• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోదీ ప్రభుత్వాన్ని ఢీ కొట్టాలని ట్విటర్ ప్రయత్నిస్తోందా... భారత ఐటీ చట్టాలు ఏం చెబుతున్నాయి?

By BBC News తెలుగు
|

ట్విటర్
Click here to see the BBC interactive

ట్విటర్‌ విషయంలో ఇండియన్‌ గవర్నమెంట్‌ సీరియస్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. బుధవారంనాడు భారత ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్‌ అధికారి ట్విటర్‌ గ్లోబల్‌ ఎగ్జిక్యుటివ్‌తో వర్చువల్ మీటింగ్‌ నిర్వహించారు.

“మీరు ఇండియాలో బిజినెస్‌ చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, మీ నియమావళితోపాటు భారతదేశ చట్టాలకు కూడా కట్టుబడి వ్యవహరించాలి” అని ఆ అధికారి ట్విటర్‌కు స్పష్టం చేశారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అనేకమంది రైతులు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో ప్రచారమవుతున్న ట్వీట్లపై మోదీ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది.

ప్రశాంతంగా సాగుతున్న ఆందోళన జనవరి 26న ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా ఒక వ్యక్తి మరణించగా, అనేకమంది పోలీసులు గాయపడ్డారు.

ఈ ఆందోళనపై ట్విటర్‌లో కొంతమంది కావాలని అసత్య ప్రచారం చేశారని వారి ఎకౌంట్లను సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వం ట్విటర్‌ను కోరింది. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవారి వెనక సిక్కు వేర్పాటువాదులు, వారికి మద్ధతునిచ్చే పాకిస్తాన్‌ శక్తులు ఉన్నాయని ప్రభుత్వం ట్విటర్‌కు తెలిపింది.

భారత ప్రభుత్వం నుంచి వచ్చిన లీగల్‌ నోటీసుతో మొదట ట్విటర్‌ 250 ఖాతాలను స్థంభింప చేసింది. సస్పెండైన ఖాతాలలో జర్నలిస్టులు, పరిశోధనాత్మక జర్నలిజం నిర్వహించే కొన్ని వెబ్‌సైట్లు, ఉద్యమకారులు, సంస్థల ఎకౌంట్లు కూడా ఉన్నాయి.

వీరిలో చాలామంది దిల్లీలో కొన్ని నెలలుగా కొనసాగుతున్నా రైతుల ఆందోళనకు మద్దతుపలుకుతున్నారు. అయితే ఖాతాలను స్థంభింపజేసిన 6 గంటల తర్వాత ట్విటర్‌ వాటిని పునరుద్ధరించింది. సస్పెండ్‌ చేయాల్సినంత కంటెంట్‌ వాటిలో కనిపించలేదని ట్విటర్‌ ప్రకటించింది.

రైతుల ఆందోళన

ప్రభుత్వ హెచ్చరిక

ట్విటర్‌ వ్యవహారశైలి మోదీ ప్రభుత్వానికి నచ్చలేదు. ఈ ఖాతాలను స్తంభింపజేయాల్సిందేనని, లేనిపక్షంలో ఇక్కడ పని చేస్తున్న ట్విటర్‌ ఉద్యోగులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిఉంటుందని స్పష్టం చేసింది.

“ఉద్దేశపూర్వకంగా హింసను ప్రేరేపించడం, సమాజంలో అభద్రతను, అశాంతిని సృష్టించేందుకు కారణమవడం’’ అనే అభియోగాల కింద ఏడేళ్ల వరకు వారికి జైలుశిక్ష పడే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం హెచ్చరించింది.

