సీబీఐ విశ్వసనీయత తగ్గుతుందా ? .. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐపై మద్రాస్ హైకోర్టు ప్రశ్నల వర్షం
దేశంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పనితీరుపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సిబిఐ కేసుల్లో నేరారోపణ తక్కువగా ఉందని, అనేక కేసులలో శిక్ష రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. దేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థ విశ్వసనీయతను కోల్పోతున్నట్లుగా కనిపిస్తోందని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు సిబిఐ పనితీరును పరిశీలించేటప్పుడు ఈ వ్యాఖ్యలు చేసింది.

సీబీఐ కేసుల్లో చాలా వరకు నేర నిరూపణ కావట్లేదు
సీబీఐ కేసుల్లో చాలామంది వైట్ కాలర్ నేరాలకు పాల్పడిన వారు నిందితులు కాదని తేలుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఇలా ఎందుకు జరుగుతోంది అని సిబిఐ దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది . చాలా సందర్భాలలో సీబీఐ అధికారులు సేకరించిన సాక్ష్యాలు సరిపోవని ట్రయల్ కోర్టులు అభిప్రాయపడుతున్నాయి. అలాంటి ఆందోళనకర పరిస్థితి ఒక కేంద్ర దర్యాప్తు సంస్థకు రాకూడదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. సిబిఐ నేరస్థులను బుక్ చేయడానికి, వారిని దోషులుగా నిరూపించడానికి కావలసిన ఆధారాలను సేకరించడానికి సమర్థవంతంగా పనిచేసే నిపుణుల ఏజెన్సీ అని దేశ ప్రజలందరూ సాధారణంగా నమ్ముతారని కోర్టు అభిప్రాయపడింది.

అనేక కేసుల్లో సీబీఐ దర్యాప్తు తప్పు అని తేలుతోంది ..
దర్యాప్తుకు అవసరమైన నైపుణ్యం వారికి ఉందా?
అయితే అనేక కేసుల్లో సీబీఐ దర్యాప్తు తప్పు అని తేలిందని సాధారణ అభిప్రాయంగా పేర్కొంది. కాబట్టి కోర్టు సిబిఐలోని అధికారుల గురించి ప్రశ్నిస్తూ ఉందని , వారిని ఎలా నియమించుకుంటారో చెప్పాలని పేర్కొంది. సిబిఐలో చాలా మంది అధికారులు సిఐఎస్ఎఫ్ మరియు సిఆర్పిఎఫ్ నుండి డిప్యుటేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తుకు అవసరమైన నైపుణ్యం వారికి ఉందా? అని ప్రశ్నించింది మద్రాస్ హైకోర్టు. బ్యాంక్ మోసాలు మరియు ఇతర వైట్ కాలర్ నేరాలపై దర్యాప్తు చేయడానికి సిబిఐ అధికారులు బ్యాంకింగ్ మరియు చార్టర్డ్ అకౌంటెన్సీ విధానాలలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నారా? అని ప్రశ్నించింది.

రాష్ట్రంలో సీబీఐ కేసుల జాబితా , నియామక విధానం పూర్తి డేటా ఇవ్వండి
సిబిఐలో నియామక విధానాలను కూడా తెలుసుకోవాలని కోర్టు కోరింది. ఇప్పటివరకు సిబిఐ చేత ఎన్ని కేసులు దర్యాప్తు చేయబడ్డాయి , గత 20 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఎన్ని కేసులను సిబిఐ దర్యాప్తు చేసింది . అలాగే శిక్షా రేటు కూడా తమకు తెలియజేయాలని మద్రాస్ హైకోర్టు అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐని ఆదేశించింది.
ఇటీవల అనేక కేసులను ఏజెన్సీకి అప్పగిస్తున్నా సిబిఐకి కావాల్సిన వనరులను ఎందుకు పెంచడం లేదని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది.