వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియా-పాకిస్తాన్ ఎల్ఓసీ: పొరపాటున సరిహద్దు దాటినా సరే వెనక్కి తిరిగి రావడం కష్టమే

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
షంషాద్ బేగం

పాకిస్తాన్ పాలనలో ఉన్న కశ్మీర్ ప్రధానమంత్రికి 2005లో ఒక తల్లి రాసిన ఒక లేఖ నా ముందుంది. ఆమె తన కొడుకు ఫరూక్ తిరిగి వస్తాడని మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు.

"నా బిడ్డను విడుదల చెయ్యడంకోసం నేను ఎలాంటి త్యాగమైనా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను" అని ఆమె ఆ లేఖలో రాశారు.

ఈ లేఖ తరువాత, ఒక స్థానిక సంస్థ రెడ్ క్రాస్‌ను కలిసి ఆ తల్లి ఆవేదనను వివరించింది. వెంటనే రెడ్ క్రాస్ సభ్యులు రాజస్థాన్‌లోని జైల్లో ఉన్న ఫరూక్‌ను కలిసారు.

అనంతరం, వారు ఆ తల్లికి లేఖ రాస్తూ, ఫరూక్ బాగున్నారని, ఆయనకు ఉత్తరాలు రాస్తూ ఉండమని తెలిపారు. ఆ తరువాత భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఆ తల్లీకొడుకుల సంగతి ఏమైంది, ఫరూక్ విడుదల అయ్యారా, తన తల్లిని కలిశారా... అనే ప్రశ్నలలు వేటికీ జవాబులు దొరకలేదు.

బీబీసీ దగ్గరున్న అనేక ఉత్తరాలలో ఒక ముసలి తండ్రి గురించి రాసిన లేఖ కూడా ఉంది. ఈ ఉత్తరం, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ భారత పర్యటనకు ముందు రాసినది.

తన తండ్రి నియంత్రణ రేఖ వద్ద పశువులు మేపుతుంటే భారత బీఎసెఫ్ ఆయన్ను అరెస్ట్ చేసిందని, గత ఐదేళ్లుగా జమ్మూ సెంట్రల్ జైల్లో తన విడుదల కోసం ఎదురుచూస్తున్నారని ఆ లేఖలో రాసుంది.

గత రెండు దశాబ్దాలుగా భారత్, పాకిస్తాన్, కశ్మీర్‌లలో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. వాటితో పాటూ ప్రాధాన్యాలు కూడా మారుతూ వస్తున్నాయి.

ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. ఎల్ఓసీ దగ్గర అధిక భూభాగంలో కంచె కూడా కట్టారు కానీ ఇలాంటి కథలు మాత్రం అంతం కాలేదు.

షంషాద్ బేగం భర్త 2008 నుంచి కనిపించకుండా పోయారు

షంషాద్ బేగం కథ

షంషాద్ బేగం భర్త 13 ఏళ్ల క్రితం కనబడకుండా పోయారు. అప్పటినుంచీ ఆమె తన భర్త జాడ వెతుకుతూనే ఉన్నారు.

వీళ్లు నీలం ఘాటీలోని చక్‌నార్ గ్రామానికి చెందినవారు. చక్‌నార్ ఎల్ఓసీకి 50 మీటర్ల దూరంలో ఉంది. ఆ గ్రామంలోనికి రాకపోకలకు ఎవ్వరికీ అనుమతి లేదు. చక్‌నార్ గ్రామానికి వెళ్లే ఒక దారి భారత సైనికుల చెక్ పోస్ట్ గుండా వెళుతుంది.

షంషాద్ బేగం భర్త పాకిస్తాన్ ఆర్మీ విభాగంలో చాకలి పని చేస్తుండేవారు. కానీ, ఆయన ప్రభుత్వ ఉద్యోగి కారు.

