భారత్ లో కరోనాకేసుల ఊగిసలాట; బూస్టర్ డోస్ తీసుకున్నా బిల్ గేట్స్ కు కరోనా!!
భారతదేశంలో కరోనా కేసులు మధ్య ఊగిసలాట కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా మూడు వేలకు పైగా కరోనా కేసులు నమోదు చేస్తున్న భారత్, తాజాగా రెండువేల కేసులతో కాస్త తగ్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో భారతదేశంలో 2897 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మునుపటి రోజుతో పోలిస్తే కేసుల పెరుగుదల కనిపిస్తుంది. గత 24 గంటల్లో 54 మరణాలు సంభవించాయి.
కొత్తగా నమోదైన మొత్తం కరోనా కేసులతో కలిపి భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,25,66,935 గా నమోదయింది. గత 24 గంటల్లో 2,986 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినుండి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి రేటు 98.74 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 19,494గా ఉంది. ఇక కరోనా యాక్టివ్ కేసుల శాతం 0.05% గా కొనసాగుతుంది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.61 శాతంగా ఉంది.

గత 24 గంటల్లో 14,83,878 మందికి కరోనా వ్యాక్సిన్ లు ఇచ్చారు. దీంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ పంపిణీ అయిన మొత్తం వ్యాక్సిన్ ల సంఖ్య 190 కోట్లకు పైగా చేరుకుంది. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలోనూ, మహారాష్ట్రలోని కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజా కరోనా కేసుల నేపధ్యంలో అలెర్ట్ అయ్యాయి. మరోవైపు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలుస్తుంది.
బిల్ గేట్స్ కు స్వల్ప లక్షణాలు ఉన్నట్లుగా బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ గా తేలిందని ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానని వైద్యుల సలహాలు తీసుకుంటున్నానని, తాను కోవిడ్ బూస్టర్ డోస్ కూడా వేయించుకున్నానని బిల్ గేట్స్ వెల్లడించారు. అత్యుత్తమ వైద్య సేవలు పొందే అవకాశం ఉండడం అదృష్టం అంటూ బిల్ గేట్స్ ట్వీట్ చేశారు.