వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పర్శ సెక్స్‌కి ఆరంభ సంకేతమా? బహిరంగంగా ప్రేమను వ్యక్తపరచడాన్ని తప్పుగా ఎందుకు చూస్తారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

సుమారు పది నెలల తర్వాత దిల్లీ ఆఫీసులో అడుగు పెట్టగానే నా అధికారి దగ్గరగా వచ్చి కౌగలించుకున్నారు. ఆమె ఒక మహిళ. మరో సహోద్యోగి కూడా "ఓహ్ చాలా రోజుల తర్వాత చూస్తున్నాను" అంటూ ఒక ప్రేమ పూరిత కౌగలింతతో స్వాగతం పలికారు.

స్నేహితులను, సహోద్యోగులను, ఆప్తులను కలిసినప్పుడు కౌగిలింతతో పరస్పరం అభినందించుకోవడం నగరాలలో చాలా సర్వ సాధారణమైన విషయమే.

దిల్లీ, ముంబయి లాంటి నగరాలలో ఇలాంటి దృశ్యాలు పార్కులు, షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్‌లు సహా అనేక బహిరంగ ప్రదేశాల్లో కూడా కనిపిస్తాయి.

కానీ, భారతీయ సమాజంతో పాటు సంప్రదాయ కట్టుబాట్లు పాటించే చాలా సమాజాలలో బహిరంగంగా ఇద్దరు వ్యక్తులు ప్రేమను ప్రదర్శించడాన్ని చాలా వరకు తప్పుగానే పరిగణిస్తారు. అది స్త్రీ , పురుషుల మధ్యయితే ఆ విషయాన్ని మరింత నిశితంగా విశ్లేషిస్తారు.

ఒక మహిళ ఆమె భర్త ఆఫీసు జూమ్ కాల్ లో ఉండగా పక్క నుంచి వచ్చి ప్రేమతో ఆయనను ముద్దు పెట్టుకోవాలని చూసిన వీడియో సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయింది.

ఆ వీడియోలో భర్త ఒక ఆఫీసు మీటింగులో మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో భార్య భర్త దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకోవాలని చూస్తారు. అంతలో ఆ భర్త "ఏమి చేస్తున్నావు నువ్వు? వీడియో ఆన్‌లో ఉంది అంటూ ఆమెపై విసుక్కోవడం కనిపిస్తుంది. ఈ వీడియోను మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర కూడా ట్వీట్ చేశారు.

https://twitter.com/anandmahindra/status/1362775293681885184

"హ హ. ఈమెను నేను ఈ ఏడాదికి ఉత్తమ భార్యగా నామినేట్ చేస్తున్నాను. నేను వీరిని ఉత్తమ జంటగా నామినేట్ చేసేవాడినే కానీ, ఆయన ఆమెపై విసుక్కుని ఈ అవకాశాన్ని కోల్పోయారు" అని అంటూ రీట్వీట్ చేశారు.

సంప్రదాయ కట్టుబాట్లు పాటించే చాలా సమాజాలలో ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా ప్రేమను ప్రదర్శించుకోవడం ఇంకా తప్పుగానే చూస్తున్నారు. ప్రేమను వ్యక్తపరచడం పూర్తిగా వ్యక్తిగత విషయం అని కొంత మంది అంటుండగా, ఇదంతా మహిళలను, వారి స్వేచ్ఛను, భావాలను నియంత్రణలో ఉంచేందుకు కొన్ని తరాలుగా సమాజం చేసే ప్రయత్నం అని సామాజికవేత్తలు అంటున్నారు.

బహిరంగంగా ప్రేమను ప్రదర్శించడం కానీ, భావాలను వ్యక్తపరిచే విషయంలో వివిధ వయసులకు చెందిన మహిళలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు 'బీబీసీ న్యూస్ తెలుగు’ కొంత మందితో మాట్లాడింది.

