వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిహార్ ఎన్నికలు: నితీశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా బీజేపీ, చిరాగ్‌ పాశ్వాన్‌ తెర వెనక కథ నడిపిస్తున్నారా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నితీశ్‌ను పక్కనబెట్టేందుకు ఎల్‌జేపీని బీజేపీ రంగంలోకి దించిందని బిహార్‌లో చర్చ జరుగుతోంది

రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ) బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద్‌ సింగ్ తన మద్దతుదారులతో పట్నాలోని వీర్‌చంద్ పటేల్ మార్గ్‌లో ఉన్న పార్టీ ఆఫీసులో కూర్చుని ఉన్నారు.

అందరి కళ్లు టీవీ మీద ఉన్నాయి. జేడీయూ, బీజేపీ కూటమి విలేకరుల సమావేశం జరుగుతోంది. ఈసారి నితీశ్‌ కుమార్‌ను పక్కనబెట్టడానికి బీజేపీ పూర్తిగా ప్రణాళిక సిద్ధం చేసిందని జగదానంద్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

“బీజేపీ నేత రాజేంద్ర సింగ్‌ ఇప్పుడు లోక్‌ జన్‌శక్తి పార్టీలోకి వెళ్లారు. 2015లో బీజేపీ ఆయనను సీఎం అభ్యర్ధిగా అభివర్ణించింది. జార్ఖండ్‌లో ఆయన బీజేపీకి నాయకత్వం వహించారు. వాళ్లు అంతా సెట్ చేసుకున్నారు. ఎల్‌జేపీ అభ్యర్ధులు ఎవరో బీజేపీయే నిర్ణయిస్తోంది’’ అని ఆర్‌జేడీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు.

"బీజేపీ నేతగా రాజేంద్ర సింగ్‌కు మంచి పేరు ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇంతకంటే ఎక్కువ అర్హతలు ఏం కావాలి? గతంలో నితీశ్‌ కుమార్‌ మమ్మల్ని మోసం చేసారు. ఇప్పుడు ఆయనకు తెలిసి వస్తుంది’’ అన్నారు జగదానంద్‌ సింగ్‌. ఆ గదిలో కూర్చున్న నేతలంతా జగదానంద్‌ సింగ్‌ చెప్పింది నిజమేనన్నారు.

అదే సమయంలో టీవీలో బ్రేకింగ్‌ న్యూస్‌ వస్తోంది. ఆర్‌జేడీలో చేరిన 'అనంత్‌’ బాహుబలికి మోకామా నుంచి టికెట్‌ ఇచ్చారన్నది ఆ బ్రేకింగ్‌ న్యూస్‌ సారాంశం. అనంత్‌సింగ్‌కు టికెట్‌ ఎందుకిచ్చారని నేను జగదానంద్‌ సింగ్‌ను అడిగాను.

“నిన్నటి వరకు ఆయన నితీశ్‌ కుమార్‌తో ఉన్నారు. ఆయనకు మంచివాడు మాకు చెడ్డవాడు ఎలా అవుతారు’’ అని జగదానంద్‌ సింగ్‌ ప్రశ్నించారు.

బీజేపీయే మిమ్మల్ని ఎల్‌జేపీ అభ్యర్ధిగా మార్చిందా? బీజేపీలో మంచి స్థానం ఉండగా లోక్‌ జన్‌శక్తిలోకి ఎందుకు వెళ్లారు? ఎమ్మెల్యే టికెట్‌ కోసమే పార్టీ మారారా అని నేను రాజేంద్రసింగ్‌ను ప్రశ్నించాను.

“నేను అభ్యర్ధిగా రావాలని దినారా నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. వారి ఒత్తిడి మేరకే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. పార్టీ మారినంత మాత్రాన నా భావజాలం మారదు. నేను ఇప్పటికీ అదే భావజాలంతో ఉన్నాను'' అన్నారు రాజేంద్ర సింగ్‌.

