వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్: పాఠశాలల్లో కుల, మత ప్రస్తావన లేకుండా చేయొచ్చా? విద్యా శాఖ నిర్ణయం ఆచరణ సాధ్యమేనా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పాఠశాల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లోని హాజరు రిజిస్టర్లలో విద్యార్థుల కులం, మతం కాలమ్‌లు ఉండకూడదని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిర్ణయం ద్వారా సామాజిక మార్పుకు అడుగులు పడినట్లవుతుందని, కుల వివక్ష తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్న వేళ, ఇలాంటి ప్రయత్నాలతో ఏమేరకు ఫలితాలు ఉంటాయని ప్రతిపక్షం విమర్శిస్తోంది.

చిన్నతనం నుంచి పిల్లల మనసుల్లో కుల,మతాల ముద్రలు పడకుండా ఈ ప్రయత్నం కొంతమేరకు ఉపయోగపడవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఈ నిర్ణయంతో రిజర్వేషన్ల అమలుకి ఆటంకం రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఏముంది?

అక్టోబర్ 12న పాఠశాల విద్యాశాఖ ఆర్సీ నెం, 151/A&I/2020 తో విడుదల చేసిన ఆదేశాల్లో పాఠశాలల్లో విద్యార్థుల హాజరు రిజిస్టర్ల నిర్వహణ ఏకీకృతం చేసేందుకు తగ్గట్టుగా చేస్తున్న మార్పులను సూచించారు.

పాఠశాలల్లో విద్యార్థుల హాజరు వివరాలను నమోదు చేసే రిజిస్టర్లలో కులం, మతం ప్రస్తావన నిలిపివేయాలి. బాలికల పేర్లు ఎర్ర రంగు సిరాతో రాసే పద్ధతికి కూడా స్వస్తి పలకాలి. అందరి పేర్లు ఒకే రీతిలో రాయాల్సి ఉంటుంది.

కొత్తగా వచ్చిన మార్పు

ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర యాజమాన్యాల నిర్వహణలో ఉన్న పాఠశాలల్లో చేర్చినప్పుడు విద్యార్థి వివరాలన్నీ ఇవ్వాలి. కులం, మతం వివరాలు కూడా ఈ జాబితాలో ఉంటాయి. వాటిని అడ్మిషన్ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.

ఇన్నాళ్లూ హాజరు రిజిస్టర్లలో కూడా ఈ వివరాలు పేర్కొనేవారు. అయితే, ఇకపై విద్యార్థి పేరు పక్కనే కులం, మతం వివరాలు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇదివరకు హాజరు రిజిస్టర్ చూసినప్పుడల్లా సదరు విద్యార్థికి సంబంధించిన సామాజిక వివరాలు కనిపించేవి.

ఇకపై విద్యార్థుల అడ్మిషన్ రిజిస్టర్‌లో మాత్రమే కులం, మతం వివరాలను పొందుపరుస్తారు. మిగిలిన చోట్ల వాటిని ప్రస్తావించాల్సిన అవసరం లేకుండా ఈ ఉత్తర్వులు తోడ్పడతాయి. దాని వల్ల విద్యార్థుల వివరాలు అందరికీ తెలియడానికి అవకాశం ఉండదని అధికారులు అంటున్నారు.

బాలికల పేర్లను కూడా ప్రస్తుతం ఎర్రసిరాతో రాయడం ఆనవాయితీగా వస్తోంది. సహజంగా హాజరు రిజిస్టర్లలో తొలుత విద్యార్థినుల పేర్లు రాస్తున్నప్పటికీ వాటిని ఎక్కువగా ఎర్రసిరాతో రాసే అలవాటు సాగుతోంది. ఇలా బాలికల పేర్లను ప్రత్యేకంగా రాయడం కూడా ఆపేయాలని తాజా ఉత్తర్వులు సూచించాయి. అందరి పేర్లూ సమానంగా వరుస క్రమంలో రాస్తారు. ఈ పద్ధతితో అందరినీ సమాన దృష్టితో చూసినట్లవుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

పాఠశాల బాలిక

ఆచరణలో సమస్యలేంటీ..

ప్రభుత్వం చెబుతున్న ప్రకారం కుల, మతాల ప్రస్తావన వద్దని చెప్పడాన్ని ఆహ్వానిస్తూనే ఉపాధ్యాయులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆచరణలో ఈ ప్రయత్నం వల్ల అదనపు భారం అని కూడా చెబుతున్నారు.

దీనిపై సీహెచ్ శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడితో బీబీసీ మాట్లాడింది.

''విద్యార్థుల వివరాలను కులాల వారీగా ప్రతి నెలా అందించాల్సి ఉంటుంది. నెలలో కొత్తగా చేరిన వారు, పాఠశాల నుంచి వెళ్లిపోయిన వారి వివరాలను కులాల వారీగా ఎంఈవోలకు అందిస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకం అయితే రోజువారీగా వివరాలు ఇవ్వాలి. ఇప్పుడు హాజరు రిజిస్టర్లలో అలాంటి ప్రస్తావన వద్దంటే ఆ వివరాల సేకరణ కోసం ప్రతి సారీ అడ్మిషన్ రిజిస్టర్ చూడటం సాధ్యమేనా? ప్రభుత్వం తొలుత అలాంటి రికార్డులు అందించాల్సిన అవసరం రాకుండా చూడాలి. బాలికల వివరాలు కూడా అవసరం లేకుండా ఆదేశాలివ్వాలి. అప్పుడే క్షేత్రస్థాయిలో సమస్య రాదు. స్కాలర్‌షిప్‌లు, జాతీయ ప్రతిభావంతుల ఎంపిక పరీక్షలు వంటి సమయాల్లో కులాల ప్రస్తావన తీసుకురావాల్సి ఉంటుంది. తరగతి గదుల్లో కులాల ప్రస్తావన రాకుండా చూసేందుకు తగ్గట్టుగా ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాలి. లేదంటే ఇవన్నీ కేవలం ప్రచారానికే పరిమితం అవుతాయి'' అని ఆయన అన్నారు.

దేశంలోనే తొలిసారి అంటున్న పాలకపక్షం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కుల, మత భేదాలు లేని సమాజానికి దోహదపడుతుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

''కులమత భేదాలు లేని సమాజం కోసం తొలి అడుగు వేసిన ముఖ్యమంత్రి జగన్ గారి దూరదృష్టికి సలాం. పాఠశాల హాజరు రిజిస్టర్లలో విద్యార్థుల కులం, మతం ప్రస్తావించకూడదని ఆదేశాలు జారీ చేసిన మొట్టమొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఎందరో మహాత్ములు కలలు కన్న కుల, మత రహిత సమాజానికి ఇది నాంది'' అని ట్విటర్‌లో ఆయన వ్యాఖ్యానించారు.

సామాజిక మార్పు కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.

''అనేక మార్పులు తీసుకువస్తున్నాం. ఇంగ్లీష్ విద్యాబోధన ద్వారా పేదలకు ప్రధానంగా ఎస్సీ, బీసీలకు ఎంతో మేలు జరగబోతోంది. నాడు-నేడు పథకం ద్వారా బడులను మెరుగ్గా తీర్చిదిద్దుతున్నాం. హాజరు రిజిస్టర్లలో కుల, మత అంశాలు ప్రస్తావించడం ద్వారా పిల్లల మనసుల్లో వివక్ష నాటుకోకుండా చేస్తున్నాం. దీన్ని అందరూ ఆహ్వానించాలి'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

'కొత్తదనం లేదు’

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగినప్పటికీ ముఖ్యమంత్రి జగన్ స్పందించలేదని, అధికార పక్షానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి కే ఎస్ జవహార్ అన్నారు.

''నేను ఉపాధ్యాయుడిగా పనిచేశాను. హాజరు రిజిస్టర్‌లో విద్యార్థుల కుల, మత ప్రస్తావన అవసరం లేదని గతంలోనే ఆదేశాలున్నాయి. ఇప్పుడేమీ కొత్తగా చేయడం లేదు. ఓవైపు రాష్ట్రంలో దళితులకు ఏకంగా శిరోముండనం చేస్తున్నా, సీఎం స్పందించడం లేదు. హథ్‌రస్ తరహా ఘటనలు విజయవాడ నగరం నడిబొడ్డున జరుగుతున్నాయి. దళితులకు, మహిళలకు రక్షణ లేని విధంగా పాలన ఉంది. కానీ ఇప్పుడు బాలికలు, దళితులను ఉద్ధరిస్తున్నామని ప్రభుత్వం చెప్పుకోవడం వింతగా ఉంది'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

పాఠశాల

'కుల, మతాలు ప్రస్తావించకుండా వెసులుబాటు ఇవ్వాలి'

పాఠశాల స్థాయిలో విద్యార్థుల రికార్డుల్లో కులం, మతం వివరాలు ఇవ్వడం ఇష్టం లేనివారు వెల్లడించకుండా ఉండే వెసులుబాటు ఉండాలని దళిత్ శోషన్ ముక్తి మంచ్ జాతీయ కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరుతున్నారు.

''ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపుతోంది. బాల్యం నుంచే వివక్షకు తావు లేని వాతావరణం సృష్టించాలి. సాటి విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా అందరినీ సమానంగా చూసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. హాజరు రిజిస్టర్‌తోపాటుగా ఎక్కడా కులం, మతం ప్రస్తావించడం ఇష్టం లేని వారికి, అలా ప్రస్తావించకుండా ఉండే వెసులుబాటు ఇవ్వాలి. ప్రస్తుతం కొన్ని చోట్ల అడ్మిషన్ సమయంలో అది తప్పనిసరి అంటున్నారు. టీసీల కోసం వెళ్లినప్పుడు కూడా వాటిని ప్రస్తావించాల్సి వస్తోంది. అలాంటి అవసరం రాకుండా చూడాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి'' అని ఆయన బీబీసీతో అన్నారు.

'తొలి అడుగులే'

ప్రభుత్వం చేస్తున్న ఈ మార్పులు తొలి అడుగులేనని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు బీబీసీతో అన్నారు.

''ఈ నిర్ణయం వెనుక రాజకీయాలు లేవు. చిన్న చిన్న మార్పులు తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగానే కుల, లింగ సమానత్వం కోసం చేస్తున్న చిరు ప్రయత్నం ఇది. దీనిని అందరూ ఆహ్వానించాలి. ఇంకా చాలా మార్పులు అవసరం అవుతాయి. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాము. పాఠశాలల రికార్డుల నిర్వహణ విషయంలో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉంది'' అని ఆయన చెప్పారు.

'ప్రయత్నాన్ని ఆహ్వానించాలి'

కులం, మతాలతో పాటుగా లింగ వివక్షకు అడ్డుకట్టవేసేలా ప్రభుత్వ ప్రయత్నం ఉందని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ విద్యార్థి తల్లి ఎం.శకుంతల బీబీసీతో తన అభిప్రాయం పంచుకున్నారు.

''చిన్నతనం నుంచే పిల్లల్లో కులాలు, మతాల గురించి ప్రస్తావన రాకుండా చూడాలి. అది భవిష్యత్ తరాలకు మేలు చేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం అలాంటి ప్రయత్నం ప్రారంభించిది. దీనిని అందరూ ఆహ్వానించాలి. అనేక ప్రయత్నాలు చేస్తేనే సమాజంలోని వివక్షను తొలగించగలం. అందుకు బీజం పడినట్టుగా భావిద్దాం. విమర్శలు, సందేహాలున్నప్పటికీ ఆచరణలో దీన్ని సాధ్యం చేసి చూపిస్తే ప్రభుత్వం ఎంతో మేలుచేసినట్టవుతుంది'' అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
AP schools will not find caste and religion in the applications.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X