ఫైజర్ కొవిడ్-19 వ్యాక్సిన్ అవసరం భారత్‌కు ఉండకపోవచ్చు: కేంద్ర మంత్రి హర్షవర్థన్
అమెరికాకు చెందిన ప్రముఖ ఫైజర్ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ పై భారత ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కీలక ప్రకటన చేశారు. దేశంలో ఇప్పటికే ఐదు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నండటం, ఫైజర్ వ్యాక్సిన్ నిర్వహణ సవాలుతో కూడుకున్నది కావడంతో భారత్ కు ఆ టీకా అవసరం ఉండకపోవచ్చని మంత్రి అన్నారు.
ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న వివిధ కరోనా టీకాల క్లినికల్ ట్రయల్స్‌లో ఆశావాహ ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఫైజర్ టీకా మనకు అవసరం రాకపోవచ్చని, పైగా, పైజర్ కంపెనీ తయారుచేసిన కరోనా టీకాకు అమెరికా ప్రభుత్వ అనుమతులు కూడా ఇంకా మంజురు కాలేదని, ఈ సమయంలో ఫైజర్ టీకాపై దృష్టి పెట్టడం అంత అవసరం లేదని మంత్రి అభిప్రాయపడ్డారు.
వ్యాక్సిన్ వేసుకున్నా కొవిడ్-19వ్యాధి? -సమర్థత, సరఫరాపై గందరగోళం -ఈ ప్రశ్నలకు బదులేది?

అతి కొద్ది రోజుల్లోనే ఒకవేళ ఫైజర్ వ్యాక్సిన్ కు అనుమతులన్నీ వచ్చినప్పటికీ ఆ కంపెనీ తొలుత స్థానిక ప్రజల అవసరాలకే ప్రాధాన్యమిస్తుందని హర్షవర్ధన్ గుర్తుచేశారు. భారత్ ప్రభుత్వం ప్రస్తుతం అన్ని కరోనా టీకా తయారీ దారులతో సంప్రదింపులు జరుపుతోందని, వీటికి ఆయా దేశాల ప్రభుత్వ అనుమతులు మంజూరైన మరుక్షణమే వీటిని భారత్‌కు దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తామని మంత్రి తెలిపారు.
ఒక్కసారి అందుబాటులోకి వచ్చిన తర్వాత భారత్ లో దశల వారీగా టీకా పంపిణీ కార్యక్రమం చేపడతామని, తొలి విడతలో 200 నుంచి 300 మిలయన్ల జనాభాకు టీకా అందే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతుండటంతో, ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాన్ఫరెన్స్ నిర్వహించి, కీలక సూచనలు చేశారు.