అంతర్జాతీయంగా చైనాకు చెక్ పెట్టేందుకు మోడీ ప్లాన్: డెన్మార్క్ ప్రధానితో దైపాక్షిక చర్చలు
న్యూఢిల్లీ: సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉద్రిక్తతలకు కారణమవుతున్న చైనాను ఏకాకిని చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ.. డెన్మార్క్ ప్రధాని మెట్టె ప్రెడరిక్సెన్‌తో కీలక చర్చలు జరిపారు. ప్రపంచ వ్యాప్తంగా చైనాకు చెక్ పెట్టే విధంగా ఈ చర్చలు కొనసాగాయి.

చైనాపై ఆధారపడొద్దంటూ..
సోమవారం డెన్మార్క్ ప్రధానితో వర్చువల్ పద్ధతిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు భారత ప్రధాని మోడీ. ఈ సందర్భంగా చైనానుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా అనంతరం ఓకే దేశంపై సప్లై చైన్ ఆధారపడకూడదని స్పష్టం చేశారు. ఇది చాలా ప్రమాదకరమని కూడా వ్యాఖ్యానించారు.
చైనాకు చెక్ పెట్టేందుకు మరో మార్గం..
సప్లై చైన్‌ను మళ్లించడానికి, స్థితిస్థాపకత కోసం జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో తాము పనిచేస్తున్నామని తెలిపారు. తమ లాంటి ఆలోచన ఉన్న ఇతర దేశాలు కూడా తమతో కలిసి రావొచ్చని ఆహ్వానించారు ప్రధాని మోడీ. ఓ వైపు ఈశాన్య లడఖ్ సరిహద్దు ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఇండియా, చైనా అధికారులు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. చైనా, భారత్ బలగాల సరిహద్దు వద్ద భారీగా మోహరిస్తున్న విషయం తెలిసిందే.

డానిష్ ప్రదాని ప్రతిపాదనను స్వాగతించిన మోడీ..
సెకండ్ నాలెడ్జ్ సమ్మిత్ హోస్ట్‌గా వ్యవహరించాలన్న డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సెన్ ప్రతిపాదనను ఈ సందర్భంగా నరేంద్ర మోడీ స్వాగతించారు. భారత్-డెన్మార్క్ సంబంధాల మెరుగు కోసం ఇరు దేశాల ప్రధానులు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని ఆదివారమే విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. భారతదేశంలో 'వైట్ రివల్యూషన్'కు దోహదం చేస్తున్నప్పుడు.. డెన్మార్క్ భారతదేశంలో పెరుగుతున్న పవన శక్తి రంగంలో వాటాదారుగా అవతరించింది
భారతదేశం-డెన్మార్క్ పరస్పర ప్రయోజనాలను పంచుకుంటాయని, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నాయి.

మేకిన్ ఇండియాలో భాగంగా భారత్‌లో డానిష్ కంపెనీలు..
గత కొన్ని నెలలుగా, డానిష్ కంపెనీలైన ఎల్ఎమ్ విండ్, హాల్డోర్ టాప్సో, నోవోజైమ్స్ వంటివి కేంద్ర ప్రభుత్వ 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు ప్రతిస్పందనగా భారతదేశంలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్నాయి. మరో పెద్ద డానిష్ సంస్థ మెర్స్క్, భారతదేశంలోని మొత్తం షిప్పింగ్ కంటైనర్లలో దాదాపు 19 శాతం వాటాను కలిగి ఉంది. అదే సమయంలో, దేశంలోని వివిధ ప్రాంతాలలో వ్యవసాయ ఉత్పత్తుల కోసం కోల్డ్ స్టోరేజ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా డాన్‌ఫాస్ కీలకపాత్ర పోషించింది. మేధో సంపత్తి రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు డెన్మార్క్ డానిష్ పేటెంట్, ట్రేడ్ మార్క్ కార్యాలయంతో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.