• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నరేంద్ర మోదీకి 70ఏళ్లు: ఆయన ముందున్న సవాళ్లు ఏమిటి? ప్రపంచం ఆయన్ను ఎలా చూస్తోంది?

By BBC News తెలుగు
|

నరేంద్ర మోదీ

భారత రాజకీయాల్లో విశ్రాంతి పొందే వయసంటూ ఏమీలేదు. అయితే, నరేంద్ర మోదీ 70వ పడిలోకి అగుడుపెట్టిన తరుణంలో ఆయన తదుపరి తీసుకోబోయే చర్యలు, ఎదురవుతున్న సవాళ్లపై చర్చ జరుగుతోంది.

బీజేపీలో స్వచ్ఛంద పదవీ విరమణ వయసు 75ఏళ్లు. దీంతో రాబోతున్న నాలుగైదేళ్లు మోదీకి కీలకంగా మారబోతున్నాయి.

మోదీ లక్ష్యాలు మూడు కీలక అంశాలపై ఆధారపడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ, విదేశీ వ్యవహారాలు, ఆయన శైలి రాజకీయాలు వీటిలో ఉన్నాయి. గత ఆరేళ్ల పాలనను ఆర్థిక వ్యవస్థ పతనం, అసమ్మతి పెరుగుదల, కొన్ని అంశాలపై ప్రజలు వర్గాలుగా విడిపోవడం, అధికారాల కేంద్రీకరణ తదితర అంశాలపై విమర్శిస్తున్నారు. చాలా మంది ఆయన పాలనను సమర్థిస్తున్నారు కూడా. అవినీతి నిర్మూలన, పేదలకు పథకాలు చేరవేయడం తదితర అంశాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మోదీ

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై దృష్టి..

వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ఘర్షణల నడుమ, నరేంద్ర మోదీ విదేశాంగ విధానానికి పెద్ద పరీక్షే ఎదురవుతోంది. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ 18సార్లు భేటీ అయ్యారు. అయితే, వారి మధ్య కరచాలనాలు మినహా పెద్దగా ఏమీ జరగనట్లు ఇప్పుడు అనిపిస్తోంది.

''మోదీ కొత్తగా ఆలోచించాలి. వాణిజ్య ఒప్పందాలపై పునరాలోచనలు జరపాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలతో సమీకరణాల విషయంలో కొత్త వ్యూహాలను సిద్ధం చేయాలి. ముఖ్యంగా భారత వ్యూహాత్మక స్వతంత్రతకు ఎలాంటి ముప్పూ కలగకుండా జాగ్రత్త వహించాలి''అని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు, విదేశాంగ నిపుణుడు శేషాద్రి చారి వ్యాఖ్యానించారు.

కరోనావైరస్ వ్యాప్తి నడుమ మారుతున్న ప్రపంచ సమీకరణాల నేపథ్యంలో మోదీకి నేడు విదేశాంగ విధానం విషయంలో చాలా సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

''2014 నుంచి మోదీ విదేశాంగ విధానంలో పొరుగు దేశాలకు పెద్ద పీట వేశారు. ప్రస్తుతం ఆరేళ్లు గడిచిన నేపథ్యంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, భారత్‌తో ఇరాన్ సంబంధాలు, రష్యాతో రక్షణ ఒప్పందాల భవిష్యత్.. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆధారపడి ఉంది. ఇతర దేశాలతో మన వాణిజ్య సంబంధాలనూ ఈ ఎన్నికలు ప్రభావితం చేయనున్నాయి''అని చారి చెప్పారు.

జిన్‌పింగ్, మోదీ

ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వెంబడి చైనా బలగాలతో ఘర్షణలు పెద్ద సవాల్‌గా మారినట్లు ద హిందూలోని జాతీయ, దౌత్య సంబంధాల ఎడిటర్ సుహాసిని హైదర్ చెప్పారు. మరోవైపు కోవిడ్-19 వ్యాప్తి నడుమ కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు.

''కోవిడ్-19 వ్యాప్తి నడుమ ప్రపంచీకరణ తిరోగమన బాట పడుతోంది. దేశాలు తమ స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నాయి. దీంతో ఉద్యోగాలకు గండి పడటం, విదేశాల్లో భారతీయులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ విషయంలోనూ భారత్ సిద్ధంగా ఉండాలి. పొరుగు నుండే తాలిబాన్లతో వ్యవహరించేందుకు సన్నద్ధం కావాలి''

ప్రపంచం మోదీని ఎలా చూస్తుందనే అంశంపై బీజేపీ, భారత సంస్థలు దృష్టిపెట్టాయి. 2002 గుజరాత్ ఘర్షణల అనంతరం పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్‌ఆర్‌సీ), జమ్మూకశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు తదితర నిర్ణయాలు మోదీ ఇమేజ్‌పై ప్రభావం చూపించాయి.

''దేశీయ విధానాల విషయంలో మోదీ ప్రభుత్వానికి ఇప్పటికీ సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జమ్మూకశ్మీర్ విభజన, సీఏఏ/ఎన్‌ఆర్‌సీ విషయంలో ఇవి మరింత ఎక్కువగా ఉన్నాయి''అని హైదర్ వివరించారు.

నిర్మలా సీతారామన్, నరేంద్రమోదీ

ఆర్థిక వ్యవస్థ కీలకం..

ఆర్థిక రంగంలో ఇదివరకటి యూపీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెబుతూ మోదీ అధికారంలోకి వచ్చారు. ప్రజలకు అచ్చే దిన్(మంచి రోజులు) తీసుకొస్తామని ఆయన మాటిచ్చారు.

అయితే, మోదీని ఉద్యోగ కల్పన వ్యతిరేకిగా ప్రస్తుతం విపక్షాలు విమర్శిస్తున్నాయి. కుంటుబడుతున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న నిరుద్యోగిత నేడు ఆయన ముందున్న అతిపెద్ద సవాళ్లు.

మోదీ సరైన మార్గంలోనే నడుస్తున్నారని, ఆయన చర్యలతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని రాజ్యసభ ఎంపీ, రచయిత, ఆర్థిక నిపుణుడు స్వపన్‌దాస్ గుప్తా వ్యాఖ్యానించారు.

''ఇవి అసాధారణ పరిస్థితులు. ఇలాంటివి ముందెన్నడూ మనం చూడలేదు. మార్కెట్‌లో నగదు ఉండేలా చూడటంలో మోదీ ప్రభుత్వం విజయం సాధిస్తోందనే చెప్పాలి. మోదీ చాలా బాగా పనిచేస్తున్నారని అందరూ నమ్ముతున్నారు. కోవిడ్-19 తర్వాత కొత్త అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు. కోవిడ్-19ను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహాలు ఎవరి దగ్గరా లేవు''

విదేశాలతో సంబంధాలు ప్రభావితం కాకూండానే భారత్ సొంత కాళ్లపై నిలబడేందుకు మోదీ తీసుకున్న చర్యలు సరైన దిశలోనే పడుతున్నాయని దాస్‌గుప్తా వివరించారు. ''ప్రభుత్వం విశ్వసనీయత పోకుండా చూసుకోవడం, భవిష్యత్‌పై ఆందోళనతో ప్రస్తుత పరిస్థితులపై దృష్టి పెట్టలేకపోవడం తదితర సవాళ్లు ఎదురువుతున్నాయి''అని ఆయన అంగీకరించారు.

మోదీ

ఆర్థిక మందగమనానికి బాధ్యత తీసుకోకూండా మోదీ తప్పించుకుంటున్నారని లాస్ట్ డికేడ్ పుస్తక రచయిత, సీనియర్ జర్నలిస్టు పూజా మెహ్రా వ్యాఖ్యానించారు.

''ప్రభుత్వ ఆదాయ మార్గాలు కోసుకుపోయాయి. దీంతో ప్రజాప్రయోజన పథకాలకు పెట్టే ఖర్చుపై ప్రభావం పడుతోంది. ఇదే ఆయన ముందున్న అసలైన సవాల్. వేతనాలు, బకాయిల చెల్లింపులు ఎప్పటికప్పుడు జరిగితే ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి కొంత వరకూ తగ్గుతుంది. అయితే, ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని అలవెన్సులు ప్రస్తుతం నిలిపివేశారు. జీతాలు, పింఛన్లు చెల్లించలేని రోజులు కూడా వస్తాయేమో చూడాలి''

''అయితే త్వరలో జరగబోతున్న బిహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఆర్థిక వ్యవస్థ అంశంగా మారుతుందా? లేదా అనేది ముఖ్యమైన అంశం. ఉద్యోగాల కల్పన, రైతులకు గిట్టుబాటు ధరల విషయంలో మోదీ హామీలు నెరవేర్చనప్పటికీ ఆయన్ను ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ ప్రజాదరణ ఎన్నిరోజుల వరకూ ఉంటుందనేదే అసలైన ప్రశ్న''

దౌత్యం, రాజకీయాలే మోదీ బలమని అందరూ చెబుతుంటారు. ఆర్థిక వ్యవహారాల విషయంలో మాత్రం ఆయన ఆర్థిక నిపుణులపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ఆర్థిక నిపుణులతోనే సమస్య ఉందని మెహ్రా భావిస్తున్నారు. ''మంచి ఆర్థిక నిపుణులపై మోదీ అంత నమ్మకం ఉంచరు. ఆయన నమ్మే సలహాదారులు.. పెద్ద నోట్ల రద్దు లాంటి సలహాలు ఇస్తుంటారు. దీంతో మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది''

రాహుల్‌తో పోలిస్తే..

