భారత జవాన్ల చేతిలో చైనా సైనికులకు చావుదెబ్బ: 20 మందికి గాయాలు: తరిమికొట్టిన సరిహద్దు బలగాలు
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదాలను అడ్డుగా పెట్టుకుని తరచూ భారత్‌పై బుసలు కొడుతోన్న డ్రాగన్ కంట్రీ చైనాకు.. భారత జవాన్లు ముఖం పగిలేలా సమాధానం ఇచ్చారు. అక్రమంగా సరిహద్దులను దాటుకుని భారత భూభాగంపైకి ప్రవేశించడానికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనికులు చేసిన ప్రయత్నాలను తిప్పి కొట్టారు. వారిని కుట్రను భగ్నం చేశారు. వెనక్కి తరిమి కొట్టారు. ఈ సందర్భంగా ఈ రెండు దేశాల జవాన్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో 20 మందికి పైగా చైనా సైనికులు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సంభవించిన మూడు రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది.
ఈ సారి సిక్కిం సరిహద్దుల్లో..
ఇప్పటిదాకా లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా డ్రాగన్ కంట్రీ ఫోకస్.. ఈ సారి సిక్కింపై పడింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించిన చైనా.. సిక్కిం సమీపంలో ఆక్రమణకు తెగబడింది. నకు లా పాస్ మీదుగా భారత భూభాగంపైకి అక్రమంగా చొచ్చుకుని రావడానికి పీఎల్ఏ సైనికులు విశ్వప్రయత్నాలు చేశారు. భారత జవాన్లు వారి ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకోగలిగారు.

సరిహద్దుల్లో ఉద్రిక్తత..
ఈ సందర్భంగా చోటు చేసుకున్న వారి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 20 మంది పీఎల్ఏ సైనికులకు గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనలో నలుగురు భారత జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో సిక్కింలో భారత్-చైనా సరిహద్దుల వెంబడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రోజుల కిందట ఈ ఘర్షణ సంభవించగా చైనా సైనికాధికారులు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి రావడానికి అదే కారణమని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వెబ్సైట్ ప్రచురించింది.

నిరంతర నిఘా..
సిక్కిం సరిహద్దుల పొడవునా నిఘాను మరింత ముమ్మరం చేసినట్లు భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని అన్నారు. లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద వివాదాలను పరిష్కకరించుకోవడానికి రెండు దేశాల మధ్య కమాండర్ల స్థాయి చర్చలు కొనసాగుతోన్న ప్రస్తుత సమయంలో చైనా దురాక్రమణకు పాల్పడటాన్ని ఊహించలేదని అంటున్నారు. చర్చలపై ఇది ప్రభావం చూపబోదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. నకు లా పాస్ వద్ద భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి చైనా సైనికులు చేసిన ప్రయత్నాలను ఆ దేశం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.