ఆ గాయాలను భారత్ ఎన్నటికీ మరవదు.. సరికొత్త పంధాలో ఉగ్రవాదంపై పోరు : ప్రధాని మోడీ
ముంబై మారణహోమానికి సరిగ్గా నేటికి 12 సంవత్సరాలు, ఈ సందర్భంగా 2008 దాడుల గాయాలను భారత్ ఎప్పటికీ మరచిపోదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు . ఇండియా ఇప్పుడు ఉగ్రవాదాన్ని కొత్త విధానాలతో ఎదుర్కొంటున్నదని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. నాడు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు, పౌరులందరికీ మోడీ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నరేంద్ర మోడీ ఈ రోజు దేశంపై అతిపెద్ద ఉగ్రవాద దాడి జరిగిన రోజని పేర్కొన్నారు.
26/11..ఉగ్రవాదంపై భారత్ తో కలిసి యూఎస్ పోరాటం..అమరుల స్మారక సభలో యూఎస్ వెల్లడి

సరికొత్త విధానాలతో ఉగ్రవాదంపై పోరాటం : మోడీ
రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునేందుకు లోక్సభ నర్మదా నది ఒడ్డున రెండు రోజుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నేడు ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈరోజు గుజరాత్ కెవాడియాలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో శాసన వ్యవహారాల ప్రిసైడింగ్ ఆఫీసర్ల సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ముంబైలో నాటి మారణహోమాన్ని గుర్తుచేసుకున్నారు. ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించక తప్పదని అందుకోసం సరికొత్త విధానాలతో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు.

ఉగ్రవాదుల నుండి దేశాన్ని కాపాడుతున్న భద్రతా దళాలకు నమస్కరించిన మోడీ
2008 లో, పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు ముంబైపై దాడి చేశారు . ఈ దాడిలో చాలా మంది భారతీయులు మరణించారు. ఇంకా విదేశీయులు కూడా చంపబడ్డారు. ముంబై దాడిలో మరణించిన వారందరికీ నా నివాళులు అర్పిస్తున్నాను, "అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
ఉగ్రవాదుల నుండి భారతదేశాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నామని, ముంబై దాడుల వంటి కుట్రలను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా అడ్డుకుంటున్నామని చెబుతున్న భద్రతా దళాలకు కూడా ప్రధాని నమస్కరించారు.

నవంబర్ 26 న ముంబై ఉగ్ర దాడి గాయాలను గుర్తు చేసుకున్న మోడీ
నవంబర్ 26, 2008 న, పాకిస్తాన్ కు చెందిన లష్కర్-ఎ- తోయిబా (ఎల్ఇటి) ఉగ్రవాదులు ముంబై నగరంలో 12 చోట్ల ఉగ్రదాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో ఆరుగురు అమెరికన్లు, తొమ్మిది మంది ఉగ్రవాదులు సహా 166 మంది మరణించారు మరియు వెయ్యికి పైగా గాయపడ్డారు. తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ (చాబాద్) హౌస్ మరియు ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైలు స్టేషన్ లక్ష్యంగా ఉన్న పన్నెండు ప్రాంతాలలో దాడి చేశారు.
నాటి మారణహోమం భారత్ ఎప్పటికీ మరచిపోలేదు. ఆ గాయాలు మానలేదని మోడీ పేర్కొన్నారు .