వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల్లో తొలి దశ కోవిడ్-19 వ్యాక్సీన్ తర్వాత ఏం జరిగింది... నేటికీ చాలామంది వ్యాక్సీన్ ఎందుకు వేయించుకోలేదు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

కరోనా వ్యాక్సినేషన్
Click here to see the BBC interactive

కోవిడ్ మహమ్మారి నుంచి గట్టెక్కించే దిశలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం మొదలుపెట్టింది. అందులో భాగంగా మొదటి విడతలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి వ్యాక్సీన్ ఇవ్వాలని నిర్ణయించింది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. తొలి దశ జనవరి 16న మొదలుపెట్టారు. అందులో భాగంగా కోవాగ్జిన్‌తో పాటుగా కోవిషీల్డ్ వ్యాక్సీన్లను అందిస్తున్నారు.

వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం, మునిసిపల్ సిబ్బంది, అంగన్‌వాడీ వర్కర్లు తొలి విడత వ్యాక్సీన్ తీసుకోవాల్సిన వారి జాబితాలో ఉన్నారు. ప్రభుత్వమే ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఈ వ్యాక్సీన్ అందిస్తోంది.

గత నెలలో తొలి దశ వ్యాక్సీన్ అందుకున్న వారికి ఫిబ్రవరి 13 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ మొదలు పెట్టారు. తొలి సారి టీకా తీసుకున్న తర్వాత 28 రోజుల్లో రెండో దశ టీకా తీసుకోవాల్సి ఉంటుంది. రెండు సార్లు వ్యాక్సీన్ తీసుకున్న తర్వాతే పూర్తి ఫలితాలు వస్తాయని ముందుగానే ప్రకటించారు. రెండో దశ టీకాల కోసం అంతా సిద్ధం చేస్తున్న సమయంలో తొలి దశ టీకా ప్రక్రియకు సంబంధించి తెలుగు రాష్ట్రాల అనుభవాలను ఓసారి చూద్దాం.

కరోనా వ్యాక్సినేషన్

తెలంగాణలో ఏం చేశారు?

దేశ వ్యాప్తంగా శుక్రవారం(ఫిబ్రవరి 12) నాటికి 75,05,010 మంది వ్యాక్సీన్ తీసుకున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో పాల్గొంటున్న వారు వ్యాక్సీన్ తీసుకోవడం కోసం తొలుత కోవిన్ యాప్ లోరిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా వ్యాక్సీన్ సెషన్స్ నిర్వహిస్తున్నారు. కేటాయించిన ప్రాంతంలో రిజిస్టర్ చేసుకున్న వారు వెళ్లి వ్యాక్సీన్ తీసుకోవాలి.

అయితే చాలామంది రిజిస్టర్ చేసుకుంటున్నప్పటికీ వ్యాక్సీన్ తీసుకోవడానికి నేటికీ సంశయం వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వ లక్ష్యాలకు, వాస్తవ పంపిణీకి వ్యత్యాసం కనిపిస్తోంది.

తెలంగాణలో 2.25 లక్షల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు వ్యాక్సీన్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఈ నెల 11 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 76,749 మంది మాత్రమే వ్యాక్సీన్ తీసుకున్నారు. దాంతో సుమారుగా మూడో వంతు మాత్రమే కోవిడ్-19 వ్యాక్సీన్ తీసుకున్నట్టు చెప్పవచ్చు.

ఫ్రంట్ లైన్ వర్కర్స్‌తో పాటుగా వారి కుటుంబీకులు, ఇతరులకు కలిపి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 2,70,234 మందికి వ్యాక్సీన్ అందించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

దీంతో రాష్ట్రంలో మొత్తంగా 2,98,848 మంది కోవిడ్-19 బాధితులుగా రికార్డుల్లో ఉండగా.. వ్యాక్సీన్ తీసుకున్న వారి సంఖ్య దానికన్నా తక్కువగా ఉండడం గమనార్హం.

ప్రతి జిల్లాలోనూ మృతుల సంఖ్య పెరిగింది.

ఏపీలోనూ అదే పరిస్థితి

ఆంధ్రప్రదేశ్‌లో కూడా కోవిడ్-19 వ్యాక్సీన్ కోసం యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న వారిలో మూడో వంతు మంది మాత్రమే వ్యాక్సీన్ తీసుకునేందుకు ముందుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9 లక్షల మంది వ్యాక్సీన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 11వ తేదీ నాటికి వ్యాక్సీన్ తీసుకున్న వారి సంఖ్య 3.5లక్షల లోపు ఉంది.

వ్యాక్సీన్ తీసుకున్న వారిలో 1.4లక్షల మంది మహిళలున్నారు. ఏపీలో తొలి వ్యాక్సీన్ కూడా మహిళా శానిటరీ వర్కర్‌కి విజయవాడలో ముఖ్యమంత్రి అందించారు. ఆ తర్వాత ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు కూడా వ్యాక్సీన్ తీసుకోవడంతో మహిళల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది.

వ్యాక్సీన్ కోసం రిజిస్టర్ చేయించుకుని ముందుకు రాని వారిలో సాధారణ సిబ్బందితో పాటుగా వైద్య శాఖలో ఉన్నత స్థాయి వారు కూడా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సంఖ్య 3.9 లక్షలు. కాగా మొత్తం వ్యాక్సీన్ తీసుకున్న వారి సంఖ్య దానికన్నా తక్కువగానే ఉంది.

బోధనాసుపత్రుల్లో పనిచేసే ప్రొఫెసర్లు, ఇతర నిపుణులు కూడా అనేక మంది వ్యాక్సీన్‌కి దూరంగా ఉన్నారు. ఉదాహరణకు శ్రీకాకుళం రిమ్స్‌లో అధికారులు, సిబ్బంది అంతా కలిపి మొత్తం సంఖ్య 1951. అందులో వ్యాక్సీన్ తీసుకున్న వారు కేవలం 383 మంది మాత్రమే. అంటే ఈనెల 10 నాటికి అక్కడి సిబ్బందిలో 1568 మంది ఇంకా టీకా తీసుకోలేదు. దాదాపుగా ఇదే రీతిలో అన్ని చోట్లా కనిపిస్తోంది.

కొత్త కరోనావైరస్

డెడ్ లైన్ కూడా పెట్టేశారు..

కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రభుత్వం డెడ్ లైన్ కూడా పెట్టింది. తక్షణం మొదటి విడత డోసు తీసుకోవాలని ఆదేశించింది. రెండో విడత టీకాల పంపిణీ ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఈనెల 25 లోగా హెల్త్ కేర్ వర్కర్లు, ఐసిడిఎస్ సిబ్బంది మొదటి డోస్ వేసుకోవాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల 25 తర్వాత వారికి మొదటి డోస్ పంపిణీ ఉండదని తేల్చేశారు. ఇతర శాఖల సిబ్బంది కూడా మార్చి 5లోగా మొదటి డోసు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా మొదటి డోసు తీసుకోవచ్చంటూ అవకాశం కల్పించారు.

అయినప్పటికీ వ్యాక్సినేషన్ నెమ్మదిగానే జరుగుతోందని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొంటున్న డాక్టర్ మారుతీ రావు బీబీసీతో అన్నారు.

''ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. పలు సూచనలు చేస్తోంది. వ్యాక్సీన్ వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని చెబుతోంది. ఇప్పటికే మా జిల్లా కలెక్టర్, ఆయన కుమార్తె సహా మేమంతా టీకాలు తీసుకున్నాం. ఆరోగ్యంగానే అన్నీ చక్కబెట్టుకుంటున్నాం. అయినా కొందరిలో అనుమానాలున్నట్టు కనిపిస్తోంది. అందుకే ప్రభుత్వం గడువు పెట్టినా వ్యాక్సీన్ స్వీకరించడం లేదని భావిస్తున్నాం''అని ఆయన తెలిపారు.

వ్యాక్సినేషన్

వెయ్యి మందిలో ముగ్గురికే అస్వస్థత

కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తున్నాయనే ప్రచారం వాస్తవం కాదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఎం రాఘవేంద్ర రావు వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరుపై బీబీసీతో మాట్లాడారు.

''వ్యాక్సీన్ తీసుకున్న వారిలో ప్రతి పది మందిలో ఒకరికి చిన్న పాటి ఒళ్లు నొప్పులు వస్తున్నాయి. 100 మందిలో ఒకరిద్దరికి జ్వరం వస్తోంది. వెయ్యి ముందిలో ముగ్గురికి జ్వరం, దగ్గు, కొద్దిగా నీరసం అనిపిస్తోంది. ఇప్పటి వరకూ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత ఏపీలో ఇద్దరు మరణించారు. వారిలో ఒకరికి గుండె సమస్య అని నిర్ధారణ అయ్యింది. మరొకరి మృతికి కారణాలపై పుణే నుంచి నివేదిక రావాల్సి ఉంది. ఎమైనా ఆరోగ్య సమస్యలుంటే, నిపుణుల సంప్రదించి వ్యాక్సీన్ తీసుకోవాలి. అయితే, కొందరు అపోహలతో వ్యాక్సీన్‌కి దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. దీనిపై అవగాహన పెంచుతాం''అని ఆయన వివరించారు.

కరోనా వ్యాక్సినేషన్

మృతులకు ప్రభుత్వం నుంచి పరిహారం

కోవిడ్ వ్యాక్సీన్ తర్వాత శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకి చెందిన మహిళా వాలంటీర్ పిల్లా లలిత మృతి చెందారు. వ్యాక్సీన్ వికటించి ఆమె మృతి చెందారంటూ బంధువులు వాపోయారు. దానిపై ప్రభుత్వం స్పందించింది. పిల్లా లలిత కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించింది.

అంతకుముందు గుంటూరు జిల్లాకు చెందిన ఆశా వర్కర్ 44 ఏళ్ల విజయలక్ష్మి కూడా మరణించారు. అయితే ఆమె మృతికి ఇతర కారణాలున్నాయంటూ అధికారులు ప్రకటించారు. అదే సమయంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్వయంగా విజయలక్ష్మి కుటుంబీలను పరామర్శించారు. రూ.10లక్షల నష్టపరిహారం ప్రకటించారు.

''ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు తగిన అవగాహన లేకుండా వ్యాక్సినేషన్ చేయిస్తున్నారు. కోటా పూర్తిచేయాలనే ఉద్దేశంతో కొందరు అధికారులు ఒత్తిడి పెడుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా చేపడుతున్న వ్యాక్సినేషన్ మూలంగా కొందరికి ప్రాణాల మీదకు వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 200 మంది వరకూ ఆసుపత్రుల పాలయ్యారు. ఇలాంటివి పునరావృతం కాకూడదు. విజయలక్ష్మి సహా మృతులందరికీ ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం అందించి, వారి కుటుంబాలను ఆదుకోవాలి''అని ఏపీ ఆశా వర్కర్స్ యూనియర్ రాష్ట్ర కార్యదర్శి కే ధనలక్ష్మి కోరారు.

తెలంగాణలో కూడా వ్యాక్సీన్ తర్వాత పలువురు ఆస్వస్థతకు గురి కావడం, ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నమోదయ్యాయి.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
first phase of Covid-19 vaccine in Telugu states, Why aren't many people vaccinated?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X