'రైతులే నన్ను బెదిరించి కట్టు కథ చెప్పించారు... ప్రాణాలు కాపాడుకోవడానికే అలా చెప్పాను...'
ఈ నెల 26న దేశ రాజధాని ఢిల్లీలో రైతు సంఘాలు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో రైతుల హత్యకు కుట్ర చేసినట్లు చెప్పిన నిందితుడు యోగేష్ కొద్ది గంటల్లోనే మాట మార్చాడు. రైతులు రాసిచ్చిన స్క్రిప్టునే తాను చదివి వినిపించానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిజానికి రైతులే తనపై దాడికి పాల్పడ్డారని.. వాళ్ల నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకే మీడియా ముందు కట్టు కథ చెప్పానని తెలిపాడు. పోలీసులపై కుట్ర ఆరోపణలు చేయకపోతే తనను చంపేస్తామని రైతులు బెదిరించారన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో యోగేష్ వీడియో ఒకటి ప్రత్యక్షమైంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న యోగేష్ ఈ వీడియో ఎలా రికార్డ్ చేశాడన్న ప్రశ్న తలెత్తుతోంది.

యోగేష్ ఏమన్నాడు...
'నా పేరు యోగేష్... హర్యానాలోని సోనేపాట్కు చెందిన నేను ఈ నెల 19న పానిపట్‌కు బయలుదేరాను. అదే రోజు తిరిగి సోనేపాట్కు బయలుదేరిన క్రమంలో రైతులు ఆందోళన చేపడుతున్న నరేలా ప్రాంతానికి వెళ్లాను. ఆ సమయంలో అక్కడి మహిళల పట్ల కొంతమంది యువకులు తప్పుగా ప్రవర్తించడాన్ని గమనించాను. ఇదే విషయాన్ని ఆందోళనకారులకు చెప్పగా... వాళ్లు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. మొదట నా దుస్తులు విప్పి చితకబాదారు. ట్రాలీపై వేలాడదీసి మళ్లీ కొట్టాలని చూశారు.' అని యోగేష్ ఆ వీడియోలో పేర్కొన్నాడు.

అదే కట్టు కథ చెప్పాను : యోగేష్
'ఆ మరుసటిరోజు రైతు సంఘాల నేతలు తనవద్దకు వచ్చి తాము చెప్పింది చేయాలన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నాతో పాటు పట్టుకున్న మరో నలుగురిలో ఒకరిని హత్య చేసినట్లు చెప్పారు. ఆ మాట విని భయపడ్డ నేను వారు చెప్పినట్లు చేసేందుకు ఒప్పుకున్నాను. జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా నలుగురు రైతు సంఘాల నేతలపై కాల్పులకు కుట్ర చేసినట్లు వాళ్లు చెప్పామన్నారు. అదే కట్టు కథను నేను మీడియా ముందు చెప్పాను. వాళ్లు చెప్పినట్లే పోలీసులపై ఆరోపణలు చేశాను.' అని చెప్పుకొచ్చాడు.

మీడియా ముందు ఏం చెప్పాడు...
శుక్రవారం రాత్రి ముసుగు ధరించి మీడియా ముందుకు వచ్చిన యోగేష్... ఈ నెల 26న నలుగురు రైతు సంఘాల నేతలను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. 'జనవరి 26న రైతులు నిర్వహించే ట్రాక్టర్ ర్యాలీలో రెండు బృందాలుగా ఏర్పాడి ఈ ప్లాన్ అమలుచేయాలనుకున్నాం. ఒక బృందంలోని నిందితులు పోలీసుల డ్రెస్‌లో ట్రాక్టర్ ర్యాలీకి అంతరాయం కలిగించడం, మరో బృందంలోని నిందితులు రైతు సంఘం నేతల్లోని నలుగురిని కాల్చి చంపాలనుకున్నాం. మేం చంపాల్సిన నలుగురు రైతు సంఘం నేతల ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. వాటిని మాకు సుపారీ ఇచ్చిన ఓ పోలీస్ అధికారి ఇచ్చాడు. దీంతో పాటు రిపబ్లిక్‌డే రోజు రైతుల ట్రాక్టర్ ర్యాలీలో సమయంలో రైతుల వద్ద ఆయుధాలు ఏమైనా ఉన్నాయో లేదో గుర్తించాలి. అనంతరం రైతుల్లో కలిసిపోయి అక్కడ అలజడి సృష్టించాలి.' అని ప్లాన్ చేసినట్లు అతను వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉండగా... వారి నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.