"ఒకరోజు ఆయన సెలవుమీద ఇంటికి బయలుదేరారు. దారిలో ఆ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా ఆయనతో కలిసారు. వాళ్లు ముగ్గురూ దారిలో ఉన్న భారత చెక్ పోస్ట్ దగ్గరకి రాగానే సైనికులు వాళ్లని పట్టుకున్నారు. సాయంత్రం వరకూ ముగ్గురూ ఇంటికి రాకపోయేసరికి ఏమైపోయారో అని వెతకడం మొదలుపెట్టాం. నా భర్త సామాన్లు ఆ మిలటరీ చెక్ పోస్ట్ దగ్గర పడి ఉన్నాయి. అందులో నాకోసం కొన్న కొత్త చీర కూడా ఉంది. ఆ రోజునుంచీ నా భర్త వెనక్కి తిరిగి రాలేదు" అని షంషాద్ బేగం తెలిపారు.

తన భర్త జాడ తెలుపమని భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాలను అభ్యర్థిస్తూనే ఉన్నానని షంషాద్ బేగం తెలిపారు.

"నా భర్త ఆచూకీ కోసం అవకాశం ఉన్న ప్రతీచోటా చేతులు చాచి అభ్యర్థించాను. చివరికి నన్ను విధవను చేసారు తప్పితే నా భర్త జాడ తెలియలేదు. ఆయన చనిపోవడం నేను గానీ ఇతరులు గానీ చూడలేదు. ఆయన బతికే ఉన్నారని నా విశ్వాసం. నా చివర శ్వాస వరకూ ఆయనకోసం ఎదురుచూస్తూ ఉంటాను" అని చెమ్మగిలిన కళ్లతో ఆమె తెలిపారు.

అలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. 1990నుంచీ ఇప్పటివరకూ సరిహద్దు రేఖ దాటారని భారత సేన అదుపులోకి తీసుకున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు.

ప్రపంచంలో అధిక సంఖ్యలో సైన్యం మోహరించి ఉన్న ప్రాంతాల్లో కశ్మీర్ కూడా ఒకటి. దీన్ని విభజిస్తూ ఉన్న సరిహద్దు రేఖ చాలా చోట్ల ఎలా ఉంటుందంటే, అది సరిహద్దు రేఖ కాదు అనుకుని ఎవరైనా మోసపోవచ్చు. చాలా చోట్ల కంచె వేసారు కానీ కొన్నిచోట్ల కంచె ఉండదు. కొన్ని చోట్ల జనావాసానికి వెనకాల కంచె ఉంటుంది. అయితే, నియంత్రణ రేఖ వద్ద ఇరు దేశాల సైనికులు మొహరించి ఉంటారు. ఒకరిపై ఒకరు దృష్టి పెడుతూ ఎల్లప్పుడూ జాగురూకులై ఉంటారు.

కొన్నిచోట్ల కంచెకు చుట్టుపక్కల పంటపొలాలు కూడా ఉన్నాయి. పొలాల్లో పని చేసేటప్పుడు, గడ్డి కోత సమయంలో పొరపాటున ఎల్ఓసీ దాటిన ఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి.

నియంత్రణ రేఖ దాటినవారిని ఇరు దేశాల సైనికులు బంధించి జైల్లో పెడతారు. కానీ, వారి కుటుంబాలకు అది జైలుకన్నా పెద్ద శిక్ష. ముఖ్యంగా తప్పిపోయిన వ్యక్తులు బతికి ఉన్నారో లేదో వారికి తెలీదు.

తన తండ్రి కనిపించకుండా పోయినప్పుడు తనకి 10 సంవత్సరాలని షంషాద్ బేగం కొడుకు మొహమ్మద్ సిద్ధిక్ బీబీసీకి తెలిపారు.

ఆ గ్రామంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇది నాలుగోసారి. ఆ ప్రాంతం జీరో లైన్‌లో ఉన్నందువల్ల అక్కడ క్రాస్ బోర్డర్ ఫైరింగ్ కూడా జరుగుతుంటుంది. ఈ కారణంగా ఆ గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

చక్‌నార్ గ్రామవాసులను, ఆ చుట్టుపక్కల మరికొన్ని గ్రామాలవాసులను నీలం లోయలోనే ఒక తాత్కాలిక శిబిరానికి తరలించారని షంషాద్ బేగం తెలిపారు.

