సింధియా బాగా తెలుసు! మోడీ ఇంకా నిద్రలోనే: రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ: కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరికపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. జ్యోతిరాదిత్య సింధియా తనకు బాగా తెలిసిన వ్యక్తి అని అన్నారు. అంతేగాక, సింధియా తన కాలేజీ రోజుల నుంచే పరిచయం ఉందని చెప్పారు. రాహుల్ గాందీ గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

సింధియా బాగా దగ్గరి వ్యక్తి కానీ..
ఈ సందర్భంగా సింధియా బీజేపీలో చేరికపై మీడియా ప్రశ్నలు అడగగానే రాహుల్ గాంధీ ఆగ్రహానికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నారు? ఎవరు వెళ్లారు అనే విషయం ముఖ్యం కాదని.. ఈ దేశ ఆర్థిక పరిస్థితి ముఖ్యమని, దానిపై మాట్లాడుకుందామని అన్నారు. ఆ తర్వాత సింధియా పార్టీ మార్పుపై స్పందించారు.
‘జ్యోతిరాదిత్య సింధియా భావజాలం నాకు తెలుసు. ఆయన నాకు బాగా దగ్గరి వ్యక్తి. కాలేజీ రోజుల నుంచి నాకు మంచి మిత్రుడు. ఆయన తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆందోళనపడ్డారు. కాంగ్రెస్ భావజాలాన్ని వీడి.. బీజేపీ-ఆర్ఎస్ఎస్ వైపు వెళ్లారు'అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

సింధియాకు ఆ విషయం తొందర్లోనే బోధపడుతుంది..
సింధియా అవకాశవాదిలా ఆలోచించారని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇప్పుడున్నదల్లా భావజాల పరమైన యుద్ధమని, ఒకవైపు బీజేపీ-ఆర్ఎస్ఎస్, మరోవైపు కాంగ్రెస్ ఉందని రాహుల్ చెప్పారు. బీజేపీలో సింధియాకు తగిన గౌరవం దక్కదని, బీజేపీ సిద్ధాంతం సింధియాకు సరిపోదని వ్యాఖ్యానించారు. ఆ విషయం తొందర్లోనే గ్రహిస్తారని, అది తనకు తెలుసని అన్నారు. సింధియా మనస్సులో ఉన్నది వేరు.. ఆయన మాట్లాడే మాటలు వేరని చెప్పారు.
మోడీ నిద్రలోనే.. పూర్తిగా విఫలం
ఇక ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పిస్తూ.. కరోనావైరస్ నియంత్రణపై ఆయనకు సరైన అవగాహనే లేదని రాహుల్ వ్యాఖ్యానించారు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడంలో, ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మోడీ మొద్దు నిద్రలో ఉన్నారని ధ్వజమెత్తారు. ఇక రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయం స్పందించేందుకు తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కాదని ఆయన అన్నారు. కాగా, బుధవారం జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ప్రజా సేవ చేసే అవకాశం ఉండదని, అందుకే తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బీజేపీలో చేరిన సింధియాను ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక, కేంద్ర కేబినెట్లోకి తీసుకునే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.