వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాదాతో దీదీకి చెక్: ప్రధాని అభ్యర్థిగా పెద్దాయన ప్రణబ్.. కాంగ్రెస్ వ్యూహాత్మక ఎత్తుగడ..?

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా ఎన్నికలు తుది దశకు చేరుకుంటున్నాయి. ఇక ఇప్పటికే ఆరు విడతలుగా జరిగిన పోలింగ్‌లో ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తున్నట్లుగా పరిస్థితి కనిపించడం లేదు. ఈ తరుణంలో జాతీయ పార్టీల చూపు ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గుతోంది. ఇక మహాకూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు ఉంటారా అనేదానిపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తెరపైకి కొత్త పేరు వచ్చింది. ఈ పేరుపై చర్చ అయితే జరుగుతోంది కానీ వాస్తవంగా ఇది సాధ్యమయ్యే పరిస్థితేనా అనే వాదన కూడా వినిపిస్తోంది.

ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం పాకులాట

ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం పాకులాట

దేశంలో సార్వత్రిక ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఓటర్ల తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంది. ఇక వచ్చేది హంగ్ పార్లమెంటా లేక స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే జాతీయ పార్టీల చూపు ప్రాంతీయ పార్టీల వైపు పడింది. మే 23న ఫలితాలు వస్తున్న నేపథ్యంలో పరిస్థితి తమకు అనూకూలించకపోతే ఎలా అనే సందిగ్ధంలో ఉన్న జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం ఇప్పటికే కర్చీఫ్‌లు వేసి రిజర్వ్ చేసుకుంటున్నాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలకు సపోర్ట్ ఇవ్వాలంటే తమ డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇస్తేనే ఆలోచిస్తామని మొండిగా చెప్పేస్తున్నాయి.

 ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను వ్యతిరేకిస్తున్న కొందరు

ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను వ్యతిరేకిస్తున్న కొందరు

కాంగ్రెస్‌లో స్పష్టమైన మెజార్టీ వస్తేనే ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అవుతారనేది దాదాపు స్పష్టమైంది. అయితే ప్రస్తుత పరిస్థితులు కాంగ్రెస్‌కు పూర్తి స్థాయి మెజార్టీ తెచ్చేలా కనిపించడం లేదు. అదే సమయంలో బీజేపీకి అవకాశం ఇవ్వకూడదన్నది కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేందుకు ఇటు శరద్ పవార్, మమతా బెనర్జీలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మమతా బెనర్జీ ప్రధానిగా ఉండాలని ఆశపడితే కాంగ్రెస్ ఇందుకు ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక మాయావతి చివరి నిమిషంలో ఎటువైపైనా మొగ్గే అవకాశం ఉంది. అఖిలేష్ యాదవ్ కూడా ప్రధాని అభ్యర్థిగా రాహుల్ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దక్షిణంలో జగన్ మాత్రం కాంగ్రెస్‌కు మద్దతు పలికే పరిస్థితి కనపడటం లేదు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ తన పాచికను పారించే ప్రయత్నం చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ట్రబుల్ షూటర్ ప్రణబ్..?

కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ట్రబుల్ షూటర్ ప్రణబ్..?

ఇన్ని సమీకరణాలు మధ్య తాజాగా ఊహించని ఓ పేరు ప్రధాని అభ్యర్థిగా రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆయనే మాజీ రాష్ట్రపతి కాంగ్రెస్ కురవృద్ధుడు ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ. అవును ప్రణబ్ ముఖర్జీ పేరు యూపీఏ తరపున ప్రధాని అభ్యర్థిగా వినిపిస్తోంది. ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని కావాలన్న కోరిక ఉండేదని చాలా సార్లు ఆయన తన సన్నిహితుల దగ్గర చెప్పుకున్నారు కూడా. అంతేకాదు ప్రణబ్ ముఖర్జీకి ఇటు ఆర్‌ఎస్ఎస్‌తో అటు కాంగ్రెస్ వర్గాలతో మంచి సంబంధాలున్నాయి. అంతేకాదు ప్రణబ్ ఇటు నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారు కాదు, అటు బీజేపీకి చెందిన వారు కాదు. ఈ పరిస్థితుల్లో చాలా వరకు ఎన్డీయే పార్టీలు కూడా ఒప్పుకునే పరిస్థితి ఉంది. ప్రణబ్ ముఖర్జీ పేరు ప్రధానిగా ప్రకటిస్తే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్‌లకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. వారితో దాదాకు మంచి సంబంధాలున్నాయి. ఇక పోతే ప్రణబ్ ముఖర్జీకి తన తండ్రి వైయస్‌తో ఉన్న మంచి సంబంధాల ద్వారా జగన్ కూడా నో చెప్పే పరిస్థితి లేదు. ఇక కేసీఆర్‌కు బెంగాలీ దాదాతో మంచి సంబంధాలున్నాయి. ఒకవేళ స్పష్టమైన మెజార్టీ రాకుండా దగ్గరలో సంఖ్యా బలం నిలిచిపోతే ప్రాంతీయ పార్టీల అధినేతలను కన్విన్స్ చేసేందుకు ప్రణబ్ ముఖర్జీ పేరును ప్రధానిగా ప్రతిపాదించాలని కాంగ్రెస్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు ఏమైనా సాంకేతిక కారణాలు అడ్డొస్తాయా అనే అంశాన్ని పరిశీలించాలి.

ఇప్పటి వరకు ఎప్పుడూ లేని సంప్రదాయం

ఇప్పటి వరకు ఎప్పుడూ లేని సంప్రదాయం

ఇదిలా ఉంటే రాష్ట్రపతిగా చేసిన వ్యక్తి ప్రధానిగా చేయకూడదని రాజ్యాంగంలో లేదు. కాకపోతే మన భారత రాజకీయ సంప్రదాయాల్లో ఇప్పటి వరకు ఒక మాజీ రాష్ట్రపతి తిరిగి ప్రధాని పదవి చేపట్టిన దాఖలాలు లేవు. మరి ప్రణబ్ ముఖర్జీ ఇప్పటికే రాష్ట్రపతిగా చేశారు కాబట్టి తిరిగి ప్రధానిగా చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. అంతేకాదు ప్రణబ్ అయితే బాగుంటుందని చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రణబ్‌కు ట్రబుల్ షూటర్ అనే పేరుంది కాబట్టి ఏ సమస్య వచ్చినా దాదా ఇట్టే పరిష్కరించగల సత్తా ఉంది. ప్రణబ్ ముఖర్జీ అయితే అన్ని విధాల బాగుంటుందని అన్ని ప్రాంతీయ పార్టీలు ఆమోదం తెలిపి మద్దతు ప్రకటించే అవకాశం ఉందని హస్తం పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఇక 19వ తేదీన ఎన్నికలు ముగిశాక ఏ క్షణమైనా సరే యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా ప్రణబ్‌ముఖర్జీని కలిసే అవకాశం ఉంది. మే 23న ఫలితాల తర్వాత జరిగే సమావేశంలో ప్రణబ్ ముఖర్జీ పేరును ప్రతిపాదించే ఛాన్స్ ఉందనే వార్తలు షికారు చేస్తున్నాయి. మరి దాదా మనసులో ఏముందో తెలియాలంటే మే 23 వరకు వేచిచూడాల్సిందే.

English summary
Discussions in congress are on its way as who will be the Prime Minister candidate if a situation arises as no party gets a clear majority.In this back drop to garner the support of regional parties congress party is heavily relying on Fromer President Pranab Mukherjee. If Pranab's name is announced as the PM candidate then congress hopes that regional parties may extend their support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X