షంషాద్ బేగం కొన్నిరోజులు ఆ క్యాంప్‌లో ఉన్నారు. తరువాత ముజఫరాబాద్ వెళిపోయారు.

"నేను పొలాల్లోనూ, ఇళ్లోనూ పని చెయ్యడం మొదలుపెట్టాను. కానీ నా పిల్లలు నేను పని చెయ్యడానికి ఒప్పుకోలేదు. నా పెద్ద కొడుకు 10 ఏళ్లకే చదువు మానేసి కూలిపనికి వెళిపోయాడు. నా మిగతా పిల్లల పరిస్థితీ అదే. అప్పులు చేసి ఈ గది కట్టుకున్నాం. నా భర్త కనిపించకుండా పోయిన తరువాత మా పరిస్థితి దుర్భరంగా మారింది" అని ఆమె తెలిపారు.

అయితే పొరపాటున సరిహద్దు రేఖ దాటడం అనేది సామాన్య ప్రజలకు మాత్రమే పరిమితం కాదు.

పాకిస్తాన్ పాలనలో ఉన్న కశ్మీర్ ప్రధాని రాజా ఫరూక్ హైదర్ బీబీసీ ఉర్దూతో మాట్లాడుతూ తాను కూడా ఒకసారి పొరపాటున నియంత్రణ రేఖ దాటినట్లు తెలిపారు.

"నేను ఎన్నికల ప్రచారం కోసం అటువైపు వెళ్లినప్పుడు, అక్కడ బాత్రూంలు లేని కారణంగా అత్యవసరాలు తీర్చుకోవడం కోసం కొంత దూరం వెళ్లవలసి వచ్చింది. అప్పుడు 'ఇక్కడ మీరేం చేస్తున్నారు?’ అంటూ ఒక గొంతు వినిపించింది. చూస్తే అది భారత సైనికుని గొంతు. ఇది మీ ప్రాంతమని నాకెలా తెలుస్తుంది. నేను అత్యవసరాలు తీర్చుకోవడం కోసం వచ్చాను అని చెప్పాను" అంటూ హైదర్ వివరించారు.

"నా స్థానంలో ఒక సామాన్యుడు ఉంటే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేవారు లేదా కాల్చి వేసేవారు" అని ఆయన అన్నారు.

పాక్ పాలిత కశ్మీర్

తిరిగి రప్పించే ప్రయత్నాలు

సాద్ (పేరు మార్చడమైనది), భారత భూభాగంలోని కశ్మీర్‌లోకి ప్రవేశించారని ఆయన్ను భారత సైనికులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆ సమయంలో తను, తన గ్రామంలో తన స్నేహితులతోపాటూ గడ్డి కోస్తూ ఉన్నానని సాద్ తెలిపారు.

"మేము గడ్డి కోసుకుంటూ, పశువులను మేపుతున్నాం. మేము గ్రామానికి దగ్గర్లో మా ప్రాంతంలోనే ఉన్నాం. ఇంతలోనే నాలుగువైపులనుంచీ సైనికులు వచ్చేసారు. మాలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వచ్చినవారు భారత సైనికులమని చెప్పారు. నియంత్రణ రేఖ దాటడం వల్లే అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పారు. కాదు, ఇది మా ప్రాంతమే అని మేము చెప్తూనే ఉన్నాం. కానీ వారు మా మాట వినిపించుకోకుండా మమ్మల్ని అరెస్ట్ చేసారు" అని సాద్ వివరించారు.

“మమ్మల్ని భారతీయ సైనికులు వాళ్ల క్యాంప్‌కి తీసుకెళుతున్నారని అర్థమైనప్పుడు మేము ఇంక మా ప్రాణాలమీద ఆశ వదిలేసుకున్నాం. చాలారోజులవరకూ మా కళ్లకు, చెవులకు గంతలు కట్టేసి ఉంచారు. మేము అమాయకులం, మాకే పాపం తెలీదు అని చెప్పినప్పుడల్లా మమ్మల్ని కొట్టేవారు. మేము ఎక్కడున్నామో మాకు తెలియలేదు. మాతోపాటూ ఇంకెవరైనా ఉన్నారో లేదో కూడా తెలీదు" అని సాద్ తెలిపారు.

