• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్-పాక్ యుద్ధం-1971: రణరంగంలో భారత కమాండర్ రాసిన లేఖకు పాకిస్తాన్ అధికారి ఎలా బదులిచ్చారంటే...

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

భారత్-పాక్ మధ్య 1971 యుద్ధ సమయంలో ఈస్ట్రన్ ఫ్రంట్‌లోని బక్షీగంజ్‌ను భారత దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అప్పుడు ఆ ప్రాంతానికి కమాండర్‌గా ఉన్న మేజర్ జనరల్ గుర్‌బక్ష్ సింగ్ గిల్, అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

Pakistan

ఆ ప్రాంతంపై భారత దళాలు పూర్తిగా పట్టు సాధించిన తర్వాత హెలికాప్టర్‌లో వెళ్దామని మేజర్ గుర్‌బక్ష్ సింగ్‌ గిల్‌ను బ్రిగేడియర్ హర్‌దేవ్ సింగ్ క్లెర్ కోరారు.

కానీ జనరల్ గిల్ అందుకు ఒప్పుకోలేదు. వారిద్దరూ ఒక జీపులో ప్రయాణం అయ్యారు. బ్రిగేడియర్ క్లెర్ జీపును నడుపుతున్నారు. ఆయన పక్కన గిల్ కూర్చున్నారు.

వారు కొంతదూరం వెళ్లాక, జీపు టైరు ల్యాండ్‌మైన్ పైనుంచి వెళ్లడంలో పెద్ద పేలుడు శబ్ధం వినిపించింది. జీపులోని సైనికులిద్దరూ ఎగిరి రోడ్డుపై పడ్డారు.

''నేను లేచి నా కాళ్లను కదిలించాను. దాంతో నేను నడవగలిగే స్థితిలోనే ఉన్నానని అర్థమైంది. జనరల్ గిల్ జీపుకు అవతలివైపు పడిపారు. ఆయన కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఛిద్రమైపోయాయి. ఆ స్థితిలో ఆయన కాళ్లకు నేను ఏ రకంగానూ సహాయం చేయలేను అనిపించింది. వెంటనే వెనక వచ్చిన మరో వాహనంలో ఆయనను ''13 గార్డ్స్ వైద్య సహాయ శిబిరానికి'' తీసుకెళ్లాను. అక్కడ వైద్యులు పరీక్షించాక ఆయనను హెలికాప్టర్‌లో తీసుకెళ్లి గువాహటిలోని మిలిటరీ ఆసుపత్రిలో చేర్చారు. అప్పుడు 2వ డివిజన్ పదాతి దళానికి మేజర్ జనరల్ గంధర్వ్ నాగరా నాయకత్వం వహిస్తున్నారు. జనరల్ గిల్ స్థానంలో గంధర్వ్‌కు 101 కమ్యూనికేషన్ జోన్ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. అప్పుడు మేమిద్దరం కలిసి జమాల్‌పుర్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళికలు రచించడం మొదలుపెట్టాం'' అని భారత ఆర్మీకి మేజర్ జనరల్‌గా సేవలందించి రిటైర్ అయ్యాక హర్‌దేవ్ సింగ్ క్లెర్ రాసుకొచ్చారు.

తలకు బుల్లెట్ తగిలి భారత సైనికుని మృతి

జమాల్‌పుర్‌ను రక్షించే బాధ్యతను పాకిస్తాన్ ఆర్మీకి చెందిన 31 బలూచ్ రెజిమెంట్ తీసుకుంది. బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతంలో జమాల్‌పుర్ ఒక ముఖ్యమైన కమ్యూనికేషన్ కేంద్రం.

పాకిస్తాన్ ఆర్మీ వెనకాలే ఉన్న జమాల్‌పుర్- ఢాకా రహదారిని 1ఎంఎల్ఐ బ్లాక్ చేసింది. అదే సమయంలో జమాల్‌పుర్- మైమన్‌సింగ్ రహదారిని 13 గార్డ్స్ ద్వంసం చేసింది.

1971 డిసెంబర్ 8న, బ్రిగేడియర్ క్లెర్ తన హెలీకాప్టర్‌ను 13 గార్డ్స్ బృందం బ్లాక్ చేసిన ఒక రోడ్డుకు సమీపంలో ల్యాండ్ చేశారు. అప్పటికే అక్కడ బుల్లెట్ల వర్షం కురుస్తోంది. హెలీకాప్టర్‌ను అక్కడ ల్యాండ్ చేయవద్దని హెచ్చరిస్తూ భారత సైనికులు లైట్లతో సంకేతాలు ఇచ్చారు. కానీ బ్రిగేడియర్ క్లెర్ వాటిని లెక్కచేయలేదు.

ఆయన కిందకు దిగగానే, అక్కడ నెలకొన్న పరిస్థితి గురించి సైనికుడొకరు క్లెర్‌కు చెబుతున్నారు. అప్పుడే ఒక బుల్లెట్ క్లెర్‌కు అతి సమీపం నుంచి వెళ్లి ఆ సైనికుడి తలలోకి చొచ్చుకుపోయింది. సైనికుడు ధరించిన హెల్మెట్‌ను చీల్చుతూ ఆ బుల్లెట్ తలలోకి దూసుకెళ్లింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. భారత సైనికులకు ఎంత నాసిరకం హెల్మెట్లు ఇచ్చేవారో ఈ ఘటన తెలుపుతుంది.

జమాల్‌పుర్‌పై దాడి చేయాలంటూ బ్రిగేడియర్ క్లెర్‌పై ఒత్తిడి

బ్రిగేడియర్ క్లెర్‌తో ఈస్ట్రన్ కమాండ్ కమాండర్ జనరల్ జగ్జీత్ సింగ్ అరోరా రేడియోలో మాట్లాడారు. అదే రోజు రాత్రి జమాల్‌పుర్‌పై దాడి చేయాలని క్లెర్‌ను కోరారు. ఈ ఆపరేషన్ కోసం భారత్ ఎంతమంది సైనికులనైనా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.

''నేను శత్రువుల కదలికలను పరిశీలిస్తున్నా. అక్కడి పరిస్థితిని అంచనా వేస్తున్నా. నేను పూర్తిగా సన్నద్ధమయ్యాకే జమాల్‌పుర్‌పై దాడి చేస్తాం'' అని క్లెర్ బదులిచ్చారు.

''జనరల్ అరోరా, నా దగ్గరికి వచ్చి అక్కడి పరిస్థితి గురించి తెలుసుకోవాలి అనుకున్నారు. కానీ నేనే ఆయనను వద్దని వారించాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడికి రావడం సురక్షితం కాదన్నాను. ఒకవేళ ఆయన అక్కడికి వస్తే, ఆయన హెలీకాప్టర్‌ సురక్షితంగా ల్యాండ్ అవుతుందనే గ్యారంటీ ఇచ్చే స్థితిలో నేను లేను. కానీ నేను ఆయనకు తురా యుద్ధక్రీడల సమయంలో ఆమోదించిన షెడ్యూల్‌ను అనుసరిస్తానని హామీ ఇచ్చాను. అందుకు ఆయన ఒప్పుకున్నారు. కానీ ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు నాకు అర్థమైంది'' అని మేజర్ జనరల్ హర్‌దేవ్ సింగ్ క్లెర్ రాసుకొచ్చారు.

జమాల్‌పుర్ గ్యారీసన్ కమాండర్‌కు క్లెర్ లేఖ

మరుసటి రోజు, డిసెంబర్ 9న కల్నల్ బుల్‌బుల్ బరార్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత బ్రిగేడియర్ క్లెర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయుధాలు వదిలిపెట్టాల్సిందిగా పాకిస్తాన్ దళం కమాండర్‌కు ఒక అవకాశం ఇవ్వాలని అనుకున్నారు. ఈ మేరకు జనరల్ క్లెర్ రైటింగ్ ప్యాడ్‌పై పాకిస్తానీ కమాండర్‌ను ఉద్దేశించి నాలుగు పేజీల లేఖను కల్నల్ బుల్‌బుల్ బరార్ రాశారు. దానిపై క్లెర్ సంతకం చేశారు.

కమాండర్

జమాల్‌పుర్ గ్యారీసన్

మీ దళాన్ని అన్నివైపుల నుంచి ముట్టడించాం. మీరు తప్పించుకునే వీలు లేదని నేను మీకు తెలియజేస్తున్నా. ఫిరంగులతో కూడిన ఒక దళం మిమ్మల్ని చుట్టుముట్టింది. ఉదయం వరకు మరో దళం మీ వద్దకు రానుంది. మీరు, మా వైమానిక దళం సామర్థ్యాన్ని పైపైనే చూశారు. ఒకవేళ మీరు మీ ఆయుధాలను వదిలిపెట్టాలని భావిస్తే, ఒక సైనికుడిగా, నేను మా వైపు నుంచి మీకు భద్రతను, సురక్షితమైన ప్రవర్తనను అందిస్తామని హామీ ఇస్తున్నా. మీ అహం కోసం, మీ కింది ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టే మూర్ఖులు కాదని నేను నమ్ముతున్నా. నేను సాయంత్రం 6:30 గంటల వరకు మీ సమాధానం కోసం వేచి చూస్తా. మీరు అలా చేయలేని పక్షంలో, మిమ్మల్ని తుదముట్టించడానికి మాకు 40 మిగ్ విమానాలను కేటాయించారు. మీరు, ఈ లేఖను తీసుకొచ్చిన వ్యక్తితో గౌరవంగా వ్యవహరిస్తారని, అతనికి ఎలాంటి హాని తలపెట్టరని నేను ఆశిస్తున్నాను.

సంతకం

బ్రిగేడియర్ హెచ్‌ఎస్ క్లెర్

పాక్ కమాండర్ జవాబు

ముక్తి వాహినికి చెందిన జోహాల్ హఖ్ మున్షి అనే ఒక వ్యక్తి ద్వారా పాకిస్తానీ కమాండర్‌కు ఈ లేఖను పంపించారు. ఆయన సైకిల్‌పై తెల్లని జెండాతో పాకిస్తాన్ వెళ్లారు.

''పాకిస్తాన్ సైన్యం మొదట, లేఖను ఇవ్వడానికి వెళ్లిన వ్యక్తిని పట్టుకొని తీవ్రంగా కొట్టింది. ఆయన స్పృహ కోల్పోయే సమయానికి ఒక పాకిస్తానీ అధికారి వచ్చి ఆయనను కాపాడారు. తర్వాత ఆయనను సోదా చేయగా, బ్రిగేడియర్ క్లెర్ పేరుతో లేఖ కనిపించింది. తర్వాత మున్షిని తీసుకొని పాక్ కమాండర్ సుల్తాన్ అహ్మద్ వద్దకు వెళ్లారు. రాత్రి 8 గంటలకు అదే వ్యక్తితో భారత బ్రిగేడియర్‌కు పాక్ కమాండర్ సుల్తాన్ అహ్మద్ సమాధానం పంపించారు'' అని లెఫ్టినెంట్ కల్నల్ పుంతాంబేకర్ రాసుకొచ్చారు.

డియర్ బ్రిగేడియర్

ఉత్తరం రాసినందుకు ధన్యవాదాలు. ఇక్కడ జమాల్‌పుర్‌లో మేం పోరాటం చేసేందుకు ఎదురుచూస్తున్నాం. కానీ ఇంకా ఆ పోరాటం ప్రారంభం కాలేదు. కాబట్టి మాట్లాడటానికి బదులుగా పోరాటాన్ని ప్రారంభించండి. మమ్మల్ని ఓడించాలంటే 40 విమానాలు సరిపోవు. మరిన్ని విమానాలు కావాలని మీ ప్రభుత్వాన్ని అడగండి. సందేశాన్ని తీసుకొచ్చిన వ్యక్తితో సముచితంగా ప్రవర్తించండి అని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ఆతిథ్యాన్ని మీరు ఎంత చులకనగా చూస్తున్నారో ఇదే తెలుపుతుంది. మేము ఇచ్చిన టీ ఆయనకు నచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నా. నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు ఇలా పెన్నుతో రాయడంలో కాకుండా స్టెన్ గన్‌తో మీ నైపుణ్యాన్ని చూపిస్తారని ఆశిస్తున్నా.

మీ శ్రేయోభిలాషి

లెఫ్టినెంట్ కల్నల్ సుల్తాన్ అహ్మద్

జమాల్‌పుర్ దళం

200 మంది పాకిస్తానీ సైనికులు జమాల్‌పుర్ నుంచి తప్పించుకోగలిగారు

అన్నివైపుల నుంచి భారత సైన్యం చుట్టుముట్టినప్పటికీ, ఆయన ఆవిధంగా లేఖ రాయడం వారి ధైర్యానికి ఉదాహరణగా నిలిచింది.

''ఈ లేఖ పంపిన వెంటనే, జమాల్‌పుర్ వదిలి మధుపుర్ వెళ్లాలని 31 బలూచ్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్‌కు ఆదేశాలు వచ్చాయి'' అని లెఫ్టినెంట్ కల్నల్ రిఫత్ నదీమ్ అహ్మద్ ఒక ఆర్టికల్‌లో రాశారు. ఈ ఆర్టికల్ లాహోర్‌లో ఫ్రైడే టైమ్స్ అనే పత్రికలో 2021 అక్టోబర్ 16న ప్రచురితమైంది.

ఆ ప్రాంతాన్ని వదిలివెళ్లే క్రమంలో చాలా మంది పాకిస్తాన్ సైనికులు మృత్యువాత పడ్డారు. కానీ దాదాపు 200 మంది సైనికులు మాత్రం విజయవంతంగా 93 బ్రిగేడ్, 33 పంజాబ్ గుండా తప్పించుకున్నారు. అక్కడి నుంచి ఢాకాకు 30 కి.మీ దూరంలో ఉన్న కలియాకైర్ వైపుకు వెళ్లారు. ఢాకాకు వెలుపల ఉన్న తుంగాయి నదివైపు వెళ్లాలని వారికి డిసెంబర్ 13న ఆదేశాలు అందాయి. అప్పటికే భారత సైనికులు నలువైపుల నుంచి ఢాకా వైపు కదులుతున్నారు. ఆయుధాలు విడిచిపెట్టాలని పాకిస్తాన్ సైనికులను హెచ్చరించినప్పటికీ వారు మాత్రం వినకుండా భారత సైనికులతో పోరాటానికి దిగారు.

జమాల్‌పుర్‌పై దాడి చేయాలని బ్రిగేడియర్ హర్‌దేవ్ సింగ్ క్లెర్, డిసెంబర్ 11న ఉదయం 2 గంటలకు ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజంతా పాకిస్తాన్ స్థావరాలపై వైమానిక దాడులు జరిగాయి.

సూర్యాస్తమయానికి కాస్త ముందుగా భారత వైమానికి దళం రెండు బాంబులను జారవిడిచింది. అదేరోజు సాయంత్రం 4 గంటల సమయంలో 1ఎంఎల్ఐ ఆక్రమించిన ప్రాంతంపై పాకిస్తాన్ సైనికులు తీవ్రంగా కాల్పులు జరపడం ప్రారంభించారు.

భారత్‌ను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ 120 ఎంఎం మోర్టార్లను ప్రయోగించింది. దీంతో రాత్రి పారిపోయేందుకు పాక్ సైన్యం ప్రయత్నాలు చేస్తోందని బ్రిగేడియర్ క్లెర్ అంచనా వేశారు.

పాకిస్తానీ సైనికుల అపార్థం

''సూర్యాస్తమయం కాగానే జమాల్‌పుర్‌లోని యుద్ధభూమిలో శాంతి నెలకొంది. దీన్ని మీరు హెచ్చరికగా భావిస్తారో లేక సిక్స్త్ సెన్స్ అనుకుంటారో లేక అదృష్టంగా భావిస్తారో నాకు తెలియదు కానీ నేను పాకిస్తానీలపై దాడిని ఆపాలని ఆదేశాలు ఇచ్చాను. రక్షణాత్మక పోరాటానికి సిద్ధంగా ఉండాలని కమాండింగ్ అధికారులను అప్రమత్తం చేశాను. పోరాట సమయంలో పాకిస్తాన్ సైనికులు పారిపోయేందుకు ప్రయత్నిస్తారని నేను ముందే ఊహించాను. తర్వాత, రేపు ఉదయం 7 గంటల వరకు మీకు జమాల్‌పుర్‌ను అప్పగిస్తానని జనరల్ గంధర్వ్ నాగరాతో చెప్పాను. మీరు ఏడింటికల్లా ఇక్కడకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోండి. వచ్చే సమయంలో మన సైనికుల కోసం రుచికరమైన అల్పాహారాన్ని కూడా తీసుకురండి'' అని చెప్పినట్లు మేజర్ జనరల్ క్లెర్ రాసుకొచ్చారు.

పాకిస్తాన్ కల్నల్ సుల్తాన్ అహ్మద్‌తో వారి సైన్యంతో ఎలా వ్యవహరించాలో పూర్తి ప్రణాళికలు సిద్ధం చేసుకొని బ్రిగేడియర్ క్లెర్ నిద్రపోయారు. కానీ డిసెంబర్ 10న అర్ధరాత్రి దాటాక, భారత సైనికులు ఉన్న దిశగా పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. కానీ భారత సోల్జర్స్ మాత్రం వారికి ప్రతిస్పందించకుండా క్రమశిక్షణను పాటించారు. దీంతో భారత సైనికులు వెనుక నుంచి వెళ్లిపోయి ఉంటారని పాక్ సైన్యం పొరబడింది. ఆ తర్వాత కల్నల్ సుల్తాన్ అహ్మద్, తన సైనికులతో కవాతు చేయిస్తూ జమాల్‌పుర్ రహదారిపై వెళ్లారు.

ట్రాప్‌లో చిక్కుకున్న పాకిస్తాన్ సైన్యం

''పాక్ సైన్యం కాల్పుల శబ్ధం విని నేను కళ్లు తెరిచాను. అప్పుడే రోడ్డుకు కేవలం 15 గజాల దూరంలో ఉన్న ఎంఎంజీ బంకర్‌లో ఇంటెలిజెన్స్ అధికారి బల్బీర్ సింగ్, అనువాదకుడు తాహిర్‌తో కలిసి పొజిషన్ తీసుకొని కూర్చొన్నా. రాత్రి దాదాపు ఒంటి గంట సమయంలో, చీకటిలో పాకిస్తాన్ సైన్యం రోడ్డుపై మా ముందు నుంచి వెళ్తూ కనిపించింది. అప్పుడు కూడా సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ శ్వాస గట్టిగా బిగబట్టుకొని కూర్చొన్నాం. పాకిస్తాన్ బెటాలియన్ అంతా మా కిల్లింగ్ జోన్ పరిధిలోకి వచ్చాక, కాల్పులు జరపాల్సిందిగా ఎంఎంజీ గన్‌మెన్‌కు ఆదేశాలు ఇచ్చాను.''

''మేం కాల్చడం మొదలుపెట్టగానే, వాళ్లు కూడా కాల్చడం ప్రారంభించారు. నా ముందే దాదాపు 10 నుంచి 15 మంది పాక్ సైనికులు నేలకూలారు. అప్పుడు తాము ఉచ్చులో చిక్కుకున్నట్లు పాకిస్తానీ కల్నల్ సుల్తాన్ అహ్మద్ గ్రహించారు. పాకిస్తాన్ సైన్యానికి అతి సమీపం నుంచి మేం దాడి చేసినప్పటికీ మేమెవ్వరం గాయపడలేదు'' అని బ్రిగేడియర్ క్లెర్ చెప్పుకొచ్చారు.

234 మంది పాకిస్తానీ సైనికులు హతం

ఉదయం కాగానే, తమ బంకర్‌కు 5 నుంచి 10 గజాల దూరంలో చాలా మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయి ఉండటాన్ని భారత సైన్యం చూసింది. కల్నల్ సుల్తాన్ అహ్మద్ జీప్ కూడా అక్కడికి కేవలం 500మీటర్ల దూరంలో నిలిపి ఉంది. దాని తర్వాత కల్నల్ బుల్‌బుల్ బరార్‌తో కలసి క్లెర్ 31 బలూచ్ రెజిమెంట్ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లారు. వారి మేజర్ ఫజల్ అక్బర్, లెఫ్టినెంట్ జైదీ మరో ఎనిమిది మంది జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు ఆయుధాలు వదిలి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.

దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించగా... అక్కడ 234 మంది పాక్ సైనికుల మృతదేహాలు ఉన్నాయి. మొత్తం 376 మంది పాక్ సైనికులకు గాయాలు కాగా, వారికి భారత వైద్యులు చికిత్స అందించారు. వీరితో పాటుగా 61 మంది సైనికులను యుద్ధ ఖైదీలుగా మార్చారు. మరోవైపు భారత్ నుంచి 10 మంది సైనికులు ప్రాణాలు విడువగా, 8 మందికి గాయాలయ్యాయి.

బ్రిగేడియర్ క్లెర్ జాకెట్‌ను తాకిన 3 బుల్లెట్లు

మరుసటి రోజు ఉదయం 7 గంటలకు జనరల్ నాగరా జమాల్‌పుర్ చేరుకున్నారు. రాగానే ఆయన బ్రిగేడియర్ క్లెర్‌ను ఆలింగనం చేసుకున్నారు. ''హరీ, నువ్వు మాత్రమే ఈ పనిని చేయగలవు'' అన్నారు. ఆయనతో పాటు మరో నలుగురు విదేశీ ప్రతినిధులను కూడా తీసుకొచ్చారు.

''అందులో ఒకరు, నా పారా జాకెట్‌పై పడిన రంద్రాలను చూస్తుండటం నా దృష్టిలో పడింది. అప్పటివరకు నేను మృత్యువుకు అంత దగ్గరగా వెళ్లి వచ్చిన సంగతి నాకు తెలియలేదు. మూడు బుల్లెట్లు నా జాకెట్‌ను చీల్చేశాయి. దీంతో జాకెట్‌కు ఆరు చిల్లులు పడ్డాయి.''

''31 బలూచ్ రెజిమెంట్ సైనికుల హాజరు తీసుకున్నప్పుడు, లెఫ్టినెంట్ కల్నల్ సుల్తాన్ అహ్మద్ మరో 200 మంది సైనికులతో కలిసి పారిపోయినట్లు మాకు తెలిసింది. మేం జమాల్‌పుర్ నగరానికి రాగానే మాకు జన సమూహం స్వాగతం పలికింది. ఆ ప్రాంతానికి చెందిన ముక్తి వాహిని చీఫ్, కెప్టెన్ జైనుల్ అబ్దిన్ మాకు పౌర సత్కారం అందజేశారు. అక్కడ బంగ్లాదేశ్ జెండాను ఎగురవేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన 'అమర్ షోనార్ బంగ్లా'ను ఆలపించారు. తర్వాత ఇదే బంగ్లాదేశ్ జాతీయ గీతమైంది.

ఇద్దరు కమాండర్లకు పురస్కారాలు

యుద్ధం అనంతరం బ్రిగేడియర్ మేజర్ జనరల్ హర్‌దేవ్ సింగ్ క్లెర్‌ను భారత్, లెఫ్టినెంట్ కల్నల్ సుల్తాన్ అహ్మద్‌లను పాకిస్తాన్ దేశాలు సత్కరించుకున్నాయి. దేశంలో రెండో అత్యున్నత శౌర్య పురస్కారమైన మహావీరచక్రతో భారత్ గౌరవించింది. సితార్ ఎ జురాత్ పతకాన్ని సుల్తాన్ అహ్మద్ అందుకున్నారు.

పోరాటం ముగిసిన అనంతరం యుద్ధ ఖైదీగా ఉన్న 31 బలూచ్ రెజిమెంట్‌కు చెందిన మునీర్ అహ్మద్ భట్‌ నుంచి... జమాల్‌పుర్ కమాండర్‌కు బ్రిగేడియర్ క్లెర్ రాసిన లేఖను లెఫ్టినెంట్ కల్నల్ కేశవ్ పుంతాంబేకర్ తీసుకున్నారు. ఆ లేఖను ఫొటో తీసుకొని, దాన్ని అతని యూనిట్ రికార్డులో భద్రపరచడానికి పంపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) 

English summary
Indo-Pak war-1971: How did a Pakistani officer respond to a letter written by an Indian commander
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X