• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్ - చైనా: లద్ధాఖ్ పుట్టుకలోనే సంఘర్షణ ఉందా... అక్కడి పరిస్థితులు సియాచిన్ కన్నా దారుణమా?

By BBC News తెలుగు
|

లద్దాఖ్

భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దు సమస్యకు కేంద్రంగా మారిన లద్ధాఖ్ పేరు చెప్పగానే అక్కడ ప్రకృతి సౌందర్యం మాత్రమే కాదు అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు కూడా గుర్తుకొస్తాయి.

ఇటీవలే కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రభుత్వం లద్ధాఖ్‌ను గుర్తించింది. సరస్సులు, మంచు కప్పిన పర్వతాలు, ఇరుకైన దారుల(కనుమలు)తో ఒక ప్రత్యేకమైన భౌగోళిక వ్యవస్థను కల్గిన ప్రాంతం లద్ధాఖ్.

ఆ హిమాలయ మైదాన ప్రాంతం గురించి తెలుసుకోకుండా ప్రస్తుత భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం.

కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నియో టెథిస్ సముద్రం అలలు ప్రస్తుతం టిబెట్‌గా పిలుస్తున్న ప్రాంతాన్ని ఢీ కొట్టాయి.

అప్పటికి ఇండియన్ ప్లేట్ లేదా భారత ఉప ఖండం భౌగోళికంగా ఎక్కడా ఉనికిలో లేదు.

“4.4 కోట్ల సంవత్సరాల క్రితం ఇండియన్ ప్లేట్ ఉనికిలోకి వచ్చింది. ఆపై నేటి టిబెట్ ప్రాంతమైన ఏసియన్ ప్లేట్‌ను ఢీ కొట్టింది” అని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ(WIHG)లో శాస్త్రవేత్తగా పని చేస్తున్న ప్రదీప్ శ్రీవాస్తవ బీబీసీతో చెప్పారు.

ఇండియన్ ప్లేట్ చేరేసరికి మొత్తం సముద్రమంతా ఒ పక్కకు జరిగిపోయింది. అప్పటి వరకు లేని సరస్సులు, నదులు ఉనికిలోకి వచ్చాయి. అదే సమయంలో ఇప్పుడు కనిపిస్తున్న ప్రకృతి రమణీయకతతో కూడిన పర్వతాలు కూడా ఏర్పడ్డాయి.

“ఈ సంఘర్షణ పరిస్థితులన్నింటినీ మార్చేసింది. ఎత్తైన హిమాలయాలు ఏర్పడ్డాయి. రుతుపవనాలు ఈ ప్రాంతాన్ని తాకడం ఆగిపోయాయి. దీంతో లద్ధాఖ్ ప్రాంతం పొడి నేలగా, అత్యంత శీలతమైన ఎడారిగా మారిపోయింది. ఇక్కడ వర్షపాతం అంతంత మాత్రంగానే ఉంటుంది” అని శ్రీవాస్తవ అక్కడి భౌగోళిక పరిస్థితులను వివరించారు.

ఘర్షణ’ అన్నది లద్ధాఖ్ పుట్టుకలోనే ఉంది. అందుకే ఇప్పటికీ ఆ ప్రాంతంలో 'ఘర్షణ’ కొనసాగుతునే ఉంది.

భారత్ చైనా:లద్ధాఖ్‌లోని భారత్-చైనా సరిహద్దు ప్రాంతం

చరిత్ర ఏం చెబుతోంది?

ఇవి చరిత్రకు పూర్వం లద్ధాఖ్ భౌగోళిక పుట్టు పూర్వోత్తరాలు. ఇక చరిత్రలో లద్ధాఖ్ స్థితిగతుల్ని ఇప్పుడు చూద్దాం.

1834లో డోగ్రా యోధుడు గులాబ్ సింగ్ లద్ధాఖ్‌ను కైవసం చేసుకున్నారు. అప్పటికే విస్తరిస్తున్న రంజిత్ సింఘ్ సిక్కు సామ్రాజ్యంలో ఈ ప్రాంతాన్ని కలిపేశారు. క్రిస్టోఫర్ స్నేడెన్ తన “అండర్ స్టాండింగ్ కశ్మీర్ అండ్ కశ్మీరీస్” అనే పుస్తకంలో లద్ధాఖ్ గురించి, గులాబ్ సింగ్ గురించి ప్రస్తావించారు.

లద్ధాఖ్ ప్రాంతాన్ని కైవసం చేసుకోవడం ద్వారా స్థానికంగా గొర్రెల నుంచి ఉత్పత్తయ్యే ఉన్ని వ్యాపారంపై పూర్తి పట్టు సంపాదించడమే గులాబ్ సింగ్ సాధించిన ముఖ్యమైన విజయమని క్రిస్టోఫర్ పేర్కొన్నారు.

ఆ తర్వాత టిబెట్-చైనా బలగాల కారణంగా ఆ ప్రాంతాన్ని కోల్పోయినప్పటికీ, తిరిగి 1842లో లద్ధాఖ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆపై 1846లో జమ్ము-కశ్మీర్‌ సింహానం అధిష్ఠించగానే ఆ ప్రాంతాన్ని తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నారు.

సుమారు 101 సంవత్సరాల తర్వాత అప్పుడే స్వతంత్రం పొందిన భారత్-పాకిస్తాన్‌ దేశాలు కూడా లద్ధాఖ్ కోసం యుద్ధం చేశాయి.

1950 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంపై భారతీయులు-చైనీయులు ఎప్పుడూ ఏకాభిప్రాయంతో లేరు.

మీడియాలో చెబుతున్నట్టు డెప్సాంగ్, దౌలత్ బెగ్ ఓల్డీ(DBO), గల్వాన్, పాంగాంగ్ టీఎస్ఓ, ఫింగర్ ఏరియా, డెమ్‌చొక్ తదితర సరిహద్దు ప్రాంతాల విషయంలో భారత్-చైనా దేశాల మధ్య అవగాహన లేకపోవడంతో తరచు అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.

భారత్, చైనా సరిహద్దు సైనికులు

ఇదే విషయంపై లెఫ్ట్‌నెంట్ జనరల్ ఎస్‌కె పత్యాల్‌తో బీబీసీ మాట్లాడింది. ఆయన 2018లో డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ హోదాలో పదవీ విరమణ చేశారు. లద్ధాఖ్‌పై పూర్తిగా అవగాహన ఉన్న కొద్ది మంది నిపుణుల్లో పత్యాల్ కూడా ఒకరు.

“మీరు భారత భూభాగంలో ఉండి చైనా వైపు చూస్తే తూర్పు లద్ధాఖ్ ప్రాంతం ఓ గిన్నెలా కనిపిస్తుంది. మీకు ఎడమవైపున అత్యంత ఎత్తయిన ప్రాంతం కారకొరమ్ కనుమ తర్వాత డీబీఓ, ఆ తర్వాత గల్వాన్ ఉంటాయి. ఇంకా కిందకి వస్తే పాంగాంగ్ సరస్సు కనిపిస్తుంది. మీరు కుడివైపుకు వెళ్లే కొద్దీ ఆ ప్రాంతమంతా క్రమంగా తక్కువ ఎత్తులో కనిపిస్తుంది. డెమ్‌చెక్‌కు వచ్చేసరికి మైదాన ప్రాంతమైనప్పటికీ, ఆ తర్వాత మళ్లీ ఎత్తయిన పర్వతాలు కనిపిస్తాయి గిన్నెలా కనిపించడం అంటే అదే” అని పత్యాల్ వివరించారు.

లెహ్‌ ఆధారంగా భారతీయ ఆర్మీ ఏర్పాటు చేసిన XIV దళాలు చాలా ప్రత్యేకమైనవి. పాకిస్తాన్, చైనా సరిహద్దు ప్రాంతాన్ని నిరంతరం రక్షిస్తూ ఉంటాయని ఆయన చెప్పారు.

భారత సైనికుడు

లద్ధాఖ్‌లో పహారా కాయడం ఎంత కష్టం?

“ఒక్క మాటలో చెప్పాలంటే తూర్పు లద్ధాఖ్‌లోని కొన్ని ప్రాంతాల్లో పని చేయడం అంటే సియాచిన్ గ్లేసియర్ వద్ద పని చేయడం కన్నా కష్టమైన విషయం. డీబీఓ విషయానికే వస్తే అది వేసవి కాలంలో అయినా లేదా శీతా కాలంలో అయినా కొద్ది నిమిషాలకన్నా ఎక్కుసేపు బయట నిల్చోలేం. గాలి, చలి రెండు మిమ్మల్ని అక్కడ నిలవనివ్వవు” అని లెఫ్ట్‌నెంట్ జనరల్ పత్యాల్ అక్కడ పరిస్థితిని వివరించారు.

అంతేకాదు..సింధులోయలో ఉన్నట్టు ఇక్కడ లోయలకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో పహారా కాయడం వేసవికాలంలో చాలా చాలా కష్టం. ముఖ్యంగా ష్యోక్ లోయలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ ప్రతిదీ సవాల్‌తో కూడుకున్నదే. చివరకు అక్కడుండే మనుషులు ఓర్పుతో వ్యవహరించడం కూడా. ఉదాహరణకు అక్కడకు బరువుల్ని మోసుకెళ్లే శక్తి బాగా తగ్గుతుంది. మొత్తం రాతి మయం కావడంతో రక్షణ కోసం బంకర్లను తవ్వడం కూడా చాలా కష్టం. సాధారణంగా కొద్ది గంటల్లో పూర్తయ్యే పనులకు అక్కడ 7-8 రోజుల సమయం పడుతుంది. యంత్రాలను అక్కడకు తరలించడం కూడా అంత సులభం కాద అని పత్యాల్ చెప్పారు.