1980ల్లో మోదీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచీ ఆయన రచించిన వ్యూహాలన్నీ ఫలించినట్టే చెప్పాలి. ప్రస్తుతం 50ఏళ్ల రాహుల్ గాంధీతో పోలిస్తే.. మోదీ రాజకీయంగా దృఢంగానే ఉన్నట్లు చెప్పుకోవచ్చు. అయితే ఆయన భవిష్యత్ ఎలా ఉంటుంది?

''ప్రజాస్వామ్యాల్లో రాజకీయ నాయకులకు ఎదురయ్యే అతిపెద్ద సవాల్ ఏంటంటే.. తమకు ఎదురు నిలిచే ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ లేకపోవడం. మంచి విపక్షాలు ప్రభుత్వంతోపాటు ప్రత్యర్థులకూ మంచి చేస్తాయి. అప్పుడే నాయకులు మంచి వ్యూహాలు రచించగలుగుతారు''అని ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో మాజీ డిప్యూటీ ఎడిటర్ సీమా చిష్టి వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ విముక్త భారత్ కలను మోదీ సాకారం చేయగలరా? తన పాలనను సుస్థిరం చేసేందుకు రాబోయే సంవత్సరాల్లో మోదీ దృష్టి కేంద్రీకరిస్తారు. దిల్లీలోని రాజ్‌పథ్ పునర్నిర్మాణ ప్రాజెక్టును మోదీ కలల ప్రాజెక్టుగా ఇటీవల పట్టణాభావృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ పూరి అభివర్ణించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్ పనులను అహ్మదాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్‌కు అప్పగించారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటి నుంచీ వీరిద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయి.

ప్రపంచం, భారత్‌ తనను ఎలా గుర్తుపెట్టుకోవాలని మోదీ అనుకుంటున్నారు? ఆయనకు రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లు ఏంటి?

''హిందూత్వ సిద్ధాంతాలను మోదీ బాగా నమ్ముతారు. అయితే, ప్రపంచ నాయకుడిగా ఆయన్ను అందరూ గుర్తుపెట్టుకోవడానికి వస్తే.. ఆయన్ను గాంధీతో పోల్చాల్సి ఉంటుంది. విదేశాల్లోని భారతీయులనూ ఆయన ఏకతాటిపైకి తీసుకురావాల్సి ఉంటుంది. కానీ స్వదేశంలో అందరినీ ఒక సీసాలో పెట్టాలని చూస్తూ.. విదేశాల్లో వారిని తన వెంట రావాలని కోరుకోవడం పూర్తి వైరుద్ధ్యంగా ఉంటుంది''అని చిష్టి వ్యాఖ్యానించారు.

మరోవైపు కాంగ్రెస్ ఇమేజ్ మారేవరకూ మోదీకి రాజకీయంగా ఎలాంటి అవరోధాలు ఎదురుకావని ఇండియా టుడే డిప్యూటీ ఎడిటర్ ఉదయ్ మహుర్కార్ వ్యాఖ్యానించారు.

''కాంగ్రెస్.. మైనారిటీలను బుజ్జగించడంపై దృష్టిపెడితే.. మోదీకి ఎలాంటి అడ్డూ లేనట్టే. అవినీతి మచ్చలేని నాయకుడిగా మోదీకి ప్రజల్లో మంచి పేరుంది''

''ప్రజలకు పథకాల ఫలాలు చేరవేయడంలో మోదీ ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి. మోదీని విమర్శించేవారు భవిష్యత్‌లో ఆయన చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. కానీ అలాంటిదేమీ ఉండదు. కోవిడ్-19 తర్వాత మరింత గట్టి మోదీని మనం చూడబోతున్నాం''

ఇంతకీ 70వ సంవత్సరం నాడు మోదీ తనను తాను ఎలా ఉండాలని కోరుకుంటారు? గట్టి మోదీనా? ప్రపంచ నాయకుడైన మోదీనా? హిందూ మోదీనా? లేక అందరూ మెచ్చే మోదీనా? లేదంటే అన్నీనా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
PM Modi celebrates 70th birthday while the global leaders wished him. ప్రధాని నరేంద్ర మోడీ తన 70వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ప్రపంచాధినేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X