• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హైదరాబాద్‌లో వానొస్తే కాలనీలన్నీ కాల్వలై పోవాల్సిందేనా? ఈ పరిస్థితి ఎలా మారుతుంది?

By BBC News తెలుగు
|

హైదరాబాద్ వర్షాలు

"నగర వీధుల్లో నీటిని వెదజల్లే ఫౌంటైన్లు, చిరుగాలికి ఊగిసలాడే పూవులు, దట్టంగా పూత పూసిన మామిడి చెట్ల మధ్య నాట్యమాడుతున్న నెమలులు, ప్రశాంతత నిండిన వీధులు, ఇండో- పర్షియన్ సంస్కృతికి చిహ్నంగా ఎర్రని టోపీ (ఫెజ్) ధరించి, గులాబీలు, నైటింగేల్ గురించి కలలు కన్న హైదరాబాద్ పౌరులు” - చరిత్రకారుడు విలియం డాల్రింపిల్ వైట్ ముఘల్స్ పుస్తకంలో 16వ శతాబ్దపు హైదరాబాద్ గురించి రాసిన వర్ణన ఇది.

వర్షం కురిస్తే నీట మునిగిన కాలనీలు, వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు, జలమయమైన అనేక ప్రాంతాలు, ఎటు చూసినా ఎత్తైన ఆకాశ హర్మ్యాలతో కాంక్రీట్ జంగిల్ ని తలపించే కట్టడాలు, కట్టలు తెగి మురికి నీరుతో పొంగి ప్రవహిస్తున్న చెరువులు - ఇదీ నేటి నగర పరిస్థితి.

400 సంవత్సరాల సుదీర్ఘ సాంస్కృతిక చరిత్ర కలిగి దేశంలోనే రెండవ అతి పెద్ద మెట్రోపాలిటన్ నగరంగా అవతరించిన హైదరాబాద్ 1990 వ దశకంలో వచ్చిన ఐటి విప్లవం కారణంగా ఐటి కారిడార్ గా పేరు పొందింది.

16 వ శతాబ్దంలో 3.5 చదరపు కిలోమీటర్ల ఉన్న నగర విస్తీర్ణం 7228 చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి విస్తరించి, 2011 జనాభా లెక్కల ప్రకారం 70 లక్షల 70,000 ఉన్న నగర జనాభా నేడు కోటి 20 లక్షలకు చేరింది. ఇది 2030 నాటికి ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన 28 మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటిగా నిలుస్తుందని అంచనా.

హైదరాబాద్ వర్షాలు

నగరంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఏర్పడిన వరదల బారిన పడి 30 మందికి పైగా మరణించినట్లు ఏఎన్ఐ వంటి వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ఎంత మంది మరణించారనే విషయం పై ఇంకా అధికారిక ధ్రువీకరణ లేదు. నగర వీధుల్లో వరద ఉధృతంగా ప్రవహించడంతో పలు చోట్ల కార్లు, బైకులు నీటిలో కొట్టుకుపోయాయి. సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు సహాయక సిబ్బంది, సైన్యం కూడా రంగంలోకి దిగారు.

సాధారణంగా జులై నుంచి సెప్టెంబరు మధ్యలో హైద్రాబాదులో 80 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలలో సగటున 4. 7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని అక్టోబరు 15న తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన వాతావరణ నివేదిక చెబుతోంది.

హైదరాబాద్ నగరంలో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా భారీ వర్షాలు కురిసినప్పుడు పలు ప్రాంతాలలో భారీగా నీరు ఇళ్లలోకి రావడంతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.

ఈ వారంలో కురిసిన వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రానికి 5,000 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లిందంటూ ,సహాయక చర్యల నిమిత్తం కేంద్రం 1,350 రూపాయిల కోట్ల నిధులను విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రశేఖర రావు ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు.

వరద ప్రాంతాల్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు

ఐటి కారిడార్‌గా పేరు పొంది దేశంలోనే రెండవ పెద్ద మెట్రోపాలిటన్ నగరంగా చెప్పుకునే హైదరాబాద్ నగరంలో వర్షాలు కురిసిన ప్రతి సారీ ఇటువంటి పరిస్థితి ఎందుకు తలెత్తుతోంది? దీనికి కేవలం అధిక వర్షపాతమే కారణమా?

అధిక స్థాయిలో వర్షాలు కురవడం వలన మాత్రమే నగరాన్ని భారీ స్థాయిలో వరదలు ముంచెత్తాయని చెప్పలేమని నిపుణులు అంటున్నారు.

"హైదరాబాద్ నగరంలో వరదలు రావడం ఇది మొదటి సారి కాదు ఓల్డ్ సిటీలో చాలా ప్రాంతాలలో ఇప్పటికీ పురాతనమైన డ్రైనేజీ విధానమే కొనసాగుతోంది. 40 వేల జనాభా కోసం నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ పూర్తి స్థాయిలో పునరుద్ధరణ జరగకపోవడం కూడా ఈ వరదలకు ఒక కారణం" అని ఉస్మానియా విశ్వవిద్యాలయం భౌగోళిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ బాల కిషన్ అన్నారు.

1956లో హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రారంభమైనప్పటి నుంచి ఈ నగరానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. 2041 నాటికి నగర జనాభా ఒక కోటి 20 లక్షలకు చేరుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో అంచనా వేసింది.

"అయితే, జనాభా పెరుగుదలకు తగిన రీతిలో మౌలిక సదుపాయాల కల్పన మాత్రం జరగలేదు" అని బాల కిషన్ అంటారు.

నీట మునిగిన ఇంటి నుంచి వయోధికుడిని రక్షిస్తున్న పోలీసులు

1908లో హైదరాబాద్ నగరానికి భారీ వరదలు వచ్చి నగరం మునిగినప్పుడు వరదలను నివారించేందుకు అవసరమైన ప్రణాళికలను సూచించాల్సిందిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నిజాం కోరారు.మూసీతోపాటు దాని ఉపనదిగా ఉండే ఈసీ పై కొన్ని జలాశయాలను నిర్మించాలని ప్రతిపాదిస్తూ విశ్వేశ్వరయ్య ఓ ప్రణాళికను సిద్ధం చేశారు. మురుగునీటి పారుదలకు అవసరమైన సూచనలు చేశారు.

అప్పుడు నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థే ఇప్పటికీ చాలా పటిష్టంగా ఉంది అని బాల కిషన్ అన్నారు. కాకపొతే, దీనిని పూర్తిగా పునరుద్ధరించడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాని పని అని ఆయన అంటారు.

హైదరాబాద్ వరదలు

హైదరాబాదు జనాభాలో 25 శాతం మంది మురికి వాడల్లోనే నివసిస్తున్నారని డిజంత దాస్ అనే పరిశోధకురాలు హైదరాబాద్ పెరుగుదల, పునర్వ్యవస్థీకరణ అనే అంశం పై రాసిన పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా మూసీ నది ఒడ్డున నివసిస్తున్న ప్రాంతాల వైపు దృష్టి సారించలేదని ఆ అధ్యయనం పేర్కొంది.

హైదరాబాదు జనాభాలో 25 శాతం మంది మురికి వాడల్లోనే నివసిస్తున్నారని హైదరాబాద్ పెరుగుదల, పునర్వ్యవస్థీకరణ అనే అంశం పై భౌగోళిక శాస్త్ర పరిశోధకురాలు డిజంతా దాస్ రాసిన పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా మూసీ నది ఒడ్డున నివసిస్తున్న ప్రాంతాల వైపు దృష్టి సారించలేదని ఆ అధ్యయనం తెలిపింది.

ఈ పరిస్థితికి అద్దం పడుతూ ప్రస్తుతం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పలు ప్రాంతాలు జల దిగ్బంధమై చాలా నష్టానికి గురయ్యాయి.

హైదరాబాద్ మౌలిక సదుపాయాల కల్పన కోసం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ 5,380 కోట్ల రూపాయిలు కేటాయించగా అందులో 4900 కోట్ల రూపాయిలు కేవలం డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, పునరుద్ధరణ కోసమే కేటాయించారని బాలకిషన్ తెలిపారు. కరోనా కారణంగా ఈ పనులు ముందుకు సాగి ఉండకపోవచ్చని అభిప్రాయ పడ్డారు.

హైదరాబాద్ వర్షాలు

ఉప్పల్ ఎంఎల్ఏ బేతి సుభాష్ రెడ్డి నియోజకవర్గంలోని వరద బాధిత ప్రాంతాలను సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక మహిళ ఆయనను ఆగ్రహంతో నిలదీసిన వీడియో వైరల్ అయింది. “ఈ పరిస్థితి అంతటికీ మీరే బాధ్యులు, మీరు న్యాయం చేస్తారా లేదా, న్యాయం జరగకపోతే మీ పేరు రాసి చనిపోతాం” అంటూ ఆమె ఎంఎల్ఏపై అరిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ పరిస్థితికి పూర్తిగా ప్రభుత్వాన్నే బాధ్యత చేయడానికి లేదని, కాలువలను చెత్తా చెదారాలతో నింపే ప్రజల నిర్లక్ష్య వైఖరి కూడా ఒక కారణం అని బాల కిషన్ అంటారు.

ఈ అభిప్రాయాన్ని రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు కల్పన రమేష్ సమర్ధించారు. ఆమె వర్షపు నీరు సంరక్షణ, చెరువులు బావుల సంరక్షణ కోసం కొంత మంది వాలంటీర్లతో కలిసి పని చేస్తున్నారు.

