తమిళనాట కొత్త పార్టీ 'జే అన్నాడీఎంకె'!: అధ్యక్షురాలిగా జయ మేనకోడలు!!
చెన్నై: అంతా అనుకున్నట్టుగానే అమ్మ అస్తమయం తర్వాత అన్నాడీఎంకెలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీని తన అదుపులో పెట్టుకోవడంతో పాటు ప్రభుత్వ పగ్గాలు చేపట్టడానికి శశికళ ప్రయత్నిస్తున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో..మరో ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.
పార్టీపై ఆధిపత్యం చలాయించడానికి ప్రయత్నిస్తున్న జయ నెచ్చెలి శశికళ తీరుకు వ్యతిరేకంగా.. మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుందన్న వార్త తమిళనాట సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన ఓ ఆడియో టేపు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్టుగా తెలుస్తోంది.
అమ్మ వీరాభిమాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయవాది కృష్ణమూర్తి నేతృత్వంలో ఈ కొత్త పార్టీ ఆవిర్భావం ఉండబోతుందన్న చర్చ ప్రస్తుతం తమిళనాడులో జోరందుకుంది. కాగా, ఈ కొత్త పార్టీకి
'జే అన్నాడీఎంకే' అన్న పేరును ఖరారు చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి మరో ఆశ్చర్యకర విషయమేంటంటే.. ఈ కొత్త పార్టీకి జయలలిత మేనకోడలు దీపను అధ్యక్షురాలిగా నియమించునున్నారట.

అన్నాడీఎంకెలో శశికళ నియంతృత్వానికి చెక్ పెట్టేందుకు ఈ కొత్త పార్టీ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కొత్త పార్టీకి సంబంధించిన ఆడియో టేపు అక్కడి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిపోగా.. శశికళ మద్దతుదారులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, అన్నాడీఎంకేతో తనకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటన చేయాలని తనను అడ్డుకోవడానికి తీవ్ర ఒత్తిడి తెచ్చారని, శశికళ మద్దతుదారులు తనను చంపుతానని బెదిరించారని కృష్ణమూర్తి వాపోయారు. దీనికి సంబంధించిన ఆడియో కూడా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.