నేను అల్లాటప్పా పామును కాదు, కోబ్రాను! ఒక్క కాటు చాలు: మిథున్ చక్రవర్తి సంచలనం
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కోల్కతాలోని ప్రసిద్ధ బ్రిగేడ్ పరేడ్ గ్రౌడ్లో ఆదివారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయవర్గీయ, పశ్చిమబెంగాల్ పార్టీ చీఫ్ దిలీప్ ఘోష్, ఇతర నేతల సమక్షంలో సమక్షంలో ఈ డిస్కో డ్యాన్సర్ కాషాయ కండువా కప్పుకున్నారు.
నేను కోబ్రాను.. ఒక్క కాటు చాలు
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న ఈ భారీ జనసందోహ బహిరంగ సభలో మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ.. తాను అసలైన కోబ్రాను అని, దానికి ఒక్క కాటు చాలు అని వ్యాఖ్యానించారు. బెంగాల్లో నివసించేవారంతా బెంగాలీలేనని అన్నారు. ఓ బెంగాలీగా తానెంతో గర్వపడతానని, ప్రజలందరూ తన సినిమా డైలాగులను ఇష్టపడతారన్న విషయం తనకు తెలుసన్నారు.
మోడీ పాలనతో నా కల నెరవేరిందన్న మిథున్ చక్రవర్తి
తాను దేశానికి ఏదో చేయాలని ముందునుంచీ భావించేవాడిననీ.. అయితే తన కల బీజేపీ, నరేంద్ర మోడీ పాలనతో నెరవేరిందన్నారు. బెంగాలీల నుంచి ఎవరైనా దేనినైనా లాగేసుకుంటే.. అందరమూ కలిసి దాన్ని అడ్డుకుంటామన్నారు. తనపేరు మిథున్ చక్రవర్తి అని.. తాను ఏది చెబితే అదే చేస్తానని అన్నారు.
తాను ఇప్పుడే రంగంలోకి దిగానని, బీజేపీలో తాను ఎలాంటి పాత్ర పోషిస్తాననేది ఫటాకేస్టో సినిమా సిరీస్ చూస్తే మీకే అర్థమవుతుందని అన్నారు.
మోడీతో వేదికను పంచుకోవడాన్ని ఊహించలేదు
బెంగాల్లో నివసించే ప్రతి ఒక్కరి హక్కుల కోసం తాను పోరాడతానని మిథున్ చక్రవర్తి వ్యాఖ్యానించారు. ‘ఉత్తర కోల్కతాలోని జోరాబాగన్ అనే చిన్న ప్రాంతం నుంచి వచ్చాను, అయితే, నేను పెద్ద కలలను కన్నాను. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా దేశంలోని అతిపెద్ద రాజకీయ నాయకులతో ఒక వేదికను పంచుకునే అవకాశం నాకు లభిస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు'అని మిథున్ పేర్కొన్నారు. తాను మార్చి 12 నుంచి ప్రచారబరిలో దిగుతానని మిథున్ చక్రవర్తి చెప్పారు. కాగా, ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముంబైలోని మిథున్ చక్రవర్తి నివాసంలో ఆయనను కలిశారు. ఈ నేపథ్యంలో మిథున్ బీజేపీలో చేరడం గమనార్హం.
నక్సలైట్ భావం జాలం నుంచి బీజేపీవైపు మిథున్ ఇలా
కాగా, 1960లో పశ్చిమబెంగాల్ కోల్కతాలో పుట్టిపెరిగిన మిథున్ చక్రవర్తి మొదటి పేరు గౌరంగ చక్రవర్తి. కానీ, యువకుడిగా ఉన్న సమయంలోనే తన పేరును మిథున్ చక్రవర్తిగా మార్చుకున్నారాయన. ఆ సమయంలో నక్సలైట్ ఉద్యమం ప్రభావంతో ఆ భావజాలానికి దగ్గరయ్యారు. ఆ తర్వాత సీపీఎం, తర్వాత టీఎంసీకి దగ్గరగా ఉన్నారు. టీఎంసీ రాజ్యసభ సభ్యుడిగా కూడా మిథున్ చక్రవర్తి ఉండటం గమనార్హం. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ పదవికి రాజీనామా చేశారు. తాజాగా, ఆయన బీజేపీలో చేరడం గమనార్మం. కాగా, బీజేపీలో మిథన్ రావడాన్ని పలువురు బీజేపీ నాయకులు స్వాగతం పలుకుతూ ట్వీట్లు చేస్తున్నారు.