కొత్త కేసులు ఉప్పెన: కర్ణాటకలో 32 వేలకు పైగా: హాట్ స్పాట్లుగా మూడు రాష్ట్రాలు
న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత తగ్గట్లేదు. ఈ వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అన్ని రాష్ట్రాలు వీకెండ్, నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తోన్నప్పటికీ అడ్డుకట్ట పడట్లేదు. కొత్త కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. లక్షల్లో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటోంది. సంక్రాంతి పండగ సీజన్ ముగిసిన తరువాత పాజిటివ్ కేసులు మరిన్ని పెరిగే అవకాశాలు లేకపోలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది.
మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఏడువేలను దాటాయి. దేశంలో పలు నగరాల్లో థర్డ్‌వేవ్ మొదలైంది. తాజాగా బులెటిన్ ప్రకారం..ఒక్కరోజులోనే 2,71,202 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 314 మంది మరణించారు. 1,38,331 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,71,22,131కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగింది. 15 లక్షలను దాటాయి. చేరువ అయ్యాయి.
యాక్టివ్ కేసులు 15,50,377గా రికార్డయ్యాయి. ఇప్పటిదాకా 4,86,066 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలొదిలారు. పాజిటివిటీ రేటు 16.278 శాతంగా నమోదైంది. అదే సమయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా మొత్తంగా 156,76,15,454 డోసుల వ్యాక్సిన్‌ను ఇచ్చారు. శనివారం ఒక్కరోజే 66,21,395 మేర డోసుల టీకాలు వినియోగమైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన తాజా బులెటిన్‌లో వెల్లడించింది.

ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు ఏడు వేలను దాటాయి. ఇప్పటిదాకా 7,743 కేసులు రికార్డయ్యాయి. కరోనా వైరస్ అత్యధిక సంఖ్యలో నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు తొలి అయిదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో 42,462 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ-20,718, కర్ణాటక-32,793, తమిళనాడు-23,989 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. బెంగళూరులో 22 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులకు తగ్గట్టుగా కరోనా మరణాలు క్రమంగా పెరుగుదల బాట పట్టాయి. కొత్తగా 314 మంది మరణించారు. ఇదివరకటితో పోల్చుకుంటే మరణాల సంఖ్య తక్కువేనని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నందు వల్ల చాలామంది పేషెంట్లు.. కోవిడ్ బారిన పడినప్పటికీ.. త్వరితగతిన కోలుకుంటున్నారని స్పష్టం చేస్తోన్నారు. అందుకే- ప్రతి ఒక్కరూ కోవిడ్ డోసులను తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తోన్నారు.