"ప్రభుత్వమంటే మనమే కదా, ప్రతీ పనికీ ప్రభుత్వం వచ్చి చూస్తుందని ఎదురు చూడకుండా మన పరిధిలో భూగర్భ జలాల సంరక్షణకు ఏమి చేయాలో ఆలోచించడం ఇప్పటికైనా మొదలు పెట్టకపోతే ఇప్పుడు అందుబాటులో ఉన్న మంజీరా లాంటి నదుల నీరు కూడా 2050 కంతా అంతమైపోతుంది" అని ఆమె హెచ్చరించారు.

హైదరాబాద్ లో ఒకప్పుడు 2000 చెరువులు ఉండేవని నేడు 200 కూడా కనిపించటం లేదు. చెరువులను, బావులను పూడ్చి చేపడుతున్న నిర్మాణాలు చేపట్టడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమని కల్పన అన్నారు. దీనికితోడు 80 అడుగుల కాల్వలు, 8 అడుగులకు చేరిపొతే వ్యర్ధాలు బయటకు ఎలా వెళతాయి అని ప్రశ్నించారు?

ఉప్పల్‌ చెరువు నీరు

హైదరాబాద్ నగరానికి 5,000 కిలోమీటర్ల నాలాలు, కాలువలు అవసరమైతే, ప్రస్తుతం కేవలం 1500 కిలోమీటర్ల మేర మాత్రమే నాలాలు ఉన్నాయని ఆమె అన్నారు. 4,00,000 డ్రైనేజీ గుంతలు ఉండాల్సిన చోట కేవలం 2,00,000 డ్రైనేజీ గుంతలు మాత్రమే ఉన్నాయి అని కల్పన అన్నారు.

ఎవరైనా ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు దానికి తగిన చట్టపరమైన ఆమోదాలు ఉన్నాయా లేదా? వర్షపు నీరు నిల్వ చేసేందుకు తగిన ఇంకుడు గుంతలు ఉన్నాయా లేదా లాంటి అంశాలన్నీ పరిశీలనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు.

గృహ నిర్మాణాలకు ఆమోదం తెలిపే ముందు అధికారులు ముందు చూపుతో వ్యవహరించాలని అలాగే ప్రజలు కూడా అత్యాశకు పోకుండా ఆ ప్రాంత భౌగోళిక స్వరూపం అర్ధం చేసుకుని గృహ నిర్మాణం చేసుకుంటే భవిష్యత్తులో విపత్తులను ఎదుర్కొనే పరిస్థితి రాకపోవచ్చని బాల కిషన్ అభిప్రాయ పడ్డారు.

వాటర్ జోన్ల గురించి, గృహ నిర్మాణానికి అనువుగా ఉన్న స్థలాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభత్వం పై ఉందని అన్నారు. అవగాహన కల్పించడానికి చాలా మంది ఉన్నారు కానీ, నిజానికి ఇప్పుడు కావల్సింది క్షేత్ర స్థాయిలో పని చేయాల్సిన వ్యక్తులని కల్పన అన్నారు.

మరి దీనికి పరిష్కారం ఏమిటి?

ప్రతి ఒక్కరు వర్షపు నీరు నిల్వ ఉంచేందుకు తగిన ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించాలి.

చెరువులను, బావులను పునరుద్ధరించాలి. ఇటీవల హైటెక్ సిటీలో పునరుద్ధరించిన ఒక బావి ఈ వర్షాల సమయంలో 4 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేయగలిగినట్లు ఆమె చెప్పారు. గతంలో ఆ బావి ఒక డంపింగ్ యార్డ్ గా ఉండేది.

వర్షపు నీరు నిల్వ ఉండే కేంద్రాలు పెరగడం ద్వారా ఇలాంటి వరదలను నివారించవచ్చని ఆమె అన్నారు.

పబ్లిక్ ప్రైవేట్ సహకారంతో భూగర్భ జలాల సంరక్షణ, పునరుద్ధరణ కార్యక్రమాలను తక్షణమే మొదలుపెట్టాలని సూచించారు. లేని పక్షంలో ఇలాంటి వైపరీత్యాలు ఎదుర్కోవడం తప్పదని అన్నారు.

చెరువులను వ్యర్ధాలతో నింపడం ఆపాలని సూచించారు.

"భూ వినియోగ పద్దతులలో మార్పులు వస్తేనే కానీ, పరిస్థితులు మారవు" అని ఆమె అన్నారు.

"ప్లకార్డులు పట్టుకుని వాతావరణ మార్పులు కావాలంటే రావని అంటూ క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరూ పని చేయాలని, ఏ ఒక్కరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడటానికి లేదని అన్నారు. నీటి సంరక్షణ పట్ల సానుకూలంగా లేకపోయినా కనీసం తటస్థంగానైనా ఉండవలసిన అవసరం ఉంది. చేయి చేయి కలిస్తే చేయలేని మార్పు ఏమి ఉండదు" అని కల్పన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Roads in Hyderabad turn into canals with heavy rains hitting the city
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X