస్ రివ్యూ

By BBC News తెలుగు
|
Google Oneindia TeluguNews
హనీ ట్రాప్

వ్యాపారం పేరుతో ఒక యువతి హనీ ట్రాప్ చేసి ఒక యువ రైతును 1.20 కోట్ల రూపాయల మేర మోసగించిన సంఘటన అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని ఈనాడు దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్ పేట డీడీ కాలనీలో నివశించే అర్చన అనే 24 ఏళ్ల యువతి బ్యుటీషియన్ కోర్సు చేసింది. కూకట్‌పల్లి, దిల్‌సుఖ్ నగర్ ప్రాంతాల్లో బ్యూటీపార్లర్లు నిర్వహించింది.

ఈ క్రమంలో కుత్బుల్లాపూర్‌లో ఉండే తన బావ సాయిరాం ద్వారా గుంటూరు జిల్లాకు చెందిన యువరైతు 35 ఏళ్ల సుబ్బారెడ్డితో పరిచయం ఏర్పడింది.

తాను నిర్వహించే వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక డబ్బులు ఇస్తానంటూ అతడిని నమ్మించింది.

అలాగే, తన వాట్సాప్ నంబరు డీపీగా అందమైన అమ్మాయి ఫొటో పెట్టుకుని చాటింగ్ చేసేది.

అర్చనను పూర్తిగా విశ్వసించిన అతడు వ్యాపారంలో పెట్టుబడి కోసమని గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు పలు విడతలుగా రూ.1.20 కోట్లు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేశాడు.

అప్పటి వరకూ అర్చనను చూడని అతను, నేరుగా ఆమెను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

మరోవైపు, పెట్టుబడి పేరిట తనకు అందిన సొమ్ముతో అర్చన తన ప్రియుడు అనిల్ కుమార్‌తో కలిసి జల్సాలు చేసింది.

బంగారు ఆభరణాల కొనుగోలుతో సహా కారును కూడా బహుమతిగా ఇచ్చింది.

తన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ సుబ్బారెడ్డి పలుమార్లు యువతిపై ఒత్తిడి చేశాడు.

డబ్బులు ఇవ్వకపోగా, చంపుతానంటూ అతడిని అర్చన బెదిరించింది.

ఆమె ఎక్కడ ఉంటుందో తెలుసుకున్న సుబ్బారెడ్డి, అక్టోబర్ 1వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అర్చన, అనిల్ కుమార్‌తో పాటు సాయిరాంను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ ముగ్గురినీ రిమాండ్‌కు పంపించారు.

గ్యాస్ సిలిండర్

పెరిగిన వంట గ్యాస్ ధరలు

దేశంలో ఎల్పీజీ వంట గ్యాస్ ధరలు పెరిగాయని నమస్తే తెలంగాణ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

చమురు కంపెనీలు 14.2 కిలోల సబ్సిడీ, సబ్సిడీయేతర వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.15 చొప్పున పెంచాయి.

తాజా పెంపుతో హైదరాబాద్‌లో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.952కు చేరుకున్నది. గతేడాది నవంబర్‌లో రూ.631.5గా ఉన్న సిలిండర్‌ ధర.. 11 నెలల వ్యవధిలోనే ఏకంగా రూ.320.50 పెరిగింది.

పాట్నాలో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రికార్డు స్థాయిలో రూ. 974.50కు చేరింది.

ఇక, 5 కిలోల సిలిండర్‌ ధరను రూ. 502గా నిర్ణయించారు.

తాజా పెంపు బుధవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు చమురు కంపెనీలు పేర్కొన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ ఆధారంగా ఈ పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్టు వెల్లడించాయి.

ఏపీ, తెలంగాణల్లో టాప్ 10 సంపన్నులు వీళ్లే..

ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌ ఇండియా సంపన్నుల జాబితా-2021లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 69 మంది చోటు సంపాదించారని సాక్షి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

వీరందరి సంపాదన రూ.3,79,200 కోట్లు. గతేడాదితో పోలిస్తే ఇది 54 శాతం వృద్ధి.

కొత్తగా 13 మంది ఈ లిస్ట్‌లో చేరారు. మొత్తం జాబితాలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

అయితే ఔషధ తయారీ రంగం నుంచే 21 మంది ఉండడం విశేషం. రూ.1,000 కోట్లు, ఆపైన సంపద కలిగిన వ్యక్తులతో ఈ జాబితాను రూపొందించారు.

వీరిలో హైదరాబాద్‌ నుంచి 56 మంది, రంగారెడ్డి నుంచి నలుగురు, విశాఖపట్నం నుంచి ముగ్గురు ఉన్నారు.

టాప్ 10 సంపన్నులు..

 • మురళి దివి (రూ.79 వేల కోట్లు - దివీస్ ల్యాబొరేటరీస్)
 • బీ పార్థసారధి రెడ్డి (రూ.26,100 కోట్లు - హెటెరో ల్యాబ్స్)
 • పీ పిచ్చి రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి (రూ.23,400 కోట్లు - మేఘా ఇంజినీరింగ్)
 • కే సతీశ్ రెడ్డి (రూ.12,300 కోట్లు - డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్)
 • జీ అమరేందర్ రెడ్డి (రూ.12 వేల కోట్లు - జీఏఆర్)
 • ఎం సత్యనారాయణ రెడ్డి (రూ.11,500 కోట్లు - ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్)
 • జీవీ ప్రసాద్ (రూ.10,300 కోట్లు - డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్)
 • వెంకటేశ్వర్లు జాస్తి (రూ.9700 కోట్లు - సువెన్ ఫార్మాసూటికల్స్)
 • పీవీఎన్ రాజు (రూ. 9300 కోట్లు - గ్లాండ్ ఫార్మా)
 • వీసీ నన్నపనేని (రూ.9100 కోట్లు - నాట్కో ఫార్మా)

పదేళ్ల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌ లిస్ట్‌లో ముగ్గురు మాత్రమే నమోదయ్యారు.

కోవిడ్ వ్యాక్సీన్

చిన్నారులపై కొవిడ్‌ టీకా ట్రయల్స్‌

నెల రోజుల్లో 2 నుంచి 6 ఏళ్ల చిన్నారులపై కొవావ్యాక్స్‌ కొవిడ్‌ టీకా ట్రయల్స్‌ను ప్రారంభించనున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) తెలిపిందని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

12-17 ఏళ్ల మధ్య వయసువారిపై ట్రయల్స్‌లో టీకా సురక్షితమని తేలడంతో.. ప్రస్తుతం పుణె సహా దేశంలోని 10 నగరాల్లో ఏడు నుంచి 11 ఏళ్ల పిల్లలపై ఎస్‌ఐఐ ట్రయల్స్‌ను నిర్వహిస్తోంది.

వీరి విషయంలోనూ సత్ఫలితాలు వస్తే తదుపరి దశలో 2-6 ఏళ్ల మధ్య వారిపై ట్రయల్స్‌ చేపట్టనుంది.

17 ఏళ్లలోపు పిల్లలు మొత్తం 920 మందిపై ట్రయల్స్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆగస్టులో ప్రారంభించింది. వయసుల వారీ మూడు బృందాలుగా(12-17), (7-11), (2-6) వీరిని వర్గీకరించింది.

అమెరికా ఫార్మా దిగ్గజం రూపొందించిన నొవావ్యాక్స్‌ టీకాను కొవావ్యాక్స్‌ పేరిట భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేయనుంది. నవంబరులో వయోజనులకు, వచ్చే ఏడాది తొలినాళ్లలో పిల్లలకు ఈ టీకా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Hyderabad young woman honey trap in the name of business,Rs 1.2 crore lost by Guntur farmer
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X