మూడు దశాబ్దాల అస్థిరతకు భారత్ ముగింపు పలికింది: బెర్లిన్లో భారతీయులనుద్దేశించి ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: సమర్థవంతమైన, స్థిరమైన ప్రభుత్వానికి భారత ప్రజలు మద్దతు పలకడంతో దేశంలో మూడు దశాబ్దాల అస్థిరతకు అంతం పలకగలిగామని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా బెర్లిన్ నగరంలోని భారతీయులనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు.
సోమవారం జర్మనీ రాజధాని బెర్లిన్లోని పోట్స్డామర్ ప్లాట్జ్లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. "భారత ప్రజలు గత మూడు దశాబ్దాల రాజకీయ అస్థిర వాతావరణాన్ని ఒక బటన్ను నొక్కడం ద్వారా ముగించారు. 30 సంవత్సరాల తర్వాత పూర్తి మెజారిటీ ప్రభుత్వం ఎన్నికైంది. భారత ప్రజలు 2014, 2019లో ప్రభుత్వాన్ని బలోపేతం చేశారు అని వ్యాఖ్యానించారు.

భారతదేశంలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలను, చేసిన పని గురించి ఇక్కడ మాట్లాడటం సరికాదని అన్నారు. జర్మనీ, విదేశాల్లో ఉంటున్న ప్రవాసుల శక్తిసామర్థ్యాలను పెంచడంలో తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. భారతదేశంలోని ప్రజలతోపాటు ఇతర దేశాల్లో ఉంటున్న భారతీయులు కూడా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తించి ప్రశంసిస్తుండటం చూస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదుగుతోందని ప్రధాని మోడీ అన్నారు. మరో 25 ఏళ్లలో భారతదేశం 100 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి భారత వృద్ధి ఉన్నతస్థాయిలో ఉంటుందని చెప్పారు.
'సంస్కరణల కోసం, రాజకీయ సంకల్పం అవసరం. నేడు భారతదేశం జీవన నాణ్యత, విద్య నాణ్యత, ఇతర అన్ని రంగాలలో ముందుకు సాగుతోంది. దేశం, బ్యూరోక్రసీ, ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పుడు కూడా ఒకేలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం మెరుగైన ఫలితాలు పొందుతున్నాము' అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాని మోడీ, ఛాన్సలర్ స్కోల్జ్ సహ అధ్యక్షత వహించిన 6వ భారతదేశం-జర్మనీ అంతర్-ప్రభుత్వ సంప్రదింపుల తర్వాత బెర్లిన్లోని భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు.
సోమవారం ప్రధాని మోడీ, ఛాన్సలర్ స్కోల్జ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం కూడా జరిగింది. 2021 డిసెంబర్లో ఛాన్సలర్ స్కోల్జ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇరువురు నేతల మధ్య తొలిసారి సమావేశం జరిగింది.