నితీశ్ కుమార్‌ను రాజకీయంగా ఏకాకిని చేయడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోందని పట్నా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

బిహార్‌లోని అన్ని సీట్లలో జనతాదళ్‌ యునైటెడ్‌( జేడీయూ)కు వ్యతిరేకంగా ఎల్‌జేపీ తన అభ్యర్ధులను నిలబెట్టబోతోంది.143 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఎల్‌జేపీ నేత చిరాగ్‌ పాసవాన్‌ ఇప్పటికే ప్రకటించారు.

అదే జరిగితే బీజేపీ ఇంతకు ముందు పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా ఆ పార్టీ తన అభ్యర్థులను నిలబెడుతుందని స్పష్టమవుతోంది. అంటే బీజేపీ, ఎల్‌జేపీ మధ్య రహస్య ఒప్పందం నిజమేనా ?

హద్దులేని ఆశలు

బీజేపీ, ఎల్‌జేపీల మధ్య రహస్య ఒప్పందం ఉందన్న వాదనను జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్‌ రంజన్‌ ప్రసాద్‌ తోసిపుచ్చారు. “బీజేపీ 121, జేడీయూ 122 స్థానాల్లో పోటీ చేస్తాయని స్పష్టమైంది. ఈ ఎన్నికల్లో పోలరైజేషన్‌ జరుగుతోంది. ఎన్‌డీఏ, ఆర్‌జేడీల మధ్యే పోటీ ఉంటుంది. మిగిలిన వారు ఎటు ఉండాలో వాళ్లే నిర్ణయించుకుంటారు’’ అన్నారాయన.

“చిరాగ్‌ పాసవాన్‌లో అంతులేని ఆశలు ఉన్నాయి. అందుకే ఆయన తరచూ నిర్ణయాలు మారుస్తుంటారు. రామ్‌విలాస్‌ పాసవాన్‌ అలా కాదు. ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా లేరు. అందుకే చాలా జరిగిపోతున్నాయి’’ అన్నారు రాజీవ్‌ రంజన్‌.

"నితీశ్‌ కుమార్‌ ఉన్న కూటమే గెలుస్తుంది. ఆయన లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలని, గెలిచి అధికారం సాధించాలని ఎవరూ అనుకోవడం లేదు’’ అని వ్యాఖ్యానించారు రాజీవ్‌ రంజన్‌.

"బీజేపీ, ఎల్‌జేపీల మధ్య ఏదైనా అవగాహన ఉంటే ఉండవచ్చు. కానీ ఎన్నికలు దగ్గర పడేసరికి పరిస్థితి మారుతుంది" అని రాజీవ్‌ రంజన్‌ అన్నారు.

ప్రధాన మంత్రి మోదీ ఫోటోను ఎన్‌డీఏ మాత్రమే ఉపయోగిస్తుందని, బిహార్‌ ఎన్‌డీఏలో ఎల్‌జేపీ లేదని బీజేపీ కూడా ఇప్పటికే స్పష్టంగా చెప్పింది.

నితీశ్ కుమార్

2005 ఫిబ్రవరిలో జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రామ్‌విలాస్ పాసవాన్‌, నితీశ్‌ కుమార్‌ పోటీపడగా ఎవరికీ విజయం దక్కలేదు. అప్పట్లో రామ్‌విలాస్‌ పాసవాన్‌ పార్టీ 29 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. కానీ ఏ కూటమికీ మద్దతివ్వలేదు. తిరిగి 2005 అక్టోబర్‌లో ఎన్నికలు జరిగాయి. బీజేపీ, జేడీయూలు స్పష్టమైన మెజారిటీ సాధించడంతో ఎల్‌జేపీ పక్కకు పోయింది. ఆ ఎన్నికల్లో ఎల్‌జేపీ బలం 29 సీట్ల నుంచి 10 సీట్లకు పడిపోయింది.

