ఇండియా గేట్ వద్ద సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: గతంలో జరిగిన తప్పులను భారత్ ఇప్పుడు సరిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ప్రధాని మోడీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి నేతాజీకి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. నేతాజీ జయంతిని పురస్కరించుకుని ఏడాదిగా పరాక్రమ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలొదిలిన అనేక మంది సైనికులకు ఈ విగ్రహం ప్రతిరూపంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. బ్రిటిషర్ల ముందు తల వంచని పరాక్రమ నేత నేతాజీ అని మోడీ కొనియాడారు.
ప్రజాస్వామ్య విలువలు, భావితరాలకు ఈ విగ్రహం స్ఫూర్తి నింపుతుందన్నారు. నేను చేయగలను. చేస్తాను అనే నేతాజీ నినాదాలతో యువత ముందుకు సాగాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇది కేవలం విగ్రహం మాత్రమే కాదు.. దేశ స్వాతంత్ర్య కోసం సర్వస్వం ధారపోసిన నేతాజీకి ఘనమైన నివాళి అని మోడీ వ్యాఖ్యానించారు. త్వరలోనే గ్రానైట్‌తో ఇక్కడే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

భారతమాత వీర పుత్రుడు సుభాష్ చంద్రబోస్ బ్రిటీష్ ప్రభుత్వం ముందు తాను స్వాతంత్య్రం కోసం అడుక్కోనని, దాన్ని సాధించుకుంటానని గర్వంగా చెప్పారని అన్నారు. 'నేతాజీ స్వేచ్ఛా భారతదేశానికి హామీ ఇచ్చారు. ఆయన డిజిటల్ విగ్రహం స్థానంలో త్వరలో భారీ విగ్రహం రానుంది. ఈ విగ్రహం స్వాతంత్ర్య మహానాయకుడికి కృతజ్ఞతతో కూడిన జాతికి నివాళి. ఈ విగ్రహం మన భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది' అని మోడీ అన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ... 2019, 2020, 2021, 2022 సంవత్సరాలకు గానూ 'సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్'ను కూడా అందించారు. మొత్తం 7 అవార్డులను ప్రధాని అందజేశారు. విపత్తు నిర్వహణ రంగంలో భారతదేశంలోని వివిధ వ్యక్తులు, సంస్థలు అందించిన అమూల్యమైన సహకారం, నిస్వార్థ సేవలను ప్రశంసించడానికి, గౌరవించడానికి కేంద్ర ప్రభుత్వం వార్షిక సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఈ అవార్డు కింద ఓ సంస్థకు రూ.51 లక్షల నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్, వ్యక్తికి రూ.5 లక్షలు, ప్రశంసాపత్రం అందజేస్తారు.
#WATCH | Prime Minister Narendra Modi unveiled hologram statue of Netaji Subhas Chandra Bose at India Gate on his 125th birth anniversary #ParakramDiwas pic.twitter.com/vGQMSzLgfc
— ANI (@ANI) January 23, 2022
అంతకుముందు, ఆదివారం ఉదయం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు నివాళులర్పించారు. 'పరాక్రమ్ దివస్ సందర్భంగా దేశప్రజలందరికీ చాలా శుభాకాంక్షలు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయనకు నా గౌరవపూర్వక నివాళులు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయనకు నమస్కరిస్తున్నాను. మన దేశానికి ఆయన చేసిన విశేష కృషికి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు' అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
కాగా, గ్రానైట్‌తో చేసిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఒకప్పుడు కింగ్ జార్జ్ V విగ్రహం ఉన్న పెవిలియన్‌లో ఏర్పాటు చేస్తారు. దీనిని 1968లో తొలగించారు. ఇండియా గేట్ వద్ద నేతాజీ భారీ విగ్రహం ఏర్పాటు ప్రకటనను స్వాగతించిన సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్.. నేతాజీ జీవించే ఉంటారని, భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.