• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హిందూ మహాసముద్రంలో చైనా దూకుడును ఎదుర్కోవడానికి భారత్ ప్రత్యేక వ్యూహం

By BBC News తెలుగు
|

హిందూ మహాసముద్రంలో చైనా తన దూకుడును పెంచుతూ భారత్‌కు సవాలుగా మారుతోంది. దీనికి ప్రతిగా భారత నావికాదళం ఈ ప్రాంతంలో కొన్నేళ్లుగా మిత్ర దేశాలతో కలిసి చేసే యుద్ధ విన్యాసాలను బాగా పెంచింది.

Ocean

రెండు రోజుల పాటు సాగిన పెసెక్స్ నావికాదళ యుద్ధ విన్యాసాలు దీనికి తాజా ఉదాహరణ. భారత్, అమెరికా నావికాదళాలు కలిసి తూర్పు హిందూ మహాసముద్ర క్షేత్రంలో తమ సామర్థ్యాలను ప్రదర్శించాయి.

భారతీయ నావికాదళ యుద్ధ నౌక శివాలిక్‌తో కలిసి హెలికాప్టర్, సముద్ర గస్తీ విమానం పీ8ఐ... అమెరికా నావికాదళం నౌక యూఎస్ఎస్ థియోడోర్ రూజ్వెల్ట్ కెరీర్ స్ట్రైక్ గ్రూప్‌లో పాల్గొన్నాయి.

విమాన వాహక నౌక, పెద్ద సంఖ్యలో విధ్వంసక నౌకలు, యుద్ధ నౌకలు, ఇతర నౌకలతో కూడిన భారీ దళం కెరీర్ స్ట్రైక్ గ్రూప్.

గత మంగళవారం ఫ్రాన్స్ సంయుక్త దళాల కమాండర్ రియర్ అడ్మిరల్ జాక్ ఫాయర్డ్ నేతృత్వంలో ఫ్రాన్స్ నావికాదళ ప్రతినిధుల మండలి ముంబయిలో నావికాదళ పశ్చిమ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ హరి కుమార్‌ను కలిశారు.

రెండు పక్షాల నడుమ సముద్ర రక్షణకు సంబంధించిన అంశాలపై నావికాదళాల మధ్య సహకారం మరింత పెంపొందించుకోవడం, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర రక్షణ అంశాలపై సంప్రదింపులు జరిగాయి.

భారత్, ఫ్రాన్స్ నావికాదళాల మధ్య వార్షిక ద్వైపాక్షిక 'వరుణ్’ విన్యాసాలు 2021 ఏప్రిల్‌లో జరగబోతున్నాయి. వీటిలో ఫ్రాన్స్ నావికాదళ కెరీర్ స్ట్రైక్ గ్రూప్ కూడా పాల్గొంటుంది.

ఇక ఏప్రిల్‌లో బంగాళాఖాతంలో ఫ్రాన్స్ నావికాదళం నేతృత్వంలో జరిగే 'లా పెరోస్’ విన్యాసాల్లో భారత నావికాదళం తొలిసారి పాలుపంచుకోనుంది.

ఈ విన్యాసాల్లో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా కూడా పాల్గొనబోతున్నాయి. ఫ్రాన్స్ నేతృత్వంలో సంయుక్త నావికాదళ డ్రిల్‌లో భారత్ పాల్గొనడం కీలక పరిణామమే.

గత జనవరి, ఫిబ్రవరిల్లో భారత నావికాదళం 'ట్రోపెక్స్’ పేరుతో అతిపెద్ద విన్యాస కార్యక్రమం నిర్వహించింది. నిర్వహణపరమైన సన్నద్ధతను పరీక్షించుకునేందుకు దీన్ని ఏర్పాటు చేసింది.

నౌకలు, సబ్‌మెరైన్లు, నావికాదళ విమానాలతోపాటు భారత సైన్యం, వాయుసేన, తీర గస్తీ దళాలు కూడా ఇందులో పాల్గొన్నాయి.

పెరుగుతున్న చైనా ప్రభావం

హిందూ మహాసముద్రంలో గత దశాబ్ద కాలంగా చైనా తమ ప్రభావాన్ని బాగా పెంచుకుంటూ వస్తోంది.

ఈ విషయమై భారత నావికాదళంలో పనిచేసిన విరమణ పొంది, ప్రస్తుతం సొసైటీ ఫర్ పబ్లిక్ స్టడీస్ డైరెక్టర్‌గా ఉన్న కొమోడోర్ సి.ఉదయ్ భాస్కర్‌తో బీబీసీ మాట్లాడింది.

హిందూ మహాసముద్రంలో చైనాను ఇప్పుడే ముప్పుగా భావించలేమని, ఓ సవాలుగా మాత్రం అనుకోవచ్చని ఆయన అన్నారు.

''హిందూ మహాసముద్రంలో చైనా ఉనికిని ముప్పు అని నేను వర్ణించను. నావికాదళ కోణంలో చూస్తే, ఇంకా చైనా ముప్పుగా పరిణమించలేదు. అయితే, భారత్ జాగ్రత్తగా ఉండాలి. ఈ క్షేత్రంలో ఏం జరుగుతోందన్నది నిశితంగా పరిశీలించాలి’’ అని ఉదయ్ భాస్కర్ అన్నారు.

దోపీడీలను నివారించే పేరుతో చైనా నావికాదళం తొలిసారి 2008-09లో హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి అక్కడ అలాగే తిష్ఠ వేసింది. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా తమకు ముఖ్యమైన ప్రాంతాల్లో తమ ఉనికి ఉండేలా కొన్నేళ్లుగా చైనా అవసరమైన చర్యలు చేపడుతూ వచ్చింది.

