ట్రాఫిక్‌లో కదల్లేని స్థితిలో మోడీ: ప్రాణాలతో తిరిగి వెళ్తున్నా, మీ ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్పండి
చండీగఢ్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల జోష్‌లో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారాన్ని సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో కనిపిస్తోన్నారు. ఇందులో భాగంగా- ఇప్పటికే పలుమార్లు యూపీలో పర్యటించారు. మొన్నటికి మొన్న మీరఠ్‌లో కలియతిరిగారు. సోమవారం మణిపూర్‌కూ వెళ్లొచ్చారు. అక్కడి గిరిజనులతో కలిసి సరదాగా గడిపారు.

పంజాబ్ పర్యటనకు..
ఇవ్వాళ ఆయన పంజాబ్ పర్యటిస్తోన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలాగైనా పాగా వేయాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. 42,750 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను ప్రధాని తన పర్యటన సందర్భంగా ప్రారంభించాల్సి ఉంది. ఢిల్లీ-అమృత్సర్-కాట్రా ఎక్స్‌ప్రెస్ వే, అమృత్సర్-ఉనా రహదారి విస్తరణ, ముకేరియన్-తల్వారా కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ పనులను ప్రారంభించాల్సి ఉంది.

ట్రాఫిక్ కష్టాలు..
దీనికోసం మోడీ ఈ మధ్యాహ్నం పంజాబ్‌కు చేరుకోగా.. ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఏకంగా తన ఎన్నికల సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఆయనకు ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యాయి. ఆయన కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. 20 నిమిషాల పాటు ప్రధాని ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సి వచ్చింది. అది కూడా ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్‌లో చిక్కుకున్నందు వల్ల ఎటూ కదల్లేని స్థితిని ఎదుర్కొన్నారాయన. ట్రాఫిక్ క్లియర్ చేసేంత వరకూ కారులో గడిపారు.

ఫ్లైఓవర్‌పై 20 నిమిషాలు..
ఫిరోజ్‌పూర్ జిల్లాలోని హుస్సేనీవాలా సమీపంలో ఓ ఫ్లైఓవర్‌పై ప్రధాని కాన్వాయ్ చిక్కుకుపోయింది. చుట్టూ వాహనాల మధ్య ఆయన కారు, కాన్వాయ్ ముందకు వెళ్లలేని స్థితిలో కనిపించింది. 20 నిమిషాల తరువాత కాన్వాయ్ ముందుకు కదిలింది. దీనితో ఫిరోజ్పూర్లో నిర్వహించాల్సిన మోడీ బహిరంగ సభ రద్దయింది. ప్రధానికి స్వాగతం పలకడానికి ఫిరోజ్‌పూర్ సభకు వెళ్లిన కేంద్ర మంత్రి మన్సుఖ్ భాయ్ మాండవీయ ఈ విషయాన్ని తెలిపారు. కొన్ని కారణాల వల్ల సభను రద్దు చేయాల్సి వచ్చిందని ప్రకటించారు.

కేంద్రం సీరియస్..
కాగా- ప్రధాని కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకోవడాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించింది. దీనికి గల కారణాలను సమర్పించాల్సిందిగా పంజాబ్ హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది. పంజాబ్ ప్రభుత్వం కూడా దీన్ని భద్రతలోపంగా గుర్తించింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. డీజీపీ నుంచి నివేదికను కోరింది. ఈ ఘటన పట్ల భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘాటు విమర్శలు చేశారు.

సెక్యూరిటీ లోపం లేదు..
కాగా- ప్రధాని కాన్వాయ్ ట్రాఫిక్ చిక్కుకోవడం పట్ల ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ స్పందించారు. రాష్ట్ర పోలీసుల లోపాలు ఏమీ లేవని అన్నారు. వారికి నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారమే.. అన్ని ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. భటిండా విమానాశ్రయానికి చేరుకున్న తరువాత ప్రత్యేక హెలికాప్టర్లో ప్రధాని ఫిరోజ్‌పూర్ బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉందని, చివరి నిమిషంలో రోడ్డు మార్గంలో ఆయన వచ్చారని ఛన్నీ స్పష్టం చేశారు.

ఫిరోజ్‌పూర్ సభ అట్టర్ ఫ్లాప్..
ఈ మేరకు ఓ పంజాబీ న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. చివరి నిమిషంలో మోడీ ఎందుకు రోడ్డు మార్గంలో రావాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఫిరోజ్‌పూర్ బహిరంగ సభకు ప్రజల మద్దతు లేదని ముఖ్యమంత్రి అన్నారు. 70 వేలమంది బీజేపీ నేతలు కుర్చీలను ఆర్డర్ చేయగా.. కనీసం 700 మంది కూడా హాజరు కాలేదని, అందుకే ఈ సభను రద్దు చేసుకోవడానికే బీజేపీ నేతలు ఇలాంటి ప్రయత్నాలు చేసి ఉండొచ్చని చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ వ్యాఖ్యానించారు.

నడ్డా ఫైర్..
ఈ ఘటన పట్ల జేపీ నడ్డా తీవ్రంగా స్పందించారు. ప్రధాని.. ప్రజలతో మమేకం కావడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్చుకోలేకపోతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. అందుకే- ఇలాంటి చీప్ ట్రిక్స్‌ను ప్రయోగిస్తోందని మండిపడ్డారు. ప్రధానిని, ప్రజలను దూరం చేయలేరని విమర్శించారు. ప్రధానితో ఫోనులో మాట్లాడటానికి కూడా ఛన్నీ నిరాకరించారని, దీన్ని బట్టి చూస్తే- ఇది ప్రీప్లాన్డ్‌గా కనిపిస్తోందని నడ్డా ధ్వజమెత్తారు.

ప్రాణాలతో తిరిగి వెళ్తున్నా..
కాగా- ఈ ఘటనపై ప్రధానమంత్రి మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాణాలతో తిరిగి వెళ్తున్నానని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీకి తెలియజేయాలని అన్నారు. ఢిల్లీకి బయలుదేరి వెళ్లడానికి మోడీ.. ఫిరోజ్‌పూర్ నుంచి తిరిగి భటిండా విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులతో మాట్లాడారు. తాను పంజాబ్‌కు వచ్చి, ప్రాణాలతో తిరిగి వెళ్తున్నానని, మీ ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్పండి.. అని తెలిపినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు పేర్కొన్నారు.