చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయ మరణం-ఎన్నో కుట్రలు, శశికళ ఎవరు? నేనే వస్తా: దీపాజయకుమార్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన అనంతరం ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జయ నెచ్చెలి శశికళ కొత్త అధికార కేంద్రంగా తయారైన తర్వాత ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన అనంతరం ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జయ నెచ్చెలి శశికళ కొత్త అధికార కేంద్రంగా తయారైన తర్వాత ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం నుంచి మంత్రులు వరకు అందరూ క్యూ కడుతున్నారు. అయితే శశికళ గిట్టని వారు కూడా ఆమెకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.

ఇది ఇలా ఉండగా, జయ మేనకోడలు దీపా జయకుమార్.. తన అత్త(జయలలిత) మరణం వెనక ఎన్నో కుట్రలు దాగి ఉన్నాయని, వాటన్నింటినీ త్వరలోనే బయటపెడతానని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్తకు నిజమైన వారసురాలిని తానేనని, త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తానని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంకా ఆమె ఇంటర్వ్యూ పూర్తిపాఠం..

జయలలితకు వచ్చిన అనారోగ్యం ఏమిటి?

'అకస్మాత్తుగా ఆమె చనిపోవడానికి గల కారణం ఏంటన్న సందేహాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమెను చూసేందుకు ఎవరినీ ఎందుకు అనుమతించలేదు. ప్రజల నుంచి అమ్మను దూరం చేసింది ఆమె వెన్నంటి ఉన్న వారేనా? లేక మరేదైనా శక్తా? అన్న అనుమానాలు నాతో సహా చాలామందికి ఉన్నాయి. దీనివెనక పెద్ద కుట్ర దాగి ఉందన్న విషయం నాకు తెలుసు. సరైన సమయంలో బయటపెడతా.

1995లో నాన్న చనిపోయాక కూడా మా రెండు కుటుంబాల మధ్య సంబంధాలు బాగానే ఉండేవి. 2007లో చివరిసారిగా నేను అత్తను కలుసుకున్నా. ఆ తర్వాత చాలాసార్లు అత్తను కలుసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఫోన్ చేస్తే మేడమ్ బిజీగా ఉన్నారంటూ ఫోన్ ఇచ్చేవారు కాదు. దీంతో లేఖలు రాశా. వాటినీ ఆమెకు చేరకుండా అడ్డుకున్నారు. అత్త ముఖ్యమంత్రి అయ్యాక ఉద్దేశపూర్వకంగానే కొందరు మమ్మల్ని ఆమె నుంచి దూరం చేశారు.

జయలలితే మమ్మల్ని దూరం పెట్టారనే వార్తల్లో ఏమాత్రం నిజంలేదు. ఆమెకు మేమంటే ఎంతో అభిమానం. కుటుంబమన్నాక చిన్నచిన్న సమస్యలు సహజం. జయ ఆస్పత్రిలో ఉన్నారన్న విషయం టీవీలో చూసేవరకు మాకు తెలియదు. ఆమె రక్తసంబంధీకులుగా ఆ విషయం మాకు తెలియపర్చాల్సిన అవసరమున్నా ఆ పని చేయలేదు. నేను ఆమె మేనకోడలినని తెలిసినా ఆస్పత్రిలో నన్ను అడ్డుకున్నారు.

జయ రెక్కల కష్టంతో అభివృద్ధి చేసిన పార్టీ ఇప్పుడు పరుల చేతికి చిక్కబోతోంది. కార్యకర్తలు దీనిని ఆమోదించడం లేదు. అత్త లక్ష్య సాధన కోసం పార్టీని 'వారి' చేతికి చిక్కకుండా చూడాల్సిన బాధ్యత నాపై ఉంది. జయలలిత కూడా శశికళను తన వారసురాలిగా భావించలేదు. అలాంటి మహిళ ఇప్పుడు పార్టీ పగ్గాలు ఎలా చేపడుతుంది. ప్రజలకు కూడా ఈ విషయాలన్నీ తెలుసు.

అత్త బతికి ఉన్నప్పుడు 'అమ్మ.. అమ్మ' అని తిరిగిన నాయకులు ఇప్పుడు ఆమె వ్యతిరేక శక్తులకు పాదాభివందనం చేస్తుంటే బాధనిపిస్తోంది. జయలలిత 2014లో జైలుకు వెళ్లనప్పటి నుంచి సెప్టెంబరు 22 వరకు ఆమె వెనక ఎన్నో కుట్రలు జరిగాయి. వాటన్నింటినీ బయటపెడతా ' అని తేల్చి చెప్పారు.