24 సంవత్సరాల ప్రియాంక రావు పబ్లిక్ పాలసీ అండ్ మీడియా స్టడీస్‌లో ఫెలోషిప్ చేస్తున్నారు. ఆమె ఒక స్నేహితునితో సన్నిహితంగా మెలుగుతుండేవారు. అయితే, తామిద్దరూ ఎప్పుడూ బహిరంగంగా ప్రేమను ప్రదర్శించుకోలేదని అయినప్పటికీ సమాజం మాత్రం వారి గురించి తమ తీర్పులను ఇచ్చేసిందని ఆమె చెప్పారు.

"మేమిద్దరం కలిసి బతుకుతామో లేదో నిర్ణయించుకోక ముందే సమాజం మా గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. పక్కపక్కన నడిస్తేనే ఆ ఇద్దరి సంబంధం గురించి ఊహించే మనుషులు బహిరంగంగా చేతిలో చేయి వేసి నడిస్తే ఆ వ్యక్తుల మధ్య ఉన్న సంబంధం గురించి ఎన్ని కథలు అల్లుతారో చెప్పలేం" అని అన్నారు.

" నా ప్రవర్తన చుట్టు పక్కల వారికి ఎటువంటి ఇబ్బందిని కలిగిస్తుందోనని కూడా ఆలోచిస్తాను. సమాజం కేవలం వ్యక్తులనే కాకుండా వారి కుటుంబాలను కూడా ఈ వ్యవహారంలోకి తీసుకుని వచ్చేస్తుంది. సమాజం ఇచ్చే ఈ తీర్పుల వల్లే, నాకు వ్యక్తిగతంగా ఈ బహిరంగ ప్రేమ ప్రదర్శన పట్ల సుముఖత లేదు" అని ఆమె చెప్పారు.

"ఓలా క్యాబ్‌లో హాస్టల్‌కి వచ్చినప్పుడు, గేట్ వరకు వెంట వచ్చిన డ్రైవర్‌ని చూసి హాస్టల్ వార్డెన్ ఆయన్ను నా బాయ్ ఫ్రెండ్ అనుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి" అని చెప్పారామె.

"నేను ఎవరితోనైనా వేరే అబ్బాయిలతో మాట్లాడటాన్ని నా ఆప్త మిత్రుడు కూడా ఆమోదించరు. చాలా మంది పురుషులకు మహిళలకు ఏమి తెలియదని, వారు తమ ఆస్తి అని, వారిని రక్షిస్తూ వారి గౌరవాన్ని కాపాడే బాధ్యత తమపై ఉందని భావించడమే ఇందుకు కారణం కావచ్చు" అని ఆమె అంటారు.

"ఈ అభ్యుదయ భావాలు పుస్తకాలలో, సినిమాలలో, సోషల్ మీడియాలో మాట్లాడటానికి బాగానే ఉంటుంది కానీ, నిజానికి సమాజంలో ఆ అభ్యుదయం పాటించడం కష్టం. ఇది ఇప్పట్లో మారుతుందని నేననుకోవడం లేదు" అన్నారామె.

రెండేళ్ల కిందట వివాహం అయిన విశాఖపట్నానికి చెందిన సింధు మాత్రం పది మందిలో ఉన్నప్పుడు తన భర్త చేతిని పట్టుకుని నడవడానికి గాని లేదా ప్రేమగా కౌగలించుకోవడాన్ని కానీ తప్పుగా భావించనని స్పష్టం చేశారు.

''నా భర్త నన్ను పది మందిలో దగ్గరకు తీసుకున్నా నాకు ఆనందంగానే ఉంటుంది. నాకు అది కాస్త గర్వంగా కూడా ఉంటుంది’’ అని ఆమె అన్నారు.

అయితే, ఇదే పనిని ఇంట్లో అత్తమామల ముందు చేయాలంటే మాత్రం లక్ష సార్లు ఆలోచించాల్సి వస్తుందని చెప్పారు. ఇదంతా కుటుంబ నేపథ్యం, పెరిగిన వాతావరణం వల్ల వచ్చే చిక్కు అని అన్నారు.