పాక్ పాలిత కశ్మీర్

సాద్ కుటుంబం పాకిస్తాన్ సైన్యానికి ఈ విషయం తెలిపింది. వారు భారత ప్రభుత్వాన్ని సంప్రదించారు.

"ఇంతకుముందు ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువగా జరుగుతుండేవి. కానీ ఈ ప్రాంతం కశ్మీర్ ప్రజలకు చెందినది. వారు ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్లి రావొచ్చు. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. చాలాచోట్ల రెండువైపులా జనావాసాలకు వెనకాల కంచె ఉంది. అలాంటి ప్రాంతాల్లో కంచెవైపు వెళ్లొద్దని, జాగ్రత్తగా ఉండమని మేము ప్రజలను హెచ్చరిస్తూనే ఉంటాం. ఎల్ఓసీ ఎక్కడెక్కడ ఉందో వివరించి చెప్తాం. కానీ నియంత్రణ రేఖ గుర్తులు పూర్తిగా లేవు. అందువల్ల పొరపాటున ప్రజలు అటువైపు వెళిపోతుంటారు" అని పాకిస్తాన్ సైన్యం తెలిపింది.

"ఇందులో రెండు రకాలుగా జరుగుతుంటుంది. ఒక్కోసారి ప్రజలు అటువైపు వెళిపోతుంటారు. ఒక్కోసారి భారత సైనికులు ఇటువైపు వచ్చి వాళ్లను అరెస్ట్ చేస్తారు. రెండు కేసుల్లనూ అరెస్ట్ చేసినవారిని తిరిగి రప్పించే ప్రయత్నాలు చేస్తాం" అని ఆర్మీ ప్రతినిధి తెలిపారు.

ఇలా ఎల్ఓసీ వద్ద కనిపించకుండా పోయినవారి గురించి, వారి కుటుంబం దగ్గర్లో ఉన్న సైనిక పోస్టులకు తెలియజేస్తుంది. వారు ఆ కేసుని ఫాలో చేస్తారు అని ఆయన తెలిపారు.

"ఇలాంటి కేసులను రెండు పద్ధతుల్లో ఫాలో చేస్తాం. ఒకటి మిలటరీ ఆపరేషన్ డైరెక్టర్‌కు విషయం తెలియజేస్తారు. రెండోది స్థానికంగా ఏర్పాటు చేసిన హాట్‌లైన్స్ ద్వారా భారత సైనికులను కాంటాక్ట్ చేసి ఫలనా వ్యక్తి కనిపించట్లేదు, మీ దగ్గర ఉన్నారా అని విచారిస్తాం" అని ఆర్మీ ప్రతినిధి తెలిపారు.

2005 తరువాత ఇలాంటి ఘటనలు చాలావరకూ తగ్గాయి. గత 15 ఏళ్లల్లో ఇలాంటి ఘటనలు 52సార్లు జరిగాయి. ఇందులో 33 మందిని భారత సైన్యం వెనక్కు పంపించేసింది. కానీ ఒక ఆరుగురి మృతదేహాలు మాత్రమే వెనక్కి వచ్చాయి. ఇలా చనిపోయినవారిలో, ఎల్ఓసీ దగ్గర తిరుగుతుంటే బోర్డర్ ఫోర్స్ తుపాకీతో కాల్చి వేసినవారే ఎక్కువ.

పాకిస్తాన్ ఆర్మీ ప్రకారం ఇప్పటికీ 13మంది భారత సైనికుల అదుపులో ఉన్నారు. వారు తిరిగి రావడంకోసం వేచి చూస్తున్నారు.

పాకిస్తాన్ పాలనలో ఉన్న కశ్మీర్ ప్రభుత్వం ప్రకారం 2005కు ముందు కనిపించకుండాపోయిన వారి సంఖ్య గురించి అధికారికమైన రికార్డులేమీ లేవు.

ఈ ప్రాంతంలో పని చేస్తున్న ఒక ఎన్‌జీఓ గణాంకాల ప్రకారం 2005వరకు ఈ ప్రాంతంలో సుమారు 300 మంది కనిపించకుండా పోయారు. అయితే, ఈ ఎన్‌జీఓ కూడా 2008 తరువాత అక్కడ పనిచెయ్యడం మానేసింది.

