హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను భారతీయుడ్ని, నాకు హక్కుంది: అసదుద్దీన్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాను భారతదేశ పౌరుడినని, రాజ్యాంగ పరిధిలో తనకూ తన పార్టీకి పార్లమెంటు ప్రజాస్వామ్యంలో పాల్గొనే హక్కుందని, ఎన్నికల్లో పాల్గొనే హక్కు కూడా ఉందని మజ్లీస్ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తనను దేశ వ్యతిరేకి అని ఎవరన్నా సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ మంగళవారం ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముస్లిం ఓటు బ్యాంక్ అనే భ్రమను బిజెపి తొలగించిందని ఆయన అన్నారు.

ముస్లింలు ఎప్పుడూ తనను ఓ నాయకుడిగా పిలువలేదని, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు వంటి నాయకుల వైపు చూశారని ఆయన అన్నారు. మజ్లీస్ మత పార్టీ కాదని చెప్పడానికి తాను ఇదంతా చెబుతున్నట్లు ఆయన తెలిపారు. బిజెపికి, ఎన్డీఎకు ఎన్నికల్లో మెజారిటీ రావడానికి తాను కారణం కాదని ఆయన అన్నారు.

పార్లమెంటులో ముస్లిం ఎంపీలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం పట్టించుకోవాల్సిన అంశమని, బహుళత్వాన్ని కోరుకునే మనకు ముస్లిం ఎంపీలు లేకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన అన్నారు. పార్లమెంటులో రాజకీయ ప్రాతినిధ్యం పెరగకపోతే సామాజికాభివృద్ధి జరగదని, ముస్లింలకు రాజకీయ సాధికారత అవసరమని ఆయన అన్నారు.

Im an Indian, I have right to participate in election: Asaduddin Owaisi

ఉత్తరప్రదేశ్ శాసనసభలో 64 మంది ముస్లిం శాసనసభ్యులున్నా ఫలితం ఏమీ లేదని, ముస్లింలకు కావాల్సింది బినామీ నాయకత్వం కాదని, అంత మంది ముస్లిం శాసనసభ్యులు ఉన్నా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మతఘర్షణలు జరిగాయని ఆయన అన్నారు. ప్రసార భారతి చైర్మన్ సూర్యప్రకాశ్ రాస్తున్న వ్యాసాల పట్ల ఆయన తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు.

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభకు ఎన్నికైతే మిన్ను విరిగి మీద పడ్డట్టు మాట్లాడుతున్నారని, తాము రాజ్యాంగాన్ని విశ్వసిస్తామని, రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు ప్రశ్నలు వేసే అధికారం తమకు ఉందని ఆయన అన్నారు. భారతీయుడిగా తనకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందని, తాము గెలవడం వల్ల ఏదో జరిగిపోతుందనే భయాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని, సరైన దిశలో ఆలోచించేవారు ఆ పనులు చేయడం లేదని ఆయన అన్నారు.

ఔరంగాబాద్‌లో పాస్‌పోర్టు కార్యాలయం లేదని, మాలేగావ్‌లో ఓ జాతీయ బ్యాంకు లేదని, అభివృద్ధి తమకు కూడా అవసరమని, తాము ఎన్నికల్లో ముస్లిమేతరులను కూడా నిలబెట్టామని, తాము దళితులూ బీసీలతో కలిసి పనిచేస్తున్నామని, భారతదేశాన్ని బలోపేతం చేయడమే తమ ఉద్దేశ్యమని, ప్రజలు ఓటేయడం వల్లనే తాము గెలుస్తున్నామని ఆయన అన్నారు. ప్రజలకు అభివృద్ధి కావాలని ఆయన అన్నారు. హజ్ యాత్రకు ఇచ్చే సబ్సిడీ ఎత్తేసినా తమకు అభ్యంతరం లేదని, తాము అటువంటి సబ్సిడీలను కోరుకోవడం లేదని, దళిత మైనారిటీలకు అభివృద్ధి కావాలని ఆయన అన్నారు.

భారతీయ పౌరులుగా ముస్లింలు కూడా ఇన్నాళ్లూ ఓటేశారని, తమకు కూడా అధికారంలో పాలు పంచుకునే హక్కుందని, అభివృద్ధికి అది అవసరమని, పేదలకు చదువు ముఖ్యమని, అది అందితే సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని, తాము అదే కోరుకుంటున్నామని ఆయన అన్నారు. మహరాష్ట్రలో రెండు సీట్లు గెలిచామని, కర్ణాటకలో పనిచేస్తున్నామని, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా తాము పనిచేస్తున్నామని ఆయన చెప్పారు.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై తమకు నమ్మకం ఉందని, దేశంలో శాస్త్రీయ దృష్టికోణాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. భారతదేశం మతపరమైన దేశమని, తాను ఓ మతానికి చెందినవాడిగా గర్విస్తానని ఆయన అన్నారు. అయితే, అది రాజకీయాల్లోకి రాదని ఆయన అన్నారు. తాము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు.

మీరు జాతీయ నాయకుడిగా విస్తరించాలని చూస్తున్నారా అని అడిగితే తాను గల్లీ లీడర్‌నే అని, అలా ఉండడానికే ఇష్టపడుతానని ఆయన నవ్వుతూ సమాధానం ఇచ్చారు. తమ పార్టీని దేశ వ్యతిరేకమైనదిగా అభివర్ణిస్తే సహించేది లేదని, కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ముస్లిం యువకులకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం కల్పించడానికి తమ కృషి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటారా అని అడిగితే ఎన్నికలకు ఇంకా సమయం ఉందని జవాబిచ్చారు. గులాబీ కారులో తిరుగుతున్నారని ఓ జర్నలిస్టు చమత్కరించగా, తన కారును తానే నడుపుకుంటానని, స్టీరింగ్ తన చేతిలో ఉందని, క్లచ్ తన చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి నడుస్తున్నారనే అర్థంతో జర్నలిస్టు ఆ ప్రశ్న వేశాడు.

English summary
MIM chief and Hyderabad MP Asaduddin Owaisi said that he is Indian and he has every right to contest the elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X