వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెనోపాజ్ తరువాత రుతుస్రావం క్యాన్సర్‌కు సంకేతమా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మెనోపాజ్

ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న 55 ఏళ్ల సరళ(పేరు మార్చాం)కు మెనోపాజ్ వచ్చి రుతుక్రమం ఆగిపోయింది.

అయినప్పటికీ గత మూడేళ్లుగా ఆమెకు అడపాదడపా రక్తస్రావం అవుతూనే ఉంది. కూతురి వివాహం నిశ్చయమైంది. పెళ్లి పనులు, ఆస్పత్రి వ్యవహారాలతో అమె తలమునకలుగా ఉన్నారు.

తన సహోద్యోగితో ఈ విషయం పంచుకున్నప్పడు, వెంటనే డాక్టర్‌ను కలవమని సలహా ఇచ్చారు.

డాక్టర్‌ను కలవాలనే అనుకున్నారు కానీ ఇంటి పనులు, ఆస్పత్రి పనులలో మునిగిపోయి ఈ విషయాన్ని పక్కన పెట్టేశారు.

అయితే రాను రాను సమస్య తీవ్రమైంది. అప్పుడు ఇక డాక్టర్‌ను కలవక తప్పలేదు. వైద్య పరీక్షల్లో సరళకు గర్భసంచి లోపల ఎండోమెట్రియల్ క్యాన్సర్ సోకిందని తేలింది. క్యాన్సర్ తీవ్ర స్థాయిలో ఉండడంతో సరళకు వెంటనే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.

మెనోపాజ్

ఆమె మొదట్లోనే అప్రమత్తమై డాక్టర్‌ను కలిసుంటే క్యాన్సర్ వచ్చుండేది కాదు లేదా దాని ఉనికి మొదటి దశలోనే తెలిసి ఉండేది.

సరళ ఒక చదువుకున్న వ్యక్తి. పైగా ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. అయినా సరే నిర్లక్ష్యం చేశారు. చాలామంది మహిళలు సరళలాగే తమ ఆరోగ్యంపట్ల అశ్రద్ధగా ఉంటారు.

వాళ్లల్లో వాళ్లే మాట్లాడుకుని సమస్యలకు పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. ఇలాంటి విషయాల గురించి బహిరంగంగా మాట్లాడడానికి సిగ్గుపడతారు. డాక్టరుకి వివరించాలన్నా మొహమాటపడతారు.

మెనోపాజ్

మెనోపాజ్ తరువాత రక్రస్రావం సాధారణమా?

ఈ విషయం తెలుసుకోవాలంటే అసలు మెనోపాజ్ అంటే ఏమిటి? ఏ వయసులో స్త్రీలకు మెనోపాజ్ వస్తుంది అనే విషయాలు తెలుసుకోవాలి.

స్త్రీ ఆరోగ్య నిపుణులు డా. ఎస్.ఎన్.బసు మాటల్లో.. "స్త్రీ శరీరంలో అండాశయం పనిచేయడం ఆగిపోయినప్పుడు, గర్భాశయం పొర పలుచబడి రుతుక్రమం ఆగిపోతుంది. దాన్నే మెనోపాజ్ అంటార. మెనోపాజ్ దశకు చేరుకున్నారో లేదో పరీక్షించేందుకు ఎఫ్‌హెచ్ఎస్ అనే రక్త పరీక్ష చేస్తారు. దీని స్థాయి 30 కన్నా ఎక్కువ ఉంటే మెనోపాజ్ వచ్చినట్లు అర్థం."

మెనోపాజ్ ఏ వయసులో వస్తుంది?

ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో 49-51 సంవత్సరాల మధ్యలో మెనోపాజ్ వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, భారతీయ మహిళల్లో మాత్రం 47-49 ఏళ్లకే మెనోపాజ్ వస్తోంది. ప్రపంచ మహిళలతో పోలిస్తే భారతీయ మహిళలకు తొందరగా మెనోపాజ్ వస్తున్నట్టు లెక్క.

స్త్రీలందరి శరీర తత్వాలు ఒకేలా ఉండవు. అండాశయం నిర్మాణం, రుతుక్రమం భిన్నంగా ఉంటాయి. అలాగే మెనోపాజ్ చేరే పద్ధతులూ భిన్నంగా ఉంటాయి.

కొందరికి మామూలుగా రుతుక్రమం జరుగుతూ మెనోపాజ్ రాగానే రక్తస్రావం ఆగిపోతుంది. కొంతమందికి మెల్లిమెల్లిగా రక్తస్రావం తగ్గుతూ మెనోపాజ్ చేరుకుంటారు. కొంతమందికి మెనోపాజ్ చేరే ముందు అధిక రక్తస్రావం కావొచ్చు.

ఈ సమయాన్ని పెరిమెనోపాజ్ అంటారు. దీని వ్యవధి కొన్ని నెలల నుంచి మూడునాలుగేళ్ల వరకు ఉండొచ్చు. రుతుక్రమం ఆగిపోయిన 12 నెలల వరకూ రక్తస్రావం జరగకుండా ఉంటే మెనోపాజ్‌కు చేరుకున్నట్టు భావించవచ్చు.

మెనోపాజ్‌కు చేరుకున్నాక రక్తస్రావం అవుతుంటే అది అసాధారణ విషయంగా భావించాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి.

బయోలాజికల్ క్లాక్

క్యాన్సర్ కావొచ్చు

స్త్రీల ఆరోగ్య నిపుణులు డా. భావనా చౌదరి మెనోపాజ్ తరువాత రక్తస్రావం ఎందుకవుతుందో వివరించారు.

"స్త్రీలలో వయసు పెరుగుతున్నకొద్దీ జననాంగాలు పొడిబారడం, గర్భాశయ ద్వారం వద్ద గడ్డలు ఏర్పడడం, గర్భాశయ లోపలి పొర గట్టిపడడం లేదా పలుచన కావడం, కొన్ని రకాల మందులవలన కలిగే సైడ్ ఎఫెక్టులు, అంటురోగాలు సోకడం లాంటివి జరుగుతాయి. వీటి వల్ల రక్తస్రావం కావొచ్చు."

"మెనోపాజ్ తరువాత రక్తస్రావం ఏవైనా చిన్న చిన్న కారణాల వలన కావొచ్చు లేదా ప్రమాదకరమైన వ్యాధికి సంకేతం కావొచ్చు" అని తెలిపారు.

"మెనోపాజ్ తరువాత స్పాటింగ్ లేదా కొంచెంకొంచెం రక్తస్రావం లేదా అధిక రక్తస్రావం… ఏదైనా సరే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఎందుకంటే మెనోపాజ్ తరువాత రక్తస్రావం జరిగితే 10 శాతం క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ క్యాన్సర్ గర్భాశయ ముఖం దగ్గర రావొచ్చు, అండాశయంలో కావొచ్చు లేదా యోని లోపల రావొచ్చు" అని డా. ఎస్ ఎన్ బసు వివరించారు.

డాక్టర్ దగ్గరకు వెళితే రక్త పరీక్షలు, పాప్ స్మియర్, ఎండోమెట్రియల్ బయాప్సీ, సోనోగ్రఫీ, డిఎన్‌సి మొదలైన పరీక్షలన్నీ చేసి రోగ నిర్ధారణ చేస్తారు.

చాలామంది స్త్రీలు 2-3 నెలలు రుతుక్రమం ఆగిపోతే మెనోపాజ్ వచ్చేసిందని భావించి గర్భనిరోధక పద్ధతులు పాటించడం మానేస్తారు. దానివల్ల 40 దాటాక లేదా పెద్ద వయసులో గర్భం దాల్చే ప్రమాదం ఉంది.

ఇలాంటి సమస్యలతో కూడా తన వద్దకు భార్యాభర్తలు వస్తారని, ఆ వయసులో అబార్షన్ చేయాల్సివస్తే చాలా కష్టమని, స్త్రీ ఆరోగ్యం బాగా దెబ్బతింటుందని డాక్టర్లు అంటున్నారు.

అందువల్ల రుతుక్రమం ఆగిపోయినట్లనిపిస్తే ముందు డాక్టర్‌ను కలిసి మెనోపాజ్ వచ్చిందో లేదో పరీక్ష చేయించుకుని అప్పుడు గర్భనిరోధక పద్ధతులు పాటించడం మానేస్తే మంచిదని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Menstruation after Menopause a sign of cancer. మెనోపాజ్ తర్వాత రుతుస్రావం క్యాన్సర్‌కు సంకేతమా
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X