• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్ ఇన్‌సైడ్ టాక్ : హస్తం గూటికి ప్రశాంత్ కిశోర్..?-సీనియర్లతో చర్చించిన రాహుల్-ఏం తేల్చారంటే..?

|

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భవిష్యత్ అడుగులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికల వ్యూహకర్తగా తన ప్రస్థానాన్ని చాలిస్తున్నట్లు రెండు నెలల క్రితం ప్రకటించిన పీకే తదుపరి కార్యాచరణపై అనేకానేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఒక్క తాటి పైకి తీసుకొచ్చి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడమే లక్ష్యంగా ఆయన పనిచేయబోతున్నారా... లేక ప్రత్యక్ష రాజకీయాల్లో దిగేందుకు సిద్ధమవుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పీకే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అవి కేవలం ఊహాగానాలు కాదన్న సంగతి తాజాగా తేలిపోయింది.

పీకేనే సిద్ధపడ్డారా...?

పీకేనే సిద్ధపడ్డారా...?

రెండు వారాల క్రితం ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ,రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలతో సమావేశమైన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్,ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ సమావేశం అంతకుమించిన కీలక అంశాలకు వేదికైనట్లు కూడా వార్తలు వచ్చాయి. ప్రశాంత్ కిశోర్‌ను సోనియా,రాహుల్ గాంధీలు కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే పీకేని కాంగ్రెస్ ఆహ్వానించడం కాదు... ఆయనే కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధపడినట్లు తాజాగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

సీనియర్లతో చర్చించిన రాహుల్...

సీనియర్లతో చర్చించిన రాహుల్...

గత వారం కాంగ్రెస్ సీనియర్ నేతలతో వర్చువల్‌గా సమావేశమైన రాహుల్ గాంధీ... ప్రశాంత్ కిశోర్ అంశాన్ని ఆ సందర్భంగా ప్రస్తావించినట్లు జాతీయ మీడియా ఇండియా టుడే కథనం వెల్లడించింది.ఆ కథనం ప్రకారం... భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కోసం ప్రశాంత్ కిశోర్ ఒక ప్లాన్ రూపొందించారు. అందులో తనకూ ఓ పాత్రను ఏర్పరుచుకున్నారు. ఇదే విషయాన్ని రాహుల్ పార్టీ సీనియర్ నేతలతో చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

చేరికపై సీనియర్ల అభిప్రాయాలు...

చేరికపై సీనియర్ల అభిప్రాయాలు...

ఆ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ప్రశాంత్ కిశోర్‌ను పార్టీలోకి తీసుకొచ్చే అంశంపై చర్చ జరిగినట్లు చెప్పారు.పీకే కాంగ్రెస్ వెలుపల ఉండి పార్టీ కోసం పనిచేయడం కంటే... పార్టీలో చేరితే ఎలా ఉంటుందనే అంశంపై రాహుల్ చర్చించినట్లు చెప్పారు. పీకే చేరిక కాంగ్రెస్‌కు మేలు చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిపారు.అయితే పార్టీలో అతను పోషించబోయే పాత్రను నిర్వచించాలని... దానికి షరతులు కూడా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.గతంలో జేడీయూతో పీకే తెగదెంపుల విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పనికి,పాత్రకు హద్దులు నిర్ణయించాలన్నారు.

ప్రత్యక్ష ఎన్నికల్లో దిగుతారా..?

ప్రత్యక్ష ఎన్నికల్లో దిగుతారా..?

మరో కాంగ్రెస్ సీనియర్ నేత మాట్లాడుతూ... ప్రశాంత్ కిశోర్ పార్టీలోకి తీసుకురావడం వల్ల నష్టమేమీ ఉండదన్నారు. సరికొత్త ఆలోచనలు,వ్యూహాలను తీసుకురావాల్సిన సమయం ఇది అని అభిప్రాయపడ్డారు. పీకే సామర్థ్యం పార్టీకి ఎంతమేర ఉపయోగపడుతుందో చర్చించవచ్చన్నారు. పార్టీ బాగు కోసం మార్పును స్వీకరించేందుకు సిద్దంగా ఉండాలన్నారు.ఇప్పటికైతే పీకే నుంచి గానీ కాంగ్రెస్ వైపు నుంచి దీనిపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మాత్రం ఆయన కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2014లో కేంద్రంలో బీజేపీని... రెండు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్,తమిళనాడులో డీఎంకె పార్టీలను అధికారంలోకి తీసుకురావడంలో పీకే కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్రత్యక్ష ఎన్నికల్లో దిగుతారా... కేవలం సలహాలు,వ్యూహాలకే పరిమితమవుతారా అన్నది వేచి చూడాలి.

English summary
Sources said Rahul Gandhi, who had a virtual meeting with senior Congress leaders last week, mentioned about Prashant Kishore and his joining in congress. Prashant Kishor who draw a road map for Congress with a role for himself
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X