2015లో నితీశ్‌ కుమార్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్ ఒకే కూటమిగా పోటీ చేశారు. బీజేపీ 42 సీట్లు ఇచ్చినా ఎల్‌జేపీ 2 సీట్లలోనే గెలిచింది. ఈసారి ఎల్‌జేపీకి 15కి పైగా సీట్లు ఇవ్వడానికి జేడీయూ ఒప్పుకోలేదు. 42కన్నా తక్కువ సీట్లలో పోరాడటానికి ఎల్‌జేపీ సిద్ధంగా లేదు.

నితీశ్‌కుమార్‌, రామ్‌విలాస్‌ పాసవాన్‌ మధ్య దళిత ఓట్ల యుద్ధం కూడా ఉంది. ఇటీవల్‌ అశోక్‌ చౌదరిని జనతాదళ్‌ యునైటెడ్‌ యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రకటించారు నితీశ్‌ కుమార్‌. అశోక్‌ చౌదరి రామ్‌విలాస్‌ పాసవాన్‌ కులం దుసాద్‌కు చెందిన వ్యక్తి. ఈ కులాన్ని మహాదళిత్‌ కేటగిరీలో చేర్చారు నితీశ్‌.

నితీశ్‌ కుమార్‌ దళితులకు మరో నజరానా కూడా ప్రకటించారు. దళితుల్లో ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందని కులాలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని ప్రకటించడం ద్వారా వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

దళిత ఓట్ల కోసం చిరాగ్‌, నితీశ్‌ పోరాటం

చిరాగ్‌ పాసవాన్‌ దుసాద్‌ కులానికి చెందిన వ్యక్తి. మొదట్లో నితీశ్‌ కుమార్‌ మిగిలిన దళిత కులాలు అన్నింటినీ మహాదళిత్‌ కేటగిరీలో చేర్చినా, దుసాద్‌ కులం మాత్రం అందులో లేదు. అయితే తర్వాత కొన్నాళ్లకు దుసాద్‌ కులాన్ని కూడా మహాదళిత్‌ వర్గంలో చేర్చారు నితీశ్‌.

2011 జనాభా లెక్కల ప్రకారం బిహార్‌లో 93.3శాతంమంది దళితులు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గయా, కైమూర్, వైశాలి, ఔరంగాబాద్‌, నలంద ప్రాంతాల్లో దళితుల జనాభా ఎక్కువగా ఉంది.

జనాభా లెక్కల ప్రకారం 23 షెడ్యూల్డ్ కులాలలో చమర్ కులానికి అత్యధిక వాటా ఉంది. మొత్తం దళితుల్లో వారు 31.3శాతం ఉన్నారు. వీరి తర్వాత దుసాద్‌ కులస్తులు అంటే పాసవాన్‌ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. దళితుల్లో వారివాటా 30శాతం ఉంటుంది.

బిహార్‌ మొత్తంగా చూస్తే జనాభాలో 16%మంది దళితులు ఉన్నారు. అధికారాన్ని ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి కట్టబెట్టడంలో వీరిది ప్రధాన పాత్ర.

బిహార్‌లో బీజేపీ 'బిగ్‌బ్రదర్‌’ పాత్ర పోషిస్తోందా?

ఎన్‌డీఏలో బీజేపీ, జేడీయూ దాదాపు సమానంగా సీట్లు పొందడం ఇదే మొదటిసారి. గతంలో జేడీయూది పైచేయిగా ఉండేది.

2005 అక్టోబర్‌లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 139సీట్లలో పోటీ చేసి 88 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 102 స్థానాలకు పోటీ చేసి 55 స్థానాలను గెలుచుకుంది.

2010 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మళ్లీ 102 సీట్లే ఇచ్చి, జేడీయూ మాత్రం 141 సీట్లలో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 92 సీట్లు గెలవగా, జేడీయూ 115చోట్ల విజయం సాధించింది. 2015లో బీజేపీ, జేడీయూ వేర్వేరుగా పోటీ చేశాయి.

