• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హైదరాబాద్‌కు మరో పేరు ఉందా? భాగ్యనగర్, చించలం.. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?

By BBC News తెలుగు
|

హైదరాబాద్‌

హైదరాబాద్ నగర పేరు మార్పుపై బీజేపీ నేతల ప్రకటనల నేపథ్యంలో భాగ్యనగరం అనే పేరు అసలు నిజంగా ఉందా లేదా అన్న ప్రశ్న వస్తోంది. భాగమతి అనే మహిళ అసలు ఉందా లేదా? అన్న చర్చ కూడా విస్తృతంగా జరుగుతోంది. దీనిపై ఎందరో చరిత్రకారులు ఎన్నో అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ని అనేక చరిత్ర పుస్తకాల్లో బాగ్‌నగర్‌గా పిలిచింది వాస్తవమే. హైదరాబాద్‌గా పిలించింది కూడా వాస్తవమే. 1816లో Aaron Arrowsmith అనే ఇంగ్లీషు వ్యక్తి తయారు చేసిన మ్యాప్‌లో హైదరాబాద్ అనే పదాన్ని కాపిటల్ లెటర్స్‌లో ఇచ్చి, కింద బాగ్‌నగర్ ఆర్ (Bagnagar R) అని రాశారు. దాని పక్కనే గోల్కొండ అని కూడా రాశారు. అంటే తన మ్యాపులో మొత్తం గోల్కొండ, హైదరాబాద్, బాగ్‌నగర్ మూడు పేర్లు రాశారు. ఈ మ్యాపు కాపీని ''గోల్కొండ, బాగ్‌నగర్, హైదరాబాద్’’ పేరుతో నానిశెట్టి సెరిష్ రాసిన పుస్తకంలో పొందుపర్చారు. కానీ సమస్య అంతా ఆ పేరు ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అని దాని చుట్టూ తిరుగుతోంది.

వాదన – 1: భాగ్యలక్ష్మి గుడి పేరుతో భాగ్యనగరం వచ్చింది

ఈ వాదనను దాదాపు అందరు చరిత్రకారులూ తిరస్కరించారు. అసలు చార్మినార్ దగ్గర మొదట్లో భాగ్యలక్ష్మి దేవాలయం లేనే లేదని వారి అభిప్రాయం. ''చార్మినార్ దగ్గర అమ్మవారి గుడి వచ్చి బహుశా 30-40 ఏళ్లు అవుతుంది. అంతకుముందు అసలు అక్కడ గుడే లేదు’’ అని బీబీసీతో చెప్పారు పేరు చెప్పడానికి ఇష్టపడని భారత పురాతత్త్వ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి.

ఈ వాదనను బలపరిచడానికి మరో ఆధారం ఆనాటి ఫోటోలు. ఆ ఫోటోల్లో ఎక్కడా చార్మినార్ పక్కన గుడి ఉన్న ఆనవాళ్లు లేవు. 1944లో ప్రచురించిన హైదరాబాద్ ఎ సావనీర్ అనే పుస్తకంలోని చార్మినార్ ఫోటోలో కూడా ఆ గుడి లేదు. అలాగని అందులో అసలు హిందూ దేవాలయాలే లేవని కాదు.

అప్పటి హైదరాబాద్ రాజ్యంలోని పలు హిందూ దేవాలయాలను కూడా ఆ పుస్తకం ప్రస్తావించింది. కానీ చార్మినార్ దగ్గర ఫోటోల్లో ఆ మాత్రం ఆ గుడి కనపడలేదు. ఈ పుస్తకాన్ని మొదట 1922లో అప్పటి వేల్స్ యువరాజు హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆయనకు హైదరాబాద్ చరిత్ర చెప్పడం కోసం ప్రచురించగా, ఈ కింది చార్మినార్ ఫోటో ఆ పుస్తకం 1944 ముద్రణలోనిది.

హైదరాబాద్‌

వాదన – 2: హైదరాబాద్‌లో తోటలు ఎక్కువ కాబ్టటి కాబట్టి బాగ్‌నగర్ అయింది

బాగ్ అంటే తోట అని ఉర్దూలో అర్థం. నగరం అంటే సంస్కృతంలో సిటీ అనే అర్థం వస్తుంది. ఈ నగరంలో తోటల వల్ల బాగ్‌నగర్ అని పిలిచే వారు తప్ప, వాస్తవంగా బాగ్ నగర్ అధికారికంగా ఎప్పుడూ లేదు అనే వాదన ఇది. ఈ వాదనను బలపరిచింది హరూన్ ఖాన్ షేర్వాణి అనే చరిత్రకారుడు. ఆయన 1967లో దీన్ని ప్రతిపాదించారు.

ఈ వాదనను అర్థం చేసుకోవాలంటే ఫ్రెంచ్ యాత్రికుడు బాప్టిస్ట్ టావెర్నియర్ రాసిన పుస్తకంలోని వాక్యాలు చూడాలి. ఆయన గోల్కొండకు మరోపేరు బాగ్‌నగర్ అని రాశారు. కులీ కుతుబ్ షా తన భార్యల్లో ఒకరి కోరిక మేరకు ఈ నగరం నిర్మించారు అని కూడా రాశారు. కానీ ఆ భార్య పేరు 'నగర్’ అని పొరబాటున రాశారు టావెర్నియర్.

ఆయనెలా అర్థం చేసుకున్నారంటే... బాగ్ అంటే తోట. నగర్ అంటే.. ఆ మహిళ పేరు. కాబట్టి ఈ బాగ్‌నగర్‌కి అర్థం 'నగర్ యొక్క తోట’ (నగర్ అనే మహిళకు చెందిన తోట) అనేలా రాశారు. పొరబాటున ఇలా రాశారని ఆ పుస్తకాన్ని ఫ్రెంచ్ నుంచి ఇంగ్లీషులోకి అనువదించిన వి బాల్ కూడా ధ్రువీకరించారు.

టావెర్నియర్ రాసిన ఈ వ్యాఖ్యల ఆధారంగా ఇది తోటల నగరం కాబట్టి దీనికి బాగ్‌నగర్ అనే పేరు వచ్చింది అనేది హరూన్ ఖాన్ వాదన.

కానీ హరూన్ ఖాన్ వాదనను మరో చరిత్రకారుడు నరేంద్ర లూథర్ తప్పు పట్టారు. దానికి ఆయన అనేక రిఫరెన్సులు ఇచ్చారు.

హైదరాబాద్‌

వాదన – 3: బాగ్‌నగర్ అనే పదం తోటల వల్ల కాదు, భాగమతి పేరిట వచ్చింది

ఎక్కువ మంది చరిత్రకారులు దీన్ని అంగీకరిస్తున్నారు. ఈ వాదనను బలపరుస్తూ 1996లో సాలార్జంగ్ మ్యూజియం ప్రచురించిన ద్వివార్షిక పరిశోధన పత్రాల్లో ఒక వ్యాసం ఉంది. 1992-93 లో ''ఆన్ ది హిస్టరీ ఆఫ్ భాగమతి’’ పేరుతో ఈ వ్యాసాన్ని నరేంద్ర లూథర్ ప్రతిపాదించారు. షేర్వాణి వాదనను ఖండిస్తూ నరేంద్ర లూథర్ ఈ ప్రతిపాదన తెచ్చారు.

''సుల్తాన్ కు భాగమతి అనే వేశ్య అంటే చాలా ఇష్టం. అతను కొత్తగా నిర్మించిన నగరానికి భాగ్‌నగర్ అని పేరు పెట్టి, తరువాత బాధపడి, దాన్ని హైదరాబాద్ (Haidarabad) అని మార్చాడు.’’ అని మహ్మద్ కాసిం ఫెరిస్తా అనే చరిత్రకారుడు రాసిన హిస్టరీ ఆఫ్ ద రైస్ ఆఫ్ మహమ్మదియన్ పవర్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో రాశారు. ''సుల్తాన్ ఒక నగరాన్ని కట్టి దానికి పాతకాలం ముసలి మంత్రగత్తె పేరు పెట్టాడు’’ అంటూ వాఖాయత్ ఎ షేక్ ఫైజీలో రాశారు.

1687 నాటి ''ది ట్రావెల్స్ ఇన్ టూ ద లెవాంట్’’ పుస్తకంలో జీన్ డి థెవనెంట్ కూడా ఈ వాదన బలపర్చాడు. ''ఈ సుల్తాన్ సామ్రాజ్యపు రాజధాని భాగ్‌నగర్. పర్షియన్లు దీన్ని హైదరాబాద్ అంటారు.’’

ఒక డచ్ అధికారి రాసిన అభిప్రాయం ఇది. ''ఏప్రిల్ నెలలో ప్రతీ ఏటా, రాజ్యంలోని వేశ్యలందరూ భాగ్‌నగర్ వెళ్తారు. అక్కడ చనిపోయిన ముస్లిం రాజు గౌరవార్థం నృత్యం చేస్తారు. ఇది నాకు చాలా వింతగా తోచింది.’’ అని డబ్ల్యు ఎం మోర్లాండ్ ఎడిట్ చేసిన ''రిలేషన్స్ ఆఫ్ గోల్కొండ ఇన్ ద ఎర్లీ సెవంటీంత్ సెంచరీ’’లో రాశారు. ఈ పుస్తకం కింద ఫుట్‌నోట్స్ లో భాగ్‌నగర్ అంటే హైదరాబాద్. గోల్కొండ కొత్త రాజధాని అని రాశారు.

ఒకవేళ తోట అనే పదం నిజమైతే అప్పుడు అది బాగ్ అని కాకుండా బాఘ్ అని ఉండాలని వాదిస్తారు నరేంద్ర లూథర్. 16వ శతాబ్దానికి చెందిన రాయవాచకము అనే పుస్తకంలో బాబాజీ పంతులు అనే ఆయన భాగ్యనగరము రాయబరి అని ఉన్నట్టుగా నరేంద్ర ప్రస్తావించారు. ఆ పుస్తకం కాపీ ప్రస్తుత తమిళనాడులో పద్దుకోటై గ్రంథాలయంలో ఉన్నట్టు చెబుతున్నారు.

అన్నిటికంటే బలంగా 1627 నాటి ఒక అధికారి పత్రంలో ఉన్న ఒక సంతకంలో జహీరుద్దీన్, భాగ్‌నగర్ ఖాజీ అనే పేరు వాడినట్టు నరేంద్ర చెబుతారు.

హైదరాబాద్‌

అది సరే, అసలు భాగమతి ఉందా? ఉంటే ఎవరు?

భాగమతి విషయంలో చరిత్ర – కల్పిత గాథలు రెండూ కలగలసి ఉన్నాయి. ఆమె ఒకప్పుడు జీవించిన మహిళే అనడానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయో, ఆమె లేదు అనడానికి కూడా అన్నే ఆధారాలు ఉన్నాయి.

భాగమతి గురించి ఎక్కువ ప్రచారంలో ఉండే కథ ఇది: 1565-1611 మధ్య జీవించిన మహమ్మద్ కులీ అనే ఐదవ కుతుబ్ షాహీ రాజు, భాగమతి అనే హిందూ అమ్మాయిని ప్రేమించాడు. ప్రస్తుతం చార్మినార్ ఉన్న ప్రాంతంలో చించలం అనే గ్రామంలో ఆ అమ్మాయి ఉండేది. ఆమెను చూడ్డానికి రోజూ గోల్కొండ నుంచి నది దాటి అక్కడకు వెళ్లేవాడు యువరాజు. కొడుకు బాధ చూడలేక ఆ నదికి వంతెన కట్టించాడు ఆ యువరాజు తండ్రి ఇబ్రహీం. అది 1578లో కట్టారు. 1580లో కులీ భాగమతిని పెళ్లి చేసుకున్నాడు. తరువాత ఆమె పేరు భాగమతి నుంచి హైదర్ మహల్ అని మారింది.

కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ వంతెన కట్టింది కులీ 13 ఏళ్ల వయసులో. అంటే కులీ ప్రేమ కోసం వంతెన కట్టాడు అనేది అవాస్తవం. ఆ వంతెన కట్టడానికీ, భాగమతి ప్రేమకూ సంబంధం లేదు. రెండూ వేర్వేరు అంశాలు. గోల్కొండ కోట ప్రాంతాన్ని ఇబ్రహీంపట్నంతో కలపడానికి కట్టిన వంతెననే, కులీ ప్రేమ కథలో ప్రేమ కోసం కట్టిన వంతెనగా మార్చేశారు అంటారు చరిత్రకారులు.

ఈ ప్రేమ కథలో ఎన్నో అంతులేని ప్రశ్నలు ఉన్నాయి. భాగమతి నర్తకినా, సాధారణ మహిళా, వేశ్యా, దేవదాసీయా.. ఆమెను కులీ పెళ్లి చేసుకున్నారా? పెళ్లి కాకుండా సహజీవనమా? అసలు అటువంటి మహిళే లేకపోయినా, ఆయన ఊహల్లో పుట్టినా వ్యక్తా? ఉంటే ఆమె మతం మారిందా? హైదర్ మహల్ అనేది ఆమె మతం మారడం వల్ల వచ్చిన పేరా? లేక ఆమెను కులీ ముద్దుగా హైదర్ మహల్ అని పిలిచేవాడా? ఆమె చనిపోయాక మిగతా వారికి కట్టినట్టు భారీ సమాధి ఎందుకు కట్టలేదు? (తారామతికి సమాధి కట్టారు).

ఇలా ఎన్నో స్పష్టమైన సమాధానం లేని ప్రశ్నలు భాగమతి అనే పాత్ర చుట్టూ ఉన్నాయి. కులీ ఆస్థానంలోని ముల్లా వజీ అనే కవి రాసిన కుతుబ్ ముస్తరీ అనే గ్రంథంలో ఈ భాగమతి ప్రేమకథ రాశారు. ''యువరాజకు కల వచ్చింది. కలలో భాగమతి కనిపించింది. నిద్రలేచి ఆమెను వెతుక్కుంటూ వెళ్లగానే భాగమతి కనిపించింది.’’ అంటూ ఆయన కావ్యం సాగుతుంది. కానీ అది చరిత్ర కాదు కావ్యం.

కులీ రాసిన కవిత్వంలో పరోక్షంగా భాగమతి ప్రస్తావన ఉంటుందని ప్రొఫెసర్ మసూద్ హుస్సేన్ ఖాన్ చెప్పినట్టుగా నరేంద్ర లూథర్ రాశారు.

ఈ భాగమతి పేరునే, ఈ భాగమతి కోరిక మేరకే లేదా హైదరాబాద్ నగరాన్ని కట్టి, ఆమె పేరు పెట్టారనేది ఒక వాదన.

హైదరాబాద్‌

కొత్త నగరం ఎందుకు?

అప్పటికి గోల్కొండ కోట పరిసరాల్లోని నగరం ఇరుగ్గా, మురికిగా తయారవడంతో, కొత్త నగరం నిర్మించాలన్న ప్రతిపాదన ఉండేది. ఇబ్రహీం (కులీ తండ్రి), కోటకు పశ్చిమంగా 30 కిమీ దూరంలో కట్టించిన పట్టణమే ఇబ్రహీం పట్నం (ఇప్పటికీ అదే పేరుతో ఉంది). కానీ మరో కొత్త నగరం అవసరం అలానే ఉండిపోయింది.

తరువాత కులీ అధికారంలోకి వచ్చాక కొత్త నగర నిర్మాణం మొదలు పెట్టారు. తన ప్రధాని మీర్ మొమిన్‌కి ఆ బాధ్యత అప్పగించారు. ఆ మీర్ మొమిన్ తాను పెరిగి ఇరాన్ లోని ఇస్ఫాన్ నగరం తరహాలో ఇక్కడా ఓ నగరాన్ని కట్టాలని భావించి, ఇరాన్ నుంచి నిపుణులను రప్పించి నగర నిర్మాణం ప్రారంభించారు.

1591లో హైదరాబాద్ నగరం ప్రారంభం అయింది. దానికి 1596లో ఫర్కుందా బన్యాడ్ (Farkhunda Bunyad – పర్షియన్ భాషలో అదృష్ట నగరం లేదా భాగ్య నగరం అనే భావన వస్తుంది) అనే పేరు కూడా పెట్టారు.

సంస్కృతంలో భాగ్య అనే పదానికి పర్షియన్ భాషలోని ఫర్కుందా బన్యాడ్ అనే పదం సమానార్థకంగా ఉన్న రిత్యా, ఆ పర్షియన్ పదం సంస్కృత-తెలుగు అనువాదమే భాగ్య నగరం అయ్యుండొచ్చనీ, హిందూ వ్యాపారులకు ఆ పదం సులభంగా అలవాటు అయ్యుండొచ్చనే వాదనా ఉంది.

చార్మినార్

మధ్యలో చించలం ఏంటి?

ప్రస్తుతం చార్మినార్ ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు చించలం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూనే కొత్త మహా నగరాన్ని నిర్మించారు. అదే ఇప్పటి కొత్త సిటీ. ఇప్పటి హైదరాబాద్ పాత బస్తీ.

అయితే బాగ్‌నగర్ అనే పేరు అతి తక్కువ కాలం మాత్రమే వాడుకలో ఉన్నట్టు చరిత్రకారులు అంగీకరిస్తున్నారు. ఎందుకంటే 1603లో అంటే కొత్త నగరం నిర్మించిన 12 ఏళ్లలోపే విడుదలైన నాణేల్లో హైదరాబాద్ అనే పదాన్ని స్పష్టంగా రాశారు. అంటే అప్పటికి హైదరాబాద్ అనే పేరు కూడా వచ్చేసింది. కాబట్టి ఈ బాగ్‌నగర్ అనే పేరు అధికారికంగా అతి తక్కువ కాలం మాత్రమే చెలామణీలో ఉంది అనేది అనేది స్పష్టం.

హైదరాబాద్

దీనిపై ఉన్న వాదనలు

  • కుతుబ్ షాహీలు షియా ముస్లింలు. మహమ్మద్ ప్రవక్త అల్లుడు అలీకి మరో పేరు హైదర్. ఆయన పేరిట ఈ నగరం హైదరాబాద్ అయింది. ఎక్కువ మంది చరిత్రకారులు హైదరాబాద్‌కి ఆ పేరు పెట్టడానికి ఇదే కారణంగా చెబుతారు. (ముస్లింలోని సున్నీ – షియా అనే రెండు శాఖలు ఉన్నాయి.)
  • భాగమతి ఇస్లాంలోకి తన పేరును హైదర్ మహల్‌గా మార్చుకుంది కాబట్టి అది హైదరాబాద్ అయింది.
  • భాగమతి ఒక వేశ్య కాబట్టి, వేశ్య పేరు నగరానికి పెట్టినందుకు సిగ్గుపడి కులీయే ఈ నగరానికి హైదరాబాద్ అనే పేరు పెట్టారు.
  • ఈ నగరాన్ని హిందువులు భాగమతి అని, ముస్లింలు హైదరాబాద్ అనీ పిలిచేవారు.
  • భాగమతి అనే హిందూ మహిళ పేరు ఉండడం ఇష్టం లేక హైదరాబాద్ అనే పేరు పెట్టారు.
  • పేరు మార్పుకు సున్నీ – షియాల మధ్య విబేధాలు కూడా కారణం కావచ్చు.

చార్మినార్

ఇలా ఎన్నో వాదనలు ఉన్నాయి. దేనికీ స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. కానీ హైదరాబాద్ పేరుగా బాగ్‌నగర్ మాత్రం గరిష్టంగా 15-20 ఏళ్లకు మించి లేదు అన్నది స్పష్టం.

''గోల్కొండ నాలుగు దర్వాజాల్లో ప్రస్తుతం ఫతే దర్వాజాగా పిలుస్తోన్న దాన్ని బాగ్‌నగర్ దర్వాజా అనేవారు. 1692 లో డేనియల్ హవర్ట్ అనే డచ్ యాత్రికులు ఈ విషయాన్ని రాశారు’’ అన్నారు నానిశెట్టి సెరీష్.

''ఈ నగరం పేరు గోల్కొండ, బాగ్‌నగర్ మీదుగా హైదరాబాద్‌గా పరిణామం చెందింది. ఇదొక ఎవెల్యూషన్ ప్రొసెస్. కొంత కాలం ఆ పేరు ఉన్నంత మాత్రాన ఇప్పుడు మళ్లీ పేరు మార్చాలనడం మూర్ఖత్వం. ఉదాహరణకు దిల్లీ అసలు పేరు షాజహానాబాద్. కానీ ఇప్పుడు దిల్లీ అంటాం. షాజహానాబాద్ అని ఎవరూ పిలవరు. బాగ్‌నగర్ పేరు చాలా తక్కువ కాలం ఉంది. కనీసం ఇరవై ఏళ్లు కూడా లేదు. దీన్ని జనం హైదరాబాద్ అని పిలిచారు’’ అన్నారు సెరీష్.

''ఇక భాగమతి ఉందా లేదా అన్న ప్రశ్నకు సమాధానంగా నేను నా పుస్తకంలో చాలా రిఫరెన్సులు ఇచ్చాను. చదివిన వారే తేల్చుకోవాలి ఆమె ఉందో లేదో.’’ అన్నారు సెరీష్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Do Hyderabad has too many names
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X