తీవ్రమవుతున్న రైతు ఉద్యమం .. ఢిల్లీ ఘెరావ్ ప్లాన్ .. డిసెంబర్ 14 న దేశవ్యాప్త నిరసనకు పిలుపు
వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైతులు బుధవారం తిరస్కరించిన విషయం తెలిసిందే . రైతులకు నష్టం చేసే నల్ల చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్న రైతులు తమ ఆందోళన విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మరోమారు డిసెంబర్ 14 న దేశవ్యాప్తంగా ధర్నా నిరసనకు పిలుపునిచ్చారు.
సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు డిప్యూటీ సీఎం ఆందోళన .. రైతులకు అండగా ఉండటం నేరమా .. బీజేపీపై ఫైర్

ఢిల్లీ ఘెరావ్ ప్రణాళికను ప్రకటించిన రైతులు
ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఢిల్లీ సరిహద్దులను ఆందోళన కొనసాగిస్తున్నారు రైతులు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా, ఆందోళనలో పాల్గొన్న రైతులు ప్రాణాలు కోల్పోతున్న ప్పటికీ వ్యవసాయ చట్టాల రద్దు కోసం నిరసనలు కొనసాగించి తీరుతామని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ జైపూర్, ఢిల్లీ -ఆగ్రా రహదారిని డిసెంబర్ 12 లోగా నిరసనకారులు అడ్డుకుంటారని, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్లను రైతులు స్వాధీనం చేసుకుని, టోల్ ట్యాక్స్ లు లేకుండా చేస్తారని , ఆందోళన కొనసాగిస్తామని రైతు నాయకులు ఢిల్లీ ఘెరావ్ ప్రణాళికను ప్రకటించారు.

మోడీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ
అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ (ఎ.ఐ.కె.ఎస్.సి.సి) కూడా ప్రభుత్వ ప్రతిపాదనపై తమ ప్రకటనను విడుదల చేసింది . పాత ప్రతిపాదనలను కొత్తగా పంపించారు అంటూ కమిటీ పేర్కొంది .
రైతుల డిమాండ్లను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధి లేనిదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని రైతు సంఘాలు ప్రభుత్వం పాత ప్రతిపాదనలే మళ్లీ కొత్తగా రైతుల ముందు పెట్టడంతో తీవ్ర అసహనంతో ఉన్నారు. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్‌ను అన్ని రైతు సంస్థలు పునరుద్ఘాటిస్తున్నాయి.

అన్ని రాష్ట్రాల్లో జిల్లా స్థాయిలోనూ ధర్నాలు ప్రారంభించాలని నిర్ణయం
నిరసనను కొనసాగించాలని , ఎక్కువ మంది రైతులు నిరసనలో భాగస్వామ్యం తీసుకోవాలని, అన్ని రాష్ట్రాల్లో జిల్లా స్థాయిలోనూ ధర్నాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రాత్రి 13 వ్యవసాయ సంఘాలు, హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని ప్రభుత్వ పక్షం మధ్య నాలుగు గంటల సమావేశం తరువాత కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దుకు నో చెప్పింది . వ్యవసాయ చట్టాల్లో మార్పులు సిద్ధమంటూ కేంద్రం ప్రతిపాదనలను రైతుల ముందు పెట్టడంతో నిర్ద్వంద్వంగా నిరాకరించిన రైతులు ఈ రోజు రైతులు ఆరో విడత చర్చలు కూడా వెళ్లకుండా ఆందోళనను కొనసాగించారు.

మరోమారు డిసెంబర్ 14 న దేశవ్యాప్తంగా ధర్నా
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి దేశవ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగా మరోమారు డిసెంబర్ 14 న దేశవ్యాప్తంగా ధర్నా చెయ్యాలని నిరసనకు పిలుపునిచ్చారు.ఈ లోగా ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి . రైతులు ఇప్పటికే వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తేనే వెనుదిరిగి వెళ్తామని ఆరు నెలలైనా ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. అటు ప్రభుత్వం , ఇటు రైతులు మొండి వైఖరి వీదకపోవటంతో ప్రస్తుతం ప్రతిష్టంభన నెలకొంది.