కరోనా తీవ్రత తగ్గుముఖం - 24 గంటల్లో 2.35 లక్షల కేసులు : పెరుగుతున్న మరణాలు..!!
దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతూ కనిపించిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కొద్దిగా తగ్గింది. మూడు లక్షలకు పైగా నమోదైన పాజిటివ్ కేసులు ఇప్పుడు రెండు లక్షలకు పైగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,35,532 కరోనా కేసులు నమోదవ్వగా, 871 మంది కరోనాతో మృతి చెందారు. కరోనా కేసులు తగ్గుతుంటే, మరణాలు పెరుగుతున్నాయి. ఇది కొంత ఆందోళన కలిగించే అంశమే. కరోనా కొత్త కేసుల కంటే రికవరీ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 3,35,939 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 20,04,333 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

కేసులు తగ్గినా.. మరణాలు మాత్రం
రోజు వారీ కరోనా పాజిటివిటీ రేటు 13.39 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటి వరకు 165,04,87,260 వ్యాక్సిన్ డోసులు అందించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 3,408,113మందికి కరోనా సోకింది. 10,324 మంది ప్రాణాలు కోల్పోయారు.
కేరళలో 54,537 కేసులు, కర్ణాటకలో 31,198 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక.. తమిళనాడులో 26,533 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో 24,948 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏపీలో 12,561 కేసులు నమోదు అయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఆ అయిదు రాష్ట్రాల్లోనే అధికంగా
ఒక్క కేరళలోనే 23.15 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. ఇక, అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 522,300మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 2,732 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 75,271,402కోట్లు దాటింది.ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 353,503కేసులు వెలుగుచూశాయి.
మరో 263మంది చనిపోయారు.ఇటలీలో 143,898కొత్త కేసులు బయటపడగా.. 378మంది మరణించారు.బ్రెజిల్లో కొత్తగా 257,239 మందికి వైరస్ సోకగా.. 779మంది చనిపోయారు.అర్జెంటీనాలో తాజాగా 63,884 కరోనా కేసులు బయటపడగా.. 305మంది బలయ్యారు. జర్మనీలో 189,464వేల మందికి వైరస్ సోకింది. మరో 179మంది మృతి చెందారు.

తెలుగు రాష్ట్రాల్లో కట్టడి చర్యలు
గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 1,01,812 శాంపిల్స్ పరీక్షించగా.. 3,877 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు కన్నుమూసారు. ఇదే సమయంలో 2,981 మంది కోవిడ్ నుంచి పూర్థిస్థాయిలో కోలుకున్నారు..= దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 7,54,976కు చేరుకుంది.
ఇక, రికవరీ కేసులు 7,10,479కు పెరిగాయి. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 4,083కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 40,414 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఏపీలోనూ కేసుల సంఖ్య పెరిగినా.. పరీక్షలు మరింత పెంచాలని... రాత్రి కర్ఫ్యూతో పాటుగా... కరోనా ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.