''అంతవరకూ కేవలం భౌగోళికంగా భారత్‌తో సరిహద్దు ఉన్న దేశమైన చైనా... ఇప్పుడు సముద్ర జలాలపై మనకు చేరువగా వచ్చింది. ఇది ఒక సవాలే. ఓ రకంగా భారత్ ప్రతిష్ఠ, ప్రయోజనాలకు నష్టం కలిగించే అంశం’’ అని ఉదయ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు.

హిందూ మహాసముద్రంలో చైనా ముద్ర ఇప్పుడు జిబూతి నుంచి ఆఫ్రికా వరకూ విస్తరించిందని, ఇది ఆందోళనకరమైన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు.

''చైనాతో ఇరాన్ ఈ మధ్య ఓ కీలక ఒప్పందం చేసుకున్నాయి. ఇరాన్‌లో చైనా ఉనికిని మనం తీవ్రంగా చూడొచ్చు. చమురు రవాణా మార్గాల విషయంలో భౌగోళికంగా ఇరాన్‌ భారత్‌కు చాలా ముఖ్యమైన దేశం’’ అని ఆయన అన్నారు.

''హిందూ మహాసముద్ర క్షేత్రంలో వివిధ దేశాల నావికాదళాలకు చైనా అతిపెద్ద ఎగుమతిదారుగా మారుతోంది. ముందు నుంచే మయన్మార్, శ్రీలంక, పాకిస్తాన్‌లకు సైనిక ఉపకరణాలు, సామగ్రిని అందిస్తూ వస్తోంది’’ అని ఉదయ్ భాస్కర్ వివరించారు..

ఇటీవల చైనా నుంచి బంగ్లాదేశ్ కొన్ని జలాంతర్గాములను కొనుగోలు చేసింది.

విన్యాసాలతో ప్రయోజనమెంత?

యుద్ధ విన్యాసాల ద్వారా వివిధ దేశాల నావికాదళాల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు పెరుగుతాయని, కలిసి పనిచేయడం సులువుగా మారేందుకు తోడ్పడతాయని ఉదయ్ భాస్కర్ అన్నారు.

''వీటితో ప్రయోజనమే. అయితే, వాటికి అయ్యే వ్యయం, కలిగే ప్రభావాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. నిత్యం యుద్ధ విన్యాసాలు చేస్తూ పోతే, అవి నౌకల పనితీరును కూడా దెబ్బతీయొచ్చు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

''ఏ సమయంలోనైనా యుద్ధానికి సిద్ధంగా ఉండటం నావికాదళం మొదటి పని. యుద్ధంలో పోరాడేందుకు సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉండాలి. నావికాదళ ఇతర అవసరాలను కూడా తీర్చుతూ సమన్వయం చేసుకోవాలి. కొన్ని సార్లు ఇతర నావికాదళాలతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. విపత్తులు, ఇతర అత్యవసర సమయాల్లో సహాయ చర్యల్లో పాల్గొనాల్సి ఉంటుంది’’ అని అన్నారు.

యుద్ధ విన్యాసాల వల్ల నౌకల జీవితకాలంపై ప్రభావం ఉంటుందని కూడా ఉదయ్ భాస్కర్ అన్నారు.

''నావికాదళం చాలా రకాలపైన పాత్రలు పోషించాల్సి ఉంటుంది. వాటన్నింటి కోసం తగిన నౌకలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. విన్యాసాలతోనే వాటి జీవిత కాలాన్ని దెబ్బతీయొద్దు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

''నావికాదళాలన్నీ ఇలాంటి సవాలును ఎదుర్కొంటాయి. ఓవైపు ఇచ్చిన కార్యాలను పూర్తి చేయాలి. మరోవైపు చేస్తున్న వ్యయం... దాని ప్రభావ, ప్రయోజనాలను విశ్లేషించుకోవాలి’’ అని ఆయన అన్నారు.

చైనాను ఎలా ఎదుర్కోవాలి?

చైనాను ఎదుర్కోవాలంటే భారత నావికాదళానికి జరుగుతున్న నిధుల కేటాయింపులో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని కొమోడోర్ ఉదయ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు.

'’20-30 ఏళ్లుగా ఇదే చర్చ జరుగుతోంది. రక్షణ బడ్జెట్‌లో దాదాపు 14 శాతం కేటాయించి... నావికాదళం అత్యంత సమర్థంగా ఉండాలంటే సాధ్యం కాదు’’ అని ఆయన అన్నారు.

రాజకీయ స్థాయిలోనూ భారత్ వివిధ అవకాశాలను పరిశీలించాలని ఉదయ్ భాస్కర్ సూచిస్తున్నారు.

క్వాడ్‌లో ఇప్పుడు భారత్ సభ్య దేశంగా మారిందని... అమెరికా నుంచి యుద్ధ నౌకలు, ఇతర నౌకలను ఎక్కువకాలం పాటు లీజుకు తీసుకునేందుకు ప్రయత్నాలు చేయాలని ఆయన సలహా ఇచ్చారు.

''భారత్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు తమ సామగ్రిని ఇవ్వడం ద్వారా అమెరికాకు కూడా ప్రయోజనాలు ఉంటాయి. అమెరికాలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునేవారి చేతుల్లో ఈ అంశం ఉంటుంది. భారత్ ఈ దిశగా ప్రయత్నాలు చేయడం మంచిది’’ అని ఉదయ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
India has a special strategy to counter Chinese aggression in the Indian Ocean
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X