పాక్ పాలిత కశ్మీర్ ప్రధాని రాజా ఫారూక్ హైదర్

భారత్-పాకిస్తాన్ వాదనలు

"ఇంతకుముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఇరు దేశాలవారూ అదుపులోకి తీసుకున్న ప్రజలను వెనక్కు పంపించేసేవారు. కానీ 2019 ఆగస్ట్ 5 తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో వాళ్లు మనుషులను చంపేస్తున్నారు. ఇటువైపు ఎవరినీ చంపట్లేదు. వాళ్లు కాల్చి చంపేస్తున్నారు లేదా వ్యక్తులను వెనక్కి పంపించట్లేదు. వాళ్ల దగ్గరున్నారో లేదో కూడా చెప్పడం లేదు. వారు ఇక్కడకు తిరిగి వచ్చే విధంగా, ఈ అంశాన్ని యూఎన్‌లో చర్చించమని విదేశాంగ శాఖకు లేఖ రాస్తాను" అని రాజా ఫరూక్ హైదర్, బీబీసీకి తెలిపారు.

అయితే ఈ వాదనలన్నిటినీ భారత్ తిరస్కరిస్తుంది. భారత విదేశాంగ శాఖ ప్రకారం పాకిస్తాన్ ఆయుధాలను, ఉగ్రవాదులను నియంత్రణ రేఖ వద్దకు పంపుతుంది.

"పాకిస్తాన్, సామాన్య ప్రజల ముసుగులో ఆయుధాలు, గన్‌పౌడర్ ఇటువైపు పంపడానికి ప్రయత్నాలు చేసింది. ఆయుధాలు, డ్రగ్స్ అక్రమ రవాణాలో పాకిస్తాన్ సహాయం చెయ్యడం మేము గమనించాం. ఇలాంటివి పట్టుకోవడం కోసం మేము డ్రోన్‌లు కూడా ఏర్పాటు చేసాం" అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి బీబీసీకి తెలిపారు.

पाक प्रशासित कश्मीर

"మరో పక్క పాకిస్తాన్ సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఉగ్రవాదులు ఎన్ఓసీ దాటడానికి అవకాశమున్న జనావాస ప్రాంతాల్లో ఈ ఉల్లంఘనలు జరుగుతాయి" అని భారత ప్రతినిధి తెలిపారు.

ఈ అంశంపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ వివరణకోసం బీబీసీ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అటువైపునుంచి ఏ జవాబూ రాలేదు.

నియంత్రణ రేఖ వద్ద కనిపించకుండా పోయిన వివరాలను నమోదు చెయ్యడానికి పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయంలో ఒక డెస్క్ ఏర్పాటు చెయ్యాలని, భారతదేశంతో మాట్లాడి వెనక్కు పంపించినవారి వివరాలు, ఇతర వివరాలు నమోదు చేస్తూ ఉండాలని రాజా ఫరూక్ హైదర్ అభిప్రాయపడ్డారు.

కానీ ఇది జరుగుతుందో లేదో ఎవరికీ తెలీదు. ఈ యుద్ధాన్ని మొదలుపెట్టే లేదా అంతం చేసే శక్తి లేనివారి గురించి ఎవరికీ పట్టింపు లేదు.

మళ్లీ షంషాద్ బేగంను కలవడానికి వెళ్లినప్పుడు వాళ్ల అబ్బాయి పెళ్లి జరిగి, కోడలిని ఇంటికి తీసుకొచ్చే తతంగం జరుగుతోంది. సిద్ధిక్ వచ్చినవరందరికీ విందు ఏర్పాడు చేసారు.

నియంత్రణ రేఖకు ఇరుపక్కలా ఉన్న ఎన్నో కుటుంబాల మాదిరిగానే వీరూ ముందుకు సాగుతున్నారు. కానీ వారి మనసుల్లో విచారం ఎప్పటికీ పోదు. షంషాద్ బేగం తన భర్త రాకకోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Even if you cross the border by mistake, it is difficult to come back
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X