సీట్ల పంపకం విషయంలో బీజేపీ, జేడీయూల మధ్య పట్నాలో ఇటీవల జరిగిన ఒక ఆసక్తికరమైన సన్నివేశాన్ని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ బీజేపీ నేత బీబీసీకి వెల్లడించారు. “ బీజేపీ బిహార్‌ ఇంఛార్జ్‌ దేవేంద్ర ఫడణవీస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సీట్ల సంఖ్య విషయంలో ఇరు పార్టీల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా ఫడణవీస్‌ జేడీయూ నేత లలన్‌ సింగ్‌ ముందుకు ఒక ఫైలును విసిరారు. అందులో 2015 ఎన్నికల్లో పార్టీల బలాబలాలున్నాయి. మీరు ఎక్కడి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లవచ్చు అని తేల్చి చెప్పారు’’.

“దేవేంద్ర ఫడణవీస్‌, భూపేంద్ర యాదవ్‌లు ఆ సమావేశం నుంచి ఆవేశంగా వెళ్లిపోయారు. గతంలో నితీశ్‌ కుమార్‌ ఏం చెప్పినా బీజేపీ విన్నది, ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది” అని ఆ నేత వెల్లడించారు.

“నితీశ్‌ కుమార్‌తో పనిలేకుండా విజయం సాధించాలని బీజేపీ, ఎల్‌జేపీ ఒక అంగీకారానికి వచ్చాయి’’ అని బీజేపీ ఐటీ విభాగానికి చెందిన ఓ నేత వెల్లడించారు. ఆయన తన పేరు బైట పెట్టడానికి ఇష్టపడలేదు.

బీజేపీకి మంచి సీట్లు లభిస్తే ముఖ్యమంత్రి అభ్యర్ధులుగా నిత్యానంద్‌ రాయ్‌, రవి శంకర్‌ ప్రసాద్‌, ఆర్కేసింగ్‌ పేర్లు ముందు వరసలో నిలుస్తున్నాయి. వీరు రేసులో ఉన్నట్లు బీజేపీ ఐటీ సెల్‌ నేత కూడా అంగీకరించారు.

ఇక జేడీయూ, బీజేపీ విడిపోతే, ఆర్‌జేడీని వదిలేసి నితీశ్‌ కుమార్‌ వెంట నడవాలని కాంగ్రెస్‌ ఎదురు చూస్తోంది.

“మేం 70సీట్లు కావాలన్నాం. కానీ లాలూజీ 55కన్నా ఎక్కువ ఇవ్వడం కష్టం అన్నారు. నితీశ్‌, బీజేపీల మధ్య పరిస్థితులు అంత మంచిగా లేవు. వారిద్దరు విడిపోతారని మేం అనుకుంటున్నాం. నితీశ్‌తో కూటమి ఏర్పాటుకు మేం సిద్ధంగా ఉన్నాం. లాలూ ప్రసాద్‌ చివరకు 70సీట్లు ఇచ్చారు. కానీ అందులో చాలా ఓడిపోయే సీట్లే ఉన్నాయి’’ అని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడొకరు వ్యాఖ్యానించారు.

ఈసారి బిహార్‌ ఎన్నికలు చాలా క్లిష్టంగా కనిపిస్తున్నాయి. రెండు సంకీర్ణాలతోపాటు ఒవైసీ పార్టీ కూడా రంగంలోఉంది. వీరు కాక ఉపేంద్ర కుష్వాహా, పప్పూయాదవ్‌లు కూడా ఉన్నారు. వీరంతా ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లకు తీవ్ర నష్టం కలిగిస్తారని అంటున్నారు. కానీ బీజేపీ, ఎల్‌జేపీల మధ్య రహస్య ఒప్పందం లేదంటే మాత్రం ఎవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Is BJP and Chirag paswan working against Nitish kumar behind the scenes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X