
పాకిస్థాన్‌పై తీవ్రంగా మండిపడిన భారత్: చైనా గ్రామాల విషయంపైనా తేల్చేసింది
న్యూఢిల్లీ: పాకిస్థాన్ వైఖరి, చైనా గ్రామాల నిర్మాణాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. అరుణాచల్‌ప్రదేశ్ వద్ద వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనా ఓ గ్రామాన్ని నిర్మించిందంటూ అమెరికా రక్షణ శాఖ ఇటీవలో ఓ నివేదిక పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఆ ప్రాంతం దాదాపు ఆరు దశాబ్దాలుగా చైనా నియంత్రణలోనే ఉందని భారత సైనిక వర్గాలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
తాజాగా, విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ భాగ్చీ ఈ విషయంపై స్పందించారు. దేశ భూభాగంలో చైనా ఆక్రమణలతోపాటు ఆ దేశ వాదనలను భారత్ ఎప్పుడూ అంగీకరించలేదని స్పష్టం చేశారు. దశాబ్దాల క్రితం ఆక్రమించిన ప్రాంతాలతోపాటు సరిహద్దుల్లో చైనా కొన్నేళ్లుగా నిర్మాణ కార్యకలాపాలు చేపట్టింది. కానీ, దాని ఆక్రమణలను, వాదనలను భారత్ ఎప్పుడూ అంగీకరించలేదని బాగ్చీ తేల్చి చెప్పారు. మరోవైపు ఈ విషయంపై ఎప్పటికప్పుడు తీవ్ర నిరసన తెలిపినట్లు, భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందన్నారు.

సరిహద్దుల వెంబడి స్థానిక జనాభా కోసం రోడ్లు, వంతెనల నిర్మాణంతో సహా ఆయా మౌలిక సదుపాయాల కల్పనను భారత ప్రభుత్వం కూడా ముమ్మరం చేసినట్లు అరిందమ్ బాగ్చీ తెలిపారు. పౌరుల జీవనోపాధి మెరుగుపర్చేందుకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సహా సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టే విషయానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు.
దేశ భద్రతపై ప్రభావం చూపే పరిణామాలపై ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచుతోందని, దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని అరిందమ్ బాగ్చీ స్పష్టం చేశారు. మరోవైపు, పాకిస్థాన్ వైఖరిపైనా భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆప్ఘనిస్థాన్ పరిస్థితులపై బుధవారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్ఎస్ఏ స్థాయి సమావేశానికి పాకిస్థాన్ గైర్హాజరవడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ముఖ్యమైన సమావేశాన్ని దాటేయడం చూస్తుంటే ఆప్ఘాన్ సమస్యల పట్ల పాకిస్థాన్ వైఖరి తేటతెల్లమవుతోందంటూ మండిపడింది.