'నేను, తమ్ముడు అత్త జయలలిత ఇంట్లోనే జన్మించాం. కొన్నాళ్లు అక్కడే పెరిగాం. అత్త స్వేచ్ఛ కోసం, మా కుటుంబ స్వేచ్ఛ కోసం పొయెస్‌ గార్డెన్‌ నుంచి బయటకు రావాలని నాన్న నిర్ణయించారు. ఆమె సీఎం కాకముందే బయటకు వచ్చేశాం. మేం మళ్లీ తన వద్దకు రావాలని అత్త చాలాకాలం ప్రయత్నించారు. ఈ విషయాన్ని నాన్న ఎన్నోసార్లు చెప్పారు.

దేశ రాజకీయాల్లో అన్నిచోట్లా నిజమైన వారసులే తమ నేతల పగ్గాలు అందుకున్నారు. ప్రస్తుతం అందుకు భిన్నంగా జరుగుతోంది. అన్నాదురై చనిపోయినప్పుడు ఆయన వారసులుగా గుర్తింపు పొందినవారే డీఎంకే పగ్గాలు చేతబట్టారు. ఎంజీఆర్‌ మరణం తర్వాత ఆయన వారసురాలిగా పేరొందిన అత్త పార్టీకి అధినేత్రి అయ్యారు. ఇప్పుడు మాత్రం అన్నాడీఎంకేలో అంతా భిన్నంగా ఉంది. అత్తకు నిజమైన వారసురాలిని నేనే. ఆ విషయాన్ని మరచి కొంతమంది నేతలు శశికళను పీఠంపై కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారమంతా చూస్తుంటే కువైట్‌ను సద్దాం హుస్సేన్ ఆక్రమించిన విషయం గుర్తుకొస్తోంది' అని జయకుమార్ తెలిపారు.

జయ బతికి ఉన్నప్పుడు పార్టీలో ఎందుకు చేరలేదు?

జయ బతికి ఉన్నప్పుడు పార్టీలో ఎందుకు చేరలేదు?

అత్తగా జయ ప్రేమాభిమానాలను పొందాలనుకున్నామే గానీ, రాజకీయాల ప్రస్తావన మాకెప్పుడూ లేదు. ఆ దిశగా ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం వచ్చింది.

రాజకీయాల్లోకి వస్తారా?

రాజకీయాల్లోకి వస్తారా?

ఖచ్చితంగా వస్తాను. అయితే నన్ను ఆమోదిస్తారా లేదా అన్నది ప్రజల ఇష్టం. నేను రాజకీయాల్లోకి రావాలా లేదా అన్నది కూడా ప్రజలపైనే ఆధారపడి ఉంది. కోట్లాది మంది ప్రజలు అత్తను ‘అమ్మ అమ్మ' అంటూ అభిమానిస్తున్నారు. ఆమెను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. అలాంటి వ్యక్తి రెక్కల కష్టం కొన్ని దుష్టశక్తుల పాలవుతుంటే వారు చూస్తూ ఊరుకోరు. ప్రజల అభిప్రాయాన్ని, మనోభావాలను రాజకీయపార్టీలు ఆమోదించాల్సిందే. ప్రజల అండ ఉంటే కచ్చితంగా వారిని ఎదుర్కొంటాను.

శశికళను ప్రజలు ఆమోదించడం లేదని అనుకుంటున్నారా?

శశికళను ప్రజలు ఆమోదించడం లేదని అనుకుంటున్నారా?

జయలలిత కూడా శశికళను తన వారసురాలిగా భావించలేదు. ఆమెను పార్టీ నుంచి తీసేశారు కూడా. అలాంటి మహిళ ఇప్పుడు పార్టీ పగ్గాలు ఎలా చేపడుతుంది? శశికళ, ఆమె బంధువులు పార్టీలో ఉండడం జయలలితకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఆమెకు ఇష్టం లేని పనులు పొయెస్‌ గార్డెన్‌లో ఎన్నో జరిగాయి. ఇవన్నీ తెలిశాక ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరిని ఇంటి నుంచి గెంటేశారు. అలాంటి వ్యక్తులు ఆమె మృతదేహం అక్కడ ఉండగానే.. మళ్లీ ఆ ఇంటిని కబ్జా చేశారు. వీటన్నింటినీ ప్రజలు గ్రహించాలి.

జయ వెనుక చాలా కుట్రలు జరిగాయంటున్నారు. అవేంటి?

జయ వెనుక చాలా కుట్రలు జరిగాయంటున్నారు. అవేంటి?

ఒకటా రెండా.. అనేకం ఉన్నాయి. వాటన్నింటి గురించి త్వరలోనే బయటపెడతా. 2014లో జయలలిత జైలుకు వెళ్లినప్పటి నుంచి గత సెప్టెంబరు 22వ తేదీన ఆమె ఆసుపత్రిలో చేరినప్పటి వరకూ తెరవెనుక ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరిగాయి. ఇప్పుడు ‘జరిగినదంతా' కూడా పక్కా ప్రణాళికతోనే జరిగిందని భావిస్తున్నాను.

మీ నాన్న చనిపోయినప్పుడు జయ మీ ఇంటికి వచ్చారా?

మీ నాన్న చనిపోయినప్పుడు జయ మీ ఇంటికి వచ్చారా?

నాన్న 1995లో చనిపోయారు. అప్పుడు అత్త ఇంటికొచ్చారు. మా అందరినీ ఓదార్చారు. అన్నీ దగ్గరుండి ఆమే చూసుకున్నారు. సంప్రదాయపూర్వకంగా నాన్న కర్మకాండలను జరిపించారు.

జయ అంతిమ సంస్కారాలకు దీపక్‌ను మాత్రం తీసుకెళ్లారు?

జయ అంతిమ సంస్కారాలకు దీపక్‌ను మాత్రం తీసుకెళ్లారు?

వైష్ణవ సంప్రదాయంలో కుమారుడు, లేదా మనవడు, లేదా రక్తసంబంధీకులైన మగవారిచేత అంతిమ సంస్కారాలు నిర్వహింపజేయాలి. బహుశా ఆ కారణంతోనే దీపక్‌ని తీసుకెళ్లారనుకుంటా.

కానీ శశికళ కూడా జయ అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు ఎందుకని?

కానీ శశికళ కూడా జయ అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు ఎందుకని?

అదే నాకు ఆశ్చర్యం కలిగించింది. బహుశా తానే వారసురాలినని చెప్పుకునేందుకు ఆమె అలా చేసి ఉంటారు. దీపక్‌ను తీసుకెళ్లినా, తొలిగా ఆమే చేసింది. ఒక వ్యక్తి మరణించినప్పుడు వారసులతో అంత్యక్రియలు చేయించడం సంప్రదాయం. దానికి విరుద్ధంగా శశికళ ప్రవర్తించారు.

 జయను ఖననం చేశారెందుకు?

జయను ఖననం చేశారెందుకు?

దీనిపై ఇప్పుడు మాట్లాడుకోవడం వృథా. జరిగిందేదో జరిగిపోయింది. కానీ సంప్రదాయబద్ధంగా మాత్రం జరగలేదు. ఆమె చనిపోయిన విషయం గురించి కూడా మాకు సమాచారం లేదు. మాకు మేముగా వెళ్లినా.. దూరంగా ఉంచారు.

 జయ వీలునామా రాసి ఉండొచ్చని భావిస్తున్నారా?

జయ వీలునామా రాసి ఉండొచ్చని భావిస్తున్నారా?

జయలలిత నటిగా బాగానే సంపాదించారు. అయితే అంతకు ముందే మా నాయనమ్మ సంధ్య కూడా ఆమెకు వారసత్వంగా కొన్ని ఆస్తిపాస్తులు ఇచ్చారు. మా ముత్తాత మైసూర్‌ ఆస్థానంలో సర్జనగా పని చేశారు. ఆయన నుంచీ జయకు కొంత ఆస్తి సంక్రమించింది. ఈ విషయాలన్నీ ఆమెకు తెలుసు. ఆమె వీలునామా రాసి ఉంటుందనే అనుకుంటున్నా. వేద నిలయాన్ని ఆక్రమించిన వారు ఆ వీలునామాను బయటపెట్టాలి. అప్పుడే నిజానిజాలు తెలుస్తాయి. జయలలిత మృతిపైన ప్రజల్లో నెలకొన్న అనుమానాలు కూడా తొలగించాల్సిన అవసరం ఉంది అని దీపా జయకుమార్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

English summary
Even as late Chief Minister Jayalalithaa received treatment at the Apollo Hospital in Chennai for 75 days before she passed away on December 5, television cameras stationed outside the hospital gates focussed on one person, who was barred from meeting the 68-year-old leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X