అక్కడ భౌగోళిక పరిస్థితుల గురించి లెఫ్ట్ నెంట్ జనరల్ డీఎస్ హుడాను బీబీసీ ప్రశ్నించినప్పుడు అడుగడుగునా తప్పుదారి పట్టించేలా ఉంటాయని చెప్పుకొచ్చారు.

“ఎందుకంటే ఉత్తర డెస్పాంగ్‌లోని మైదాన ప్రాంతాలను చూస్తే.. ఒక్కోసారి ఇంత అద్భుతమైన మైదాన ప్రాంతం ఎక్కడా ఉండదనుకుంటాం. సుమారు 16-17వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పటికీ మీరు మీ కారు డ్రైవ్ చేసుకుంటూ సులభంగా వెళ్లిపోవచ్చు. అటువంటి ఎత్తయిన ప్రాంతాల్లో చెయ్యకూడని పనులు చేసేందుకు కూడా మీరు ప్రయత్నిస్తారు” అని హుడా చెప్పుకొచ్చారు.

అంతేకాదు… “దక్షిణం వైపు వెళ్తే గల్వాన్ లోయ వంటి ప్రాంతాలు మీకు ఎదురవుతాయి. అక్కడ గల్వాన్ నది చాలా సన్నగా ఉంటుంది. గల్వాన్ లోయ ప్రాంతం కూడా చాలా ఇరుకైనదే. అదే దిశలో ఇంకా ముందుకెళ్తే సింధు మైదానం కనిపిస్తుంది. సింధు నది విశాలంగా ఉంటుంది కనుక సింధు మైదానం కూడా విశాలంగానే ఉంటుంది. డెమ్‌చొక్ అక్కడ నుంచి దక్షిణాన మరి కొంత ముందుకు ఉంటుంది” అని జనరల్ హుడా అన్నారు.

భారత్-చైనా:లద్ధాఖ్‌లోని ప్యాంగాంగ్ సరస్సు

లద్ధాక్ పర్వతాల ప్రత్యేకత

“ఇవి సంక్లిష్టమైన పర్వతాలేం కాదు. లోయలో ఉన్న మైదాన ప్రాంతానికి పర్వత శిఖరాలకు మధ్య దూరం ఇంకెక్కడా ఉన్నంత ఉంటుంది. ఇది ఎత్తయిన ప్రాంతం. పాంగాంగ్ టీఎస్ఓ సరస్సు నుంచి చూస్తే దీని ఎత్తు సుమారు 14వేల అడుగుల పైమాటే. కార్గిల్ పోరాటంలో భాగంగా కొన్ని సార్లు అదే ఎత్తయిన ప్రాంతాల్లో చొరబాటు దారులతో మేం పోరాడాం” అని జనరల్ హుడా వివరించారు.

సరిహద్దులకు ఆవల భౌగోళిక పరిస్థితులు ఎలా ఉంటాయి?

“చైనా వైపు చూస్తే టిబెట్ పీఠభూమి మైదాన ప్రాంతంలా ఉంటుంది. కానీ ఎత్తు విషయంలో చూస్తే అటు ఇటూ పెద్ద తేడాలేం కనిపించవు” అని ఆయన చెప్పారు.

ఫింగర్ ఏరియా అంటే?

“సరస్సుకు ఉత్తరవైపు ఉండే ఒడ్డు అంచుల్లో అంటే మేం పహారా కాసే ప్రాంతం నుంచి సరస్సు వైపునకు చూస్తే ముళ్లులా పొడుచుకొని వచ్చే ప్రాంతాలు మన చేతి వేళ్లలా కనిపిస్తాయి. అలా మొత్తం ఎనిమిది ఉంటాయి. అందుకే వాటికి మేం 1 నుంచి 8 నెంబర్లను ఇచ్చాం. ఫింగర్ 4 వరకు రోడ్డు ఉంది. వాళ్లకు ఫింగర్ 8 వరకు రోడ్డు మార్గం ఉంది. 4-8 ప్రాంతాల మధ్య ఓ జీపు మాత్రమే వెళ్లగల్గే రోడ్డు ఉంది. కానీ అది వివాదాస్పద ప్రాంతం కావడంతో మనం వాళ్లను ఇటువైపు రానివ్వం.. వాళ్లు మనల్ని అటువైపు రానివ్వరు” అని ఫింగర్ ఏరియా గురించి వివరించారు లెఫ్ట్‌నెంట్ జనరల్ పత్యాల్.

అయితే ఇక్కడ భారత్-చైనా రెండు దేశాలు అంగీకరించే విషయం ఒకటుంది. “అదే ఫింగర్ ఏరియాను రెండు దేశాలు కొన్నేళ్ల నుంచి ఉపయోగిస్తునే ఉన్నాయి” అని జనరల్ హుడా వివరించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
China troops have advanced into eastern Ladhak after this was declared as UT
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X