ప్రభుత్వ నోటీసులపై ట్విటర్‌ బుధవారంనాడు స్పందించింది. 500 వరకు ఎకౌంట్లను సస్పెండ్‌ చేశామని, అందులో కొన్నింటిని శాశ్వతంగా రద్దు చేశామని, అందులో కొన్ని ఫేక్‌ ఎకౌంట్లు ఉన్నాయని తెలిపింది.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, హింసను, అశాంతిని రెచ్చగొట్టేలా ప్రవర్తించిన వందలాది ఎకౌంట్లపై చర్యలు తీసుకున్నామని, తమ నిబందనల ప్రకారం కొన్ని ఎకౌంట్లను కేవలం ఇండియా వరకే సస్పెండ్‌ చేశామని ట్విటర్‌ తన బ్లాగ్‌లో ప్రకటించింది.

అయితే, మీడియా సంస్థలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ఉద్యమకారులకు సంబంధించిన ఎకౌంట్లను బ్లాక్‌ చేయలేమని, భారతీయ చట్టాల ప్రకారం అలా చేయడం వారి భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడమేనని ఆ సంస్థ పేర్కొంది.

ట్విటర్‌ ప్రకటనపై బీజేపీ నేత, బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య స్పందించారు. “తాము భారతీయ చట్టాలకు అతీతులమని ట్విటర్‌ భావిస్తున్నట్లుంది. తనకు అనుకూలంగా ఉన్న చట్టాలను మాత్రమే అనుసరిస్తోంది’’అని విమర్శించారు.

“దేశం కార్పొరేట్‌ చట్టాల ప్రకారం నడవదు, రాజ్యాంగం తయారు చేసిన చట్టాల ప్రకారం నడుస్తుంది’’అని బీజేపీ నేషనల్‌ జనరల్‌ సెక్రటరీ బీఎల్‌ సంతోష్‌ అన్నారు.ట్విటర్‌ ప్రకటన తర్వాత భారత ప్రభుత్వానికి, దానికీ మధ్య యుద్ధం కొనసాగింది.

తప్పుడు వార్తలు ప్రసారం చేయడం, హింసను ప్రేరేపించే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వ సమాచార ప్రసార శాఖమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ గురువారంనాడు పార్లమెంటులో వెల్లడించారు.

“మీకు భారతదేశంలో మిలియన్లమంది ఫాలోయర్లు ఉన్నారు. మీరు దేశంలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు. అయితే ఇక్కడి చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందే’’ అని రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన ట్విటర్‌, ఫేస్‌బుక్‌ సహా పలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ప్రస్తావించారు.

“అమెరికాలో క్యాపిటల్‌ హిల్‌ హింస సందర్భంగా ట్విటర్‌ చేపట్టిన చర్యలను మేం సమర్ధిస్తున్నాం. చిత్రమేంటంటే ఎర్రకోట ఘటనపై ట్విటర్‌ అందుకు విరుద్ధంగా వ్యవహరించింది’’ అని రాజ్యసభలో రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు.

ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీ

'భావ ప్రకటనపై అణచివేత'

దేశంలో ఇటీవల పత్రికలపైనా, జర్నలిస్టుపైనా అణచివేత ఎక్కువైందని, ఇది దేశ ప్రతిష్టను మసకబారుస్తోందని కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ ఓ ఆర్టికల్‌లో విమర్శించారు.

ట్విటర్‌ మీద ప్రభుత్వ చర్యల అంశంపై సోషల్‌ మీడియాలో కూడా అనేకమంది అనుకూల, వ్యతిరేక కామెంట్లు చేశారు. ట్విటర్‌ సింబల్‌లోని పక్షిని పంజరంలో కూర్చోబెట్టినట్లున్న మీమ్స్‌ను ఆన్‌లైన్‌లో కొందరు పోస్ట్‌ చేశారు.

అయితే భారత ప్రభుత్వ చట్టాలను అనుసరించడం మినహా ట్విటర్‌కు మరో ఆప్షన్‌ లేదని సైబర్‌ నిపుణుడు విరాగ్‌ గుప్తా బీబీసీతో అన్నారు. ట్విటర్‌ విధానాలు పారదర్శకంగా లేవని కూడా ఆయన అన్నారు.

“అమెరికాలో ట్విటర్‌ డోనల్డ్‌ ట్రంప్‌పై తనంతటతానే చర్యలు తీసుకుంది. కానీ భారతదేశంలో ప్రభుత్వం విజ్జప్తి చేయాల్సి వచ్చింది. చివరకు సస్పెండ్‌ చేసినట్లే చేసి వాటిని పునరుద్ధరించింది” అని విరాగ్‌ గుప్తా అన్నారు.

రాజ్యంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం అభ్యంతరకరమైన వార్తలను ప్రచారం చేస్తే చర్య తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని విరాగ్‌ అన్నారు.

“2008 తర్వాత ఐటీ చట్టంలో మార్పులు చేయలేదు. అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా చట్టాలు చేసుకోవాల్సి వస్తోంది.” అని సైబర్‌ చట్టాల నిపుణురాలు రక్షిత్‌ టాండన్‌ అన్నారు.

రైతుల ఆందోళన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది కాబట్టి, ఆ కోపాన్ని ట్విటర్‌ మీద చూపిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. “ఏం రాయాలి, పెన్ను పట్టుకున్నాను. కానీ నా చేతులు నియంతల చేతిలో ఉన్నాయి’’ అని కాంగ్రెస్‌ నేత, మాజీ క్రికెటర్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ అన్నారు.

రైతు ఆందోళనలు అణచివేసేందుకే ప్రభుత్వం ట్విటర్‌పై ప్రతాపం చూపుతోందా లేక ఇండియా నుంచి ఆ సంస్థను వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తోందా అన్నది అర్ధం కావడంలేదని కొందరు వ్యాఖ్యానించారు.

“మనం మాటలను కట్టిపెట్టి చేతల్లో చూపించడం మంచిది. ట్విటర్‌ నిజంగా నిబంధనలను ఉల్లంఘిస్తుంటే దానిపై చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని ఎవరు అడ్డుకుంటున్నారు’’ అని 'మీడియా నామ’ వెబ్‌సైట్ నిర్వాహకుడు నిఖిల్‌ పాహ్వా అన్నారు.

ట్విటర్

చట్టాలు ఏం చెబుతున్నాయి?

దేశ భద్రతకు భంగం కలిగించేలా ఉన్న ఆన్‌లైన్‌ కంటెంట్‌ను నిషేధించేందుకు భారత ప్రభుత్వ ఐటీ చట్టంలో నిబంధనలు ఉన్నాయి. అయితే అందులోని సెక్షన్‌ 69A ప్రకారం ఆ కంటెంట్‌ రూపకర్తకు తన వాదనను వినిపించే అవకాశం ఇవ్వాల్సి ఉందని చట్టాల నిపుణులు చెబుతున్నారు.

“అసలు ఈ నిబంధనను ఒక్కసారైనా పాటించిన దాఖలాలు లేవు” అని 'ఇంటర్నెట్‌ ఫ్రీడం ఫౌండేషన్‌’ ఎగ్జిక్యుటివ్‌ డైరెక్టర్‌ అపర్‌ గుప్తా అన్నారు.

ప్రభుత్వం ట్విటర్‌కు ఇచ్చిన నోటీసులపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు నిఖిల్‌ పాహ్వా.“ఈ చట్టం కింద ఇచ్చిన నోటీసు వివరాలు బైటికి రావడానికి వీలులేదు.

అటు ప్రభుత్వంగానీ, ఇటు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌గానీ వాటిని బైట పెట్టకూడదు. అసలు ఈ చట్టం పారదర్శకంగా లేదు. దీన్ని సవాల్‌ చేయాల్సి ఉంది’’ అన్నారు నిఖిల్‌ పాహ్వా.

టిక్‌టాక్‌ను, మరికొన్ని చైనా యాప్‌లను బ్యాన్‌ చేయడానికి ముందు ప్రభుత్వం సవిస్తరