shivraj singh chouhan madhya pradesh bhopal అంతర్జాతీయ మహిళా దినోత్సవం శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ భోపాల్
Women's Day: ఆ ముఖ్యమంత్రికి రక్షణ వలయంగా..కారు డ్రైవర్ కూడా: అందరూ మహిళలే
భోపాల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా మహిళలను నియమించుకున్నారు. అక్కడితో ఆగలేదు.. తన అధికారిక కారు డ్రైవర్‌గా మహిళను అపాయింట్ చేశారు. ఈ రోజంతా వారు ముఖ్యమంత్రి వద్ద విధి నిర్వహణలో కొనసాగుతారు. అనంతరం వారిని వేర్వేరు శాఖలు, విభాగాలకు బదిలీ చేస్తారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్తగా నియమితులైన మహిళలంతా ఈ తెల్లవారు జామున విధి నిర్వహణలో దిగారు. ముఖ్యమంత్రి వెంటే ఉన్నారు. రాజధాని భోపాల్‌లోని నెహ్రూ నగర్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటనను వారే పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి అధికారికంగా వినియోగించే కారు డ్రైవర్ కూడా మహిళే. ఆమె డ్రైవ్ చేసిన కారులోనే ఆయన నెహ్రూ నగర్‌కు చేరుకున్నారు. భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులతో ఆయన మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వారితో కలిసి తాను కూడా చీపురు పట్టారు. కొద్దిసేపు రోడ్డును ఊడ్చారు. పారిశుద్ధ్య కార్మికులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. మహిళల పురోభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్నామని పేర్కొన్నారు. అట్టడుగు స్థాయిలో ఉన్న మహిళలకు ఆర్థిక స్వావలంబనను కల్పించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తోన్నామని అన్నారు. ఉద్యోగాల కల్పనలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, వారి కోసం ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.