హైదరాబాద్ హౌస్..చారిత్రాత్మక చర్చకు వేదికగా: భారత్-అమెరికా మంత్రుల భేటీ: చైనా పైనా
న్యూఢిల్లీ: భారత్-అమెరికా మధ్య చారిత్రాత్మక చర్చలు ఆరంభం అయ్యాయి. దేశ రాజధానిలోని హైదరాబాద్ హౌస్ దీనికి వేదికగా మారింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ టీ ఎస్పర్.. భారత విదేశాంగ, రక్షణ శాఖ మంత్రులు సుబ్రహ్మణ్యం జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్‌లతో హైదరాబాద్ హౌస్‌లో సమావేశం అయ్యారు. 2 + 2 విధానంలో వారి మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభం అయ్యాయి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ సహా రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు దీనికి హాజరయ్యారు.

ద్వైపాక్షిక చర్చల్లో కీలకాంశాలు..
అమెరికా ప్రభుత్వ కేబినెట్లో ఈ రెండు శాఖలు అత్యంత కీలకమైనవిగా భావిస్తారు. భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలతో పాటు చైనా దూకుడుకు కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన అంశాలపై అజెండాను రూపొందించినట్లు చెబుతున్నారు. భారత్-అమెరికా విదేశాంగ, రక్షణశాఖ మంత్రుల మధ్య జరిగే ఈ ద్వైపాక్షిక చర్చల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయా శాఖల మంత్రుల మధ్య వేర్వేరు సందర్భాల్లో..విభిన్న వేదికలపై ద్వైపాక్షిక చర్చలు ఏర్పాటు కావడం ఇది మూడోసారి.

చైనా వ్యవహారంపై ప్రస్తావించిన పాంపియో..
ఊహించినట్టే చైనా అంశం కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. తొలుత మైక్ పాంపియో చైనా విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. చైనా కమ్యూనిస్టు పార్టీ అనుసరిస్తోన్న విధానాలు ప్రపంచానికి ప్రమాదకరంగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల స్వేచ్ఛకు అవి విఘాతంలా మారే అవకాశం లేకపోలేదని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి అనంతరం చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఆసియా ఉపఖండంలో శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఒప్పందాల పట్ల హర్షం..
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ (బెకా) కుదరడం స్వాగతించదగ్గ పరిణామమని అన్నారు. రక్షణ, విదేశాంగ విధానాలు, కీలక సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి ఈ ఒప్పందాలు ఉపకరిస్తాయని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తమ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని అనుసరిస్తోందని, సర్వీస్ సెక్టార్‌ను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించిందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

అధ్యక్ష ఎన్నికల వేళ..
ఒకవంక అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కోలాహలం కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మైక్ పాంపియో, మార్క్ టీ ఎస్పర్.. భారత్ సహా శ్రీలంక, మాల్దీవులు, ఇండొనేషియా పర్యటనలకు బయలుదేరి రాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటన ద్వారా భారత్ ముప్పుగా పరిణమించిన చైనాను టార్గెట్‌గా చేసుకోవడం ద్వారా తమ దేశంలో స్థిరపడిన ప్రవాస భారతీయుల ఓటుబ్యాంకును ప్రభావితం చేయడానికి అవకాశం ఉందనే వాదనలు ఉన్నాయి. దీన్ని అనురాగ్ శ్రీవాస్తవ కొట్టిపారేశారు. ముందుగా నిర్దేశించుకున్న కేలండర్ ప్రకారమే.. వారిద్దరూ భారత పర్యటనకు వస్తున్నట్లు చెప్పారు.