"కొంచెం సన్నహితంగా మెలిగితే, ప్రేమ పక్షులా అని అంటూ కళ్లతోనే వారి ఇబ్బందులను తెలియచేస్తారు. అందుకే నా హద్దులు తెలిసి నా భావాలను అణచుకుంటాను"

అత్తగారింట్లో ఎంత ఆధునికత వెల్లివిరిసినా, ఆధునిక సాంకేతికత పరికరాలు ఇంట్లో వాడినా, సోషల్ మీడియాలో అకౌంట్లు ఉన్నా భావాలు, ఆలోచనల విషయంలో మాత్రం మార్పు అంత త్వరగా వచ్చే విషయం కాదని అన్నారు.

చాలా మంది అత్తగార్లు మాత్రం కొడుకు, కోడలు తమ ప్రేమను బహిరంగంగా ప్రదర్శించకూడదు అనే భావనతోనే ఉంటారని అన్నారు.

"తన కుటుంబ సభ్యుల ముందు చనువును ప్రదర్శించడం పట్ల తన భర్త కూడా అంత సౌకర్యవంతంగా భావించరని చెప్పారు. అవతలి వ్యక్తి అభిప్రాయానికి అలాంటి సమయంలో నేను గౌరవం ఇస్తాను. సామాజిక కట్టుబాట్లు, కుటుంబ పద్ధతులు నన్ను నియంత్రిస్తాయి" అని చెప్పారు.

మానవ జీవితంలో స్పర్శ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని.. సంతోషంలో కానీ, కష్టంలో కానీ ఉన్నప్పుడు స్పర్శ ఒక భరోసాను ఇస్తుందని హైదరాబాద్‌కు చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ జీసీ కవిత అన్నారు.

అయితే, సంప్రదాయ కట్టుబాట్లు పాటించే సమాజంలో మాత్రం బహిరంగంగా ప్రేమను ప్రదర్శించకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉండవచ్చని అన్నారు.

చాలా సమాజాలలో మహిళలకు వారు చేసే పనుల వల్ల కానీ, వారు నిర్వహించే పాత్రల వల్ల కానీ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. బహిరంగంగా ఒక మహిళపై ప్రేమను ప్రదర్శించడాన్ని అగౌరవంగా భావించడం ఒక కారణం కావచ్చు అని అన్నారు.

"సమాజం ఎంత ఆధునికత వైపు పయనించినా, కుటుంబ సభ్యుల మధ్య తమ ప్రేమను ప్రదర్శించాలని మాత్రం చాలా మంది భావించరు. అది ఇంట్లో పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవంతో పాటు వారి నమ్మకాలను కూడా గౌరవించడమే" అని అన్నారు.

"ప్రతి స్పర్శ సెక్స్ కి దారి తీయకపోవచ్చు కానీ, స్పర్శను సెక్స్‌కి ఆరంభ సంకేతంగా చూడడమే సమాజం బహిరంగ ప్రేమ ప్రదర్శనను ఆమోదించకపోవడానికి కారణం కావచ్చు" అని ఆమె అభిప్రాయపడ్డారు.

స్పర్శ

విశాఖపట్నానికి చెందిన లతకు 53 ఏళ్లు. ఈ రోజుల్లో ప్రేమను వ్యక్తపరచడానికి ఆప్తులను కౌగలించుకోవడంలో తప్పు లేదని అంటూ, వ్యక్తిగతంగా తాను భర్తను మాత్రం పది మందిలో హత్తుకోనని చెప్పారు. ఇందుకు పెరిగిన వాతావరణం, కుటుంబ నేపథ్యం, సామాజిక కట్టుబాట్లు ప్రధాన కారణాలుగా నిలుస్తాయని ఆమె అభిప్రాయ పడ్డారు.

తన వ్యక్తిగత అనుభవం గురించి చెబుతూ తన కొడుకు ఐఐటీలో గ్రాడ్యుయేషన్ ఉత్సవం నాటి సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.

