6.1శాతం: భారత వృద్ధిరేటు అంచనాలు తగ్గించిన ఐఎంఎఫ్, 2020లో కాస్త మెరుగు
వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) భారత స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటు అంచనాలకు భారీగా కోత విధించింది. 2019 సంవత్సరానికి గాను 6.1శాతం వృద్ధిరేటు నమోదవుతుందని అంచనా వేసింది. ఇది ఏప్రిల్ అంచనాలతో పోలిస్తే 1.2శాతం తక్కువ కావడం గమనార్హం.
ఏప్రిల్ 2019లో భారత వృద్ధిరేటు 7.3శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేసింది. మూడు నెలల తర్వాత వృద్ధిరేటు అంచనాలకు తగినట్లుగా లేకపోవడంతో భారత వృద్ధిరేటు అంచనాలను ఐఎంఎఫ్ భారీగా తగ్గించిందని తెలుస్తోంది.
2018లో భారత వృద్ధి రేటు 6.8శాతంగా ఉంది. ఐఎంఎఫ్ తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ అంచనాల ప్రకారం భారత వృద్ధిరేటును 6.1శాతంగా పేర్కొంది. అయితే, వచ్చే ఏడాది అంటే 2020 వరకు భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అంచనా వేసింది. 2020లో భారత వృద్ధిరేటు 7.0గా ఉంటుందని వెల్లడించింది.

వరల్డ్ బ్యాంక్ లేటెస్ట్ ఎడిషన్ ది సౌత్ ఏషియా ఎకనామిక్ ఫోకస్ గత ఆదివారం వెల్లడించిన అంచనాల ప్రకారం.. భారత వృద్ధిరేటు 2018లో 6.9శాతం ఉండగా.. 2019లో 6 శాతానికి తగ్గతుంది. భారత్ అంచనాలను అందుకోవడంలో కొంత వెనకబడిందిన ఐఎంఎఫ్ పేర్కొంది.
ఏప్రిల్ 2019 కంటే ప్రస్తుతం 1.2శాతం పాయింట్లు తగ్గిందని, 0.5శాతం 2020లో 0.5శాతం మేర వృద్ధిరేటు అంచనాలు తగ్గించుకోవాల్సి వస్తుందని ఐఎంఫ్ పేర్కొంది. ద్రవ్య విధాన సడలింపు, కార్పొరేట్ ఇన్కమ్ టాక్స్ రేట్ల తగ్గింపు, కార్పొరేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ రెగ్యూలేటరీ, గ్రామీణ వినియోగం పెంపునకు ప్రభుత్వం తీసుకునే చర్యలు వృద్ధిరేటు పెరిగేందుకు దోహదపడతాయని అభిప్రాయపడింది.
ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ వార్షిక సమావేశం ముందు ఎకనామిక్ ఔట్ లుక్ ఈ వివరాలను వెల్లడించింది. ఆటోమొబైల్ రంగం, రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న అనిశ్చితి భారత వృద్ధిరేటుపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొంది. నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీల ప్రభావం కూడా దీనిపై పడిందని తెలిపింది. ఈ రంగాలు 2019లోనే పుంజుకుంటే భారత వృద్ధిరేటు మెరుగుపడుతుందని అంచనా వేసింది.
ద్రవ్య విధానం, భారీ సంస్కరణలు భారత వృద్ధిరేటుకు మద్దతుగా ఉంటాయని, మధ్యకాలానికి సంబంధించిన రుణాలు కూడా దీనిపై ప్రభావం చూపుతాయని పేర్కొంది.
ప్రభుత్వరంగ బ్యాంకులు ఇచ్చే రుణాలు ఆర్థిక వ్యవస్థలో కీలకమని వెల్లడించింది. ఉద్యోగాల సృష్టి, నిబంధనల సడలింపు, భూ సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా వృద్ధిరేటు మెరుగుదలకు దోహదపడతాయని అభిప్రాయపడింది.
కాగా, చైనా వృద్ధిరేటు మరింత దారుణంగా ఉండే పరిస్థితి ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది. చైనా జీడీపీ వృద్ధిరేటు 2018లో 6.6శాతం ఉండగా, అది 2019లో 5.8శాతానికి పడిపోయిందని వెల్లడించింది. ఇక 2020లో వృద్ధిరేటు మరింత మందగించి 5.8శాతానికి పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది.