సాగర పోరుకు సై అంటున్న ఇండియా .. దీవులలో సన్నాహాలు .. చైనాకు దీటుగా
లద్దాఖ్ లో సైనిక బలగాలను సిద్ధం చేసి ఇండియాతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా మరోపక్క సాగర సమరానికి కాలు దువ్వుతుంది. హిందూ మహా సముద్రంలో ఆధిపత్యం కోసం మయన్మార్, పాకిస్తాన్ మరియు ఇరాన్ లలోని ఓడరేవుల ద్వారా చైనా నావికాదళం ప్రయత్నం చేసే పరిస్థితి ఉండడంతో భారతదేశం సాగర సమరానికి సైతం సన్నద్ధమవుతోంది. భారతదేశం తన ద్వీప భూభాగాల్లో వేగంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

సముద్ర ప్రాంతాలలో చైనా వ్యూహం .. చెక్ పెట్టే ప్రతివ్యూహంలో ఇండియా
హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన సైనిక ఆధిపత్యాన్ని చాటేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలకు ఇండియా చెక్ పెట్టేందుకు సిద్ధమైంది.
అండమాన్, నికోబార్, లక్ష్య దీవుల్లో భారీగా సైనికీకరణ, మౌలిక వసతుల కల్పన చేపట్టి డ్రాగన్ దేశం చైనాకు బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఉత్తర అండమాన్ లో ఐఎన్‌ఎస్ కోహస్సా, షిబ్‌పూర్ వద్ద మరియు నికోబార్‌లోని క్యాంప్‌బెల్ స్ట్రిప్ వద్ద ఎయిర్‌స్ట్రిప్‌ను పూర్తి స్థాయి యుద్ధ స్థావరాలుగా భారత్ అప్‌గ్రేడ్ చేస్తుందని ఉన్నత సైనిక అధికారులు తెలిపారు.లక్షద్వీప్ లోని అగట్టి వద్ద ఉన్న ఎయిర్‌స్ట్రిప్ సైనిక కార్యకలాపాల కోసం అప్‌గ్రేడ్ చేస్తున్నారని తెలుస్తుంది.

అండమాన్ , నికోబార్ , లక్ష్య దీవుల్లో భారీగా మౌలిక సదుపాయాలు .. ఆధునికీకరణ పనులు
బంగాళాఖాతం నుండి మలక్కా స్ట్రెయిట్స్ వరకు మరియు అరేబియా మహా సముద్రం వరకు గల్ఫ్ ఆఫ్ అడెన్ వరకు భారత్ తన సైనిక దళాలతో తన పట్టును నిలుపుకుంటుంది.
రెండు ద్వీప భూభాగాలు భారతదేశానికి కొత్త విమాన వాహక నౌకల వలె ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతంలో నావికాదళం ప్రధాన భూభాగానికి దూరంగా ఉంటుంది. రెండు ద్వీపాలు ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే సముద్రపు మార్గాలలో ఉన్నాయి, ప్రపంచ వాణిజ్యంలో సగానికి పైగా ఈ మార్గం గుండా వెళుతున్నాయి అని ట్రై-సర్వీస్ కమాండర్ చెప్పారు.

థాయ్ కెనాల్ విషయంలోనూ చైనా కుట్రలు
గత 70 సంవత్సరాలుగా డ్రాయింగ్ బోర్డులో ఉన్న థాయ్ కెనాల్ (క్రా కెనాల్ )పై పనులు ప్రారంభించడానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది. దీనివల్ల ఇప్పుడు ఇండియాకు అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించుకోవలసిన అవసరం ఏర్పడిందని అధికారులు తెలిపారు. బ్యాంకాక్‌కు దక్షిణాన 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న మలయ్ ద్వీపకల్పం గుండా ముక్కలు చేసి థాయ్‌లాండ్ గల్ఫ్‌ను, అండమాన్ సముద్రంతో అనుసంధానించాలని ఈ కాలువ ప్రతిపాదించబడింది.

థాయ్ కెనాల్ ద్వారా చైనా వ్యూహాలతో భారత సముద్ర భద్రతకు ముప్పు
థాయ్ ల్యాండ్ రాజును ఒప్పించి ఆ కెనాల్ నిర్మాణం చెయ్యాలని అడుగులు వేస్తుంది చైనా. ఒకవేళ అదే కనుక జరిగితే, చైనా ప్రయత్నాలు ఫలిస్తే, భారత సముద్ర భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇది హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రం మధ్య ప్రధాన షిప్పింగ్ ఛానల్ అయిన మలాకా జలసంధిని విస్మరించడానికి వీలు కల్పిస్తుంది. ఇది ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య మార్గంగా మారింది. భారతీయ మరియు పసిఫిక్ మహాసముద్రాల మధ్య ప్రయాణించే నౌకలకు, ఇది దూరాన్ని కనీసం 1,200 కిలోమీటర్లు తగ్గిస్తుంది. థాయ్ రాజు ఇప్పటికీ క్రా కాలువను వ్యతిరేకిస్తున్నాడు. కానీ చైనా మాత్రం థాయ్ కెనాల్ నిర్మాణానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది.

సముద్ర మార్గాలలోనూ దీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధం అయిన ఇండియా
ఈ నేపథ్యంలోనే భారతదేశం సముద్ర మార్గాల్లో కూడా చైనా విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే తూర్పు లద్దాఖ్ లో ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు సాగర సమరానికి అయినా తాము సిద్ధంగా ఉన్నామని భారత్ తన ఏర్పాట్లతో చెప్తోంది. రెండు దేశాలు సైలెంట్గా యుద్ధ సన్నాహాలు చేస్తున్న సమయంలో ఇండియా -చైనాల మధ్య రగులుతున్న వివాదం ఎక్కడి వరకు వెళుతుందో అన్న ఆసక్తి ప్రపంచ దేశాలకు కలుగుతోంది. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్న భావన సైతం లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ చైనా కుటిల యత్నాలను భగ్నం చేస్తూ ఇండియా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.