''అవార్డు తీసుకుని నా కొడుకు స్టేజి దిగి రాగానే, నేను పరుగున వెళ్లి వాడిని హత్తుకుని నా ప్రేమను వ్యక్తం చేశాను. కానీ, అలాంటి చాలా సందర్భాలు నా భర్తతో కూడా వస్తాయి. ఆయన చాలా సార్లు స్టేజిపై ప్రసంగం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ, నేను కళ్లతోనే నా ప్రేమను వ్యక్తం చేస్తాను కానీ, పది మందిలో వెళ్లి ఆలింగనం చేసుకోవడానికి మాత్రం మొహమాట పడతాను. భర్తను కౌగలించుకుని ప్రేమను వ్యక్తపరచాలంటే అది నాలుగు గోడల మధ్య మాత్రమే జరుగుతుంది" అన్నారామె.

"కానీ, నా పుట్టింట్లో నా అన్నదమ్ములను కలిసినప్పుడు కౌగిలించుకోవడం చాలా సర్వ సాధారణం. చాలా రోజుల తర్వాత స్నేహితులను కలిసినప్పుడు మహిళలు అయితే కౌగలించుకుంటాను కానీ, పురుషులతో అంత సన్నిహితంగా మెలగను’’ అని చెప్పారు.

తరతరాలుగా మహిళల భావాలను అదుపులో పెట్టాలనుకునే సమాజమే ఇందుకు కారణమని గూంజ్ స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్న సామాజిక కార్యకర్త అనీష అన్నారు.

"సమాజంలో చాలా నియమాలను, విధానాలను పురుషులే రూపొందిస్తారు. ఆఖరికి మహిళలు వాడే శానిటరీ న్యాప్కిన్లను కూడా పురుషులే తయారు చేస్తారు. మహిళలహక్కులు, ప్రేమించే స్వాతంత్ర్యం, జీవించే హక్కు గురించి చర్చకు వచ్చిన సమయంలో బహిరంగంగా ప్రేమను ప్రదర్శించటం అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఎవరూ భావించకపోవడం వలన దీని గురించి ఎవరూ చర్చించలేదు" అని ఆమె అభిప్రాయపడ్డారు.

"ఒక మహిళ పురుషుని చేతులు పట్టుకోవడాన్ని, లేదా దగ్గరగా మెలగడాన్ని అభ్యంతరకరంగా చూడటం ఒక విధంగా మహిళ భావాలను, నడవడికను నియంత్రించే సాధనం. ఇదేమి ఒక్క భారతదేశానికే పరిమితం కాదు, ఇలాంటి భావనే చాలా సమాజాలలో ఉంది" అని ఆమె అన్నారు.

"మహిళలను ఒక వస్తువులా చూడటం వలన ఆమె పై సర్వ హక్కులు సమాజానివే అనుకుంటూ ఉండటం వలన కూడా ఆమె ఎవరినీ తాకకూడదని అనే అభిప్రాయం చాలా సమాజాలలో నాటుకుపోయిందని అన్నారు. ఇప్పటి వరకు ఎవరూ తాకని అమ్మాయినే వివాహం చేసుకోవడానికి వివాహ మార్కెట్లో డిమాండు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎవరినైనా తాకడాన్ని ఈ సమాజం తప్పుగానే చూస్తుంది" అని ఆమె అన్నారు.

"ఈ సమాజం భావాలను కూడా నియంత్రిస్తుంది. ఉదాహరణకు పురుషులు ఏడవకూడదు అనే లాంటివి". కన్నీటికి జెండర్ తో సంబంధం ఏముందని ప్రశ్నించారు?

టచ్ టెస్ట్

బీబీసీ రేడియో 4, వెల్కమ్ కలెక్షన్ సంయుక్తంగా జనవరి 2020లో 12 దేశాల నుంచి 40,000 మందితో ఒక టచ్ టెస్ట్ నిర్వహించాయి.

దీనికి సంబందించిన ప్రశ్నలను లండన్‌లోని గోల్డ్ స్మిత్స్ యూనివర్సిటీ లోని మైకేల్ బానిస్సి నేతృత్వంలోని మానసిక శాస్త్రవేత్తల బృందం తయారు చేసింది.

ఈ అధ్యయనంలో పాల్గొన్న 43 శాతం మంది ప్రజలు ఈ సమాజం వారికి స్పర్శను పొందడానికి తగినంత అవకాశం ఇవ్వడం లేదని చెప్పగా, 26 శాతం మంది మాత్రం సమాజం వారికి స్పర్శను పొందేందుకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు.

దీనిని బట్టి, కొంత మంది స్పర్శను ఎక్కువగా కావాలనుకున్నప్పటికీ, ఆధునిక జీవితం మాత్రం మనకి కావల్సినంత స్పర్శను ఇవ్వడాన్ని నిరోధిస్తుందని చెప్పవచ్చు. అలా అని అందరికీ స్పర్శ అవసరం ఉండదు" అని ఈ అధ్యయనం పేర్కొంది.

52 ఏళ్ల గీత మాత్రం ఈ బహిరంగ ప్రేమను వ్యక్తపరచడం పట్ల తాను సుముఖంగానే ఉన్నప్పటికీ తన 22 ఏళ్ల కొడుకు మాత్రం చాలా సిగ్గు పడతాడని చెప్పారు.

"నాకు నా కొడుకు చేయి పట్టుకుని, కౌగలించుకోవాలని, ముద్దు పెట్టుకోవాలని, చేతిలో చేయి వేసి వాడితో నడవాలని ఉంటుంది. కానీ, నా కొడుకు పడే మొహమాటం నన్ను ఆపేస్తుంది. నా కొడుకు విపరీతంగా సిగ్గుపడి దగ్గరగా ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండటానికి ఒప్పుకోడు. ముఖ్యంగా తను కాలేజి హాస్టల్ నుంచి వచ్చినప్పుడు నాకు వాడిని హత్తుకోవాలని అనిపిస్తుంది. కానీ, నేను దగ్గరగా తీసుకున్న కొన్ని సెకండ్లలోనే తన చేతులను దూరంగా జరిపేస్తాడు" అని అన్నారు.

"సంప్రదాయ కట్టుబాట్లు పాటించే సమాజాలలో ఇలా బహిరంగంగా ప్రేమను ప్రదర్శించడం వలన ఇతరులను ఇబ్బంది పెట్టడంతో పాటు, వారి భావాలను గాయపరుస్తామేమో అనే భావనతోనే దూరంగా ఉంటాం. ఇది అవతలి వారికి ఇచ్చే గౌరవం అని గీత అన్నారు".

"సన్నిహితంగా మెలగడాన్ని తప్పుగా చూస్తారేమో, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే ఆలోచనలు చాలా మందిని బహిరంగంగా ప్రేమను ప్రదర్శించేలా చేయవు" అని అనీష అభిప్రాయ పడ్డారు.

''ఒక తీవ్రమైన భావావేశం మనలో రగిలినప్పుడు స్పర్శ వలన శరీరంలో డోపమైన్ లాంటి మంచి హార్మోన్లను విడుదలై ఆనందాన్ని కలిగిస్తాయి. ఆహ్లాదకరమైన స్పర్శను గుర్తించడానికి మానవ శరీరంలో సి టాక్టయిల్ అఫెరెంట్ ఫైబర్స్ అనే గ్రాహకాలు ఉంటాయి. ఇవి చాలా నెమ్మదిగా స్పందిస్తాయి’’ అని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

"స్పర్శకు సంబంధించిన ఆలోచన కూడా శరీరంలో డోపమైన్ విడుదలకు సహకరిస్తుంది" అంటున్నారు మానసిక వైద్యులు.

"జీవితంలో మానసిక ఒత్తిడికి గురి కాకుండా జీవించాలంటే ప్రేమతో కూడిన స్పర్శ అవసరం. స్పర్శ బంధాలకు పునాది వేస్తుంది" అని కవిత అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
touch an early sign of sex
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X