• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘నేను లెస్బియన్‌ని అని చెబుతున్నా బలవంతంగా అబ్బాయితో పెళ్లి చేసేశారు’

By BBC News తెలుగు
|

BARCROFT MEDIA VIA GETTY IMAGES

ఏడో తేదీకి వారం ముందు ఒక అమ్మాయి నుంచి నాకో ఫోన్ కాల్ వచ్చింది. ''నాకు చాలా ఆందోళనగా ఉంది, నన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లగలరా?’’ అని అడిగారు ఆమె.

''ఏమైంది, గృహ హింసా?’’ అని అడిగాను.

కాదు అని చెప్పి ఏడవడం మొదలుపెట్టారామె. ''మా ఇంట్లో వాళ్లెవ్వరినీ నేను సహాయం అడగలేను అని చెప్పారు" అని సామాజిక కార్యకర్త షబ్నం హాష్మి వివరించారు.

ఆ అమ్మాయి ఒక లెస్బియన్ అనీ, తనను బలవంతంగా ఒక అబ్బాయికిచ్చి పెళ్లి చేసేశారని చెప్పారు.

తాను లెస్బియన్ అని పదేపదే చెప్పినా ఇంట్లో ఎవ్వరూ వినిపించుకోలేదని, పెళ్లి అయ్యాక అత్తవారింటికి వెళ్లాల్సి వచ్చిందని, అక్కడ ఇమడలేక పారిపోయి 'అన్హద్' అనే స్వచ్ఛంద సంస్థ సహాయం కోరవలసి వచ్చిందని బాధితురాలు తెలిపారు.

ప్రస్తుతం ఈ కేసు దిల్లీ హై కోర్టులో ఉంది. తన హక్కులు, భద్రత కోసం ఆ అమ్మాయి పోరాడుతోంది.

బాధితురాలి భద్రత విషయమై కోర్టు స్పందిస్తూ.. మేజర్ అయిన వ్యక్తిని అత్తవారింట్లోనో, పుట్టింట్లోనో ఉండమని బలవంతం చేయలేమని పేర్కొంది. తాను కోరుకున్న చోట ఉండే హక్కు ఆమెకు ఉందని స్పష్టం చేసింది.

ఈ విషయంలో అన్హద్ బాధితురాలికి సహాయంగా నిలిచింది. ప్రస్తుతం ఆమె దిల్లీలోని మరో ఎన్జీవో ఆధ్వర్యంలో నడిచే షెల్టర్ హోంలో ఉంటున్నారు.

AMAL KS/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

అందరికీ తెలిసినా కూడా పెళ్లి చేశారు

అన్హద్‌తో కలిసి పనిచేస్తున్న షబ్నం ఏడో తారీఖు పొద్దున్న తనకు మళ్లీ ఫోన్ కాల్ వచ్చిందని చెప్పారు. ఆ అమ్మాయి గాభరా పడుతూ, సహాయం కావాలని కోరారని చెప్పారు.

"బలవంతంగా తనకు పెళ్లి చేసేశారని, తన పరిస్థితి విషమంగా ఉందని ఆమె చెప్పారు. ఇది చిన్నవిషయం కాదని నాకర్థమైంది. తనని నా ఆఫీసుకి రమ్మన్నాను. అప్పుడు ఆమె నాకు మొత్తం కథ చెప్పారు" అని షబ్నం తెలిపారు.

ఆ అమ్మాయి ఏడాదిన్నరగా ఈ యాతన అనుభవిస్తోంది. ఆమెకు 2019 లో వివాహమైంది. తాను లెస్బియన్ అని, అబ్బాయిలపై తనకు ఆసక్తి లేదని, పెళ్లి చేసుకోనని తల్లిదండ్రులకు స్పష్టంగా చెప్పారామె.

కానీ, కుటుంబం ఆమె మాట వినిపించుకోలేదు. పెళ్లయ్యాక ఆమె బురారీలోని తన అత్తవారింటిని వచ్చారు. తనకు అబ్బాయిలమీద ఆసక్తి లేదని, లెస్బియన్ అని తనను పెళ్లి చేసుకున్న అబ్బాయికి వివరించి చెప్పారు. వారిద్దరి మధ్య ఏ రకమైన శారీరక సంబంధం ఏర్పడలేదు.

కానీ, ఆమె అక్కడే ఉండవలసి వచ్చింది. అక్కడ ఆమెకు ఊపిరి సలపలేదు. రాను రాను నిరాశ నిస్పృహలు ఎక్కువయ్యాయి. పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేశారు. భర్తతో విడాకుల గురించి మాట్లాడారు. అయితే, ఏదో ఒక కారణంతో విడాకులు తీసుకోవడం వాయిదా పడుతూ వచ్చింది.

ఆమె భర్త విడాకులు తీసుకునేందుకు అంగీకరించారు. కానీ, తన చెల్లెల్లి వివాహం అయ్యేంతవరకూ ఉండమని.. లేదంటే కుటుంబం పరువు పోతుందని అభ్యర్థించారు.

ఆమె కాదనలేకపోయారు. ఈలోగా 2020 మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించారు. భర్త చెల్లెలు వివాహమైంది కానీ తనకు అక్కడనుంచీ బయటపడే మార్గం చిక్కలేదు.

CHANDAN KHANNA/AFP VIA GETTY IMAGES

చికిత్స చేయిస్తామని బెదిరించారు

బాధితురాలి భర్త భారత వైమానిక దళంలో పని చేస్తున్నారు. ఆయన పోస్టింగ్ వేరే చోట.

ఆమె అప్పుడప్పుడూ తన స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు.

తనకు వివాహేతర సంబంధాలున్నాయని అత్తవారింట్లో నిందలు మోపారు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పారు.

ఈ వివాహ బంధంలో ఇరుక్కుపోయి, ఎంత వేదన అనుభవిస్తున్నారన్న విషయం బాధితురాలు తన తల్లిదండ్రులకు విడమర్చి చెప్పారు. అమీర్ ఖాన్ నిర్వహించిన సత్యమేవ జయతే ప్రోగ్రాంలో ఎల్జీబీటీ కమ్యూనిటీ పడుతున్న బాధల గురించి వచ్చిన ఒక ఎపిసోడ్‌ను కూడా ఆమె తన తల్లిదండ్రులకు పంపించి చూడమని చెప్పారు.

కానీ ఆమె తల్లిదండ్రులు ఆమె మాటలు వినలేదు. తనను అత్తారింటి నుంచి వెనక్కు తీసుకు వస్తే కుటుంబం పరువు పోతుందని అన్నారు. లెస్బియన్‌గా ఉండడం అనేది ఒక జబ్బు అని, దీనికి చికిత్స చేయిస్తామని చెప్పారు. దాంతో బాధితురాలు మరింత భయపడిపోయారు.

ఈ వివరాలన్నీ బాధితురాలు ఫైల్ చేసిన పిటిషన్లో స్పష్టం చేశారు.

"బాధితురాలు నా దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకు చాలా అయోమయంలో ఉన్నారు. తన తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడిన తరువాత ఆమె చాలా కంగారు పడిపోయారు. వాళ్లు ఇప్పుడు వచ్చి ఆమెను చికిత్సకు తీసుకెళతారని ఆందోళన పడ్డారు. తన ఫోన్ కూడా లాగేసుకుంటారని భయపడ్డారు" అని షబ్నం తెలిపారు.

తనకు ధైరం చెప్పి, పోలీసులకు కంప్లైంట్ చేసిన తరువాత ఆమె కాస్త నెమ్మదించారు. ఇప్పుడు ఆమె మానసిక స్థితి ఎంతో మెరుగ్గా ఉంది. ప్రస్తుతం షెల్టర్ హోంలో ఉన్నారు.

తొమ్మిదో తేదీన బాధితురాలి హక్కులను పరిరక్షించాలంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు షబ్నం తెలిపారు.

ఆ తరువాత షబ్నంకు బెదిరింపు కాల్స్ వచ్చాయి.

"ఆ రోజు రాత్రి నుంచి కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి. ఆమె కుటుంబ సభ్యులు షెల్టర్ హోం దగ్గరకు వెళ్లి, ఆమెను అప్పగించమని డిమాండ్ చేశారు" అని షబ్నం చెప్పారు.

కుటుంబం ఏమంటోంది?

ఈ విషయం గురించి బాధితురాలి తండ్రి భరత్ సింగ్‌తో మాట్లాడితే.. తన కుమార్తె లెస్బియన్ అన్న సంగతి తనకు తెలియదని చెప్పారు.

"మా అమ్మయి ఈ విషయం మాకెప్పుడూ చెప్పలేదు. ముందే చెప్తే పెళ్లి చేసేవాళ్లమే కాదు. తన అత్తవారింట్లో ఏం జరిగిందో మాకు తెలియదు. మీ అమ్మాయి ఇంటి నుంచి వెళ్లిపోయిందని కబురు చేస్తే మేం వెళ్లాం. మా అమ్మాయితో మాట్లాడనివ్వండని, కనీసం చూడనివ్వండని వాళ్లని అడిగాం.

మా కుటుంబం కోర్టు మెట్లెక్కే ప్రసక్తే లేదు. మా అమ్మాయి ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటుంది. ఇంటికి రావాలకుంటే వచ్చేయొచ్చు" అని ఆయన చెప్పారు.

కోర్టులో న్యాయమూర్తి స్వయంగా బాధితురాలితో మాట్లాడారని, ఎక్కడ ఉండదల్చుకున్నారని అడిగారని బాధితురాలి తరఫు న్యాయవాది బృందా గ్రోవర్ తెలిపారు.

అయితే, ప్రస్తుతం బాధితురాలికి తన ఇంటికి వెళ్లే ఉద్దేశం లేదని, అక్కడ ఆమెకు ప్రమాదమని భయపడుతున్నారని ఆమె చెప్పారు.

"మేం హై కోర్టులో పిటిషన్ వేశాం. ఎందుకంటే ఆ అమ్మాయి అత్తమామల ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలుసుకున్నాక వాళ్లింట్లో వాళ్లు ఆమెను వెతకడం ప్రారంభిస్తారు. కనిపిస్తే ఏ స్వామీజీ దగ్గరకో, డాక్టర్ దగ్గరకో తీసుకునివెళతారు. ఇప్పుడు ఆ పని చేయలేరు. కోర్టు ఆమెకు భరోసా ఇచ్చింది" అని గ్రోవర్ తెలిపారు.

"కోర్టు ఏం చెప్పిందంటే.. మేజర్ అయిన యువతిని ఎవరూ ఏ బంధంలోనూ నిర్బంధించలేరు. తన సెక్సువల్ ఓరియెంటేషన్ వేరుగా ఉంటే ఇలా బలవంతంగా వివాహం చేయలేరు. వెంటనే తనకు విడాకులు ఇమ్మని ఆమె భర్తను కోర్టు ఆదేశించింది. అందుకు ఆయన కూడా అంగీకరించారు" అని లాయర్ చెప్పారు.

కేసు ముగిసిన తరువాత బాధితురాలు తన ఇష్ట ప్రకారం జీవించవచ్చు. చదువుకోవాలంటే చదువుకోవచ్చు లేదా ఉద్యోగం చేయొచ్చు అని ఆమె అన్నారు.

ఇదొక్కటే కేసు కాదు

ఇలా ఎంతోమంది లెస్బియన్ అమ్మాయిలకు బలవంతంగా వివాహాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఎంతోమంది అమ్మాయిలు ఇలాంటి వేదనే అనుభవిస్తూ ఉన్నారు.

"ఇలాంటి బలవంతపు వివాహాలు, స్వలింగ సంపర్కులని నిర్బంధించి పెళ్లిళ్లు చేస్తున్న కేసులు తక్కువేమీ లేవు. కాకపోతే, వీటి గురించి తగినంత డాటా లేదు. ప్రభుత్వం వీళ్ల గురించి సీరియస్‌గా తీసుకోవట్లేదు. పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే.. ఒక్కోసారి నాకు వారానికి ఇలాంటి కాల్స్ రెండు సార్లైనా వస్తుంటాయి.

మన సమాజంలో స్త్రీ ఇష్టాయిష్టాలకు, హక్కులకు గుర్తింపు లేదు. స్వలింగ సంపర్కులలో స్వలింగ స్త్రీల జీవితాలు మరింత కష్టం. అమ్మాయిలకు కూడా శారీరక వాంఛలు ఉంటాయని ఈ సమాజం అంగీకరించదు. అలాంటప్పుడు అమ్మాయిలు ఏం చెప్పినా ఎవరూ పట్టించుకోరు. ఆ మహిళలంతా ఇలా వివాహ బంధాల్లో చిక్కుకుని జీవితాంతం దుఃఖపడుతుంటారు, హింసకు గురవుతుంటారు" అని మానవ హక్కుల కార్యకర్త హరీశ్ అయ్యర్ తెలిపారు.

స్వలింగ సంపర్కుల గురించి పెత్త ఎత్తున అవగాహన కలిగించాల్సి ఉంది. చాలామంది దీన్ని ఒక జబ్బు అని కూడా అనుకుంటున్నారు. నిపుణులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని హరీశ్ అభిప్రాయపడ్డారు.

"చట్టంలో, సమాజంలో కూడా స్వలింగ సంపర్కుల పట్ల అవగాహన పెరగాలి. స్వలింగ వివాహాలు చట్టబద్ధం చెయ్యాలి. అప్పుడు ప్రజల్లో కూడా కొంత మార్పు వస్తుంది. ప్రభుత్వం ఎల్జీబీటీ అవగాహన కార్యక్రమాలు రూపొందించాలి. విస్తృతంగా ప్రచారం చెయ్యాలి. అప్పుడే ఇది సహజమనే అవగాహన ప్రజల్లో వస్తుంది" అని వృందా గ్రోవర్ అన్నారు.

కాలంతో పాటూ ప్రజల్లో మార్పు వస్తుందనే నమ్మకం ఉంది. కానీ, ఈలోగా ఎంతోమంది యువతులు బలైపోతారని ఆమె విచారం వ్యక్తం చేశారు.

బాధితురాలు ప్రస్తుతం షెల్టర్ హోంలో ఉంటున్నారు. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 25న జరగనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Inspite of me telling that iam a lesbian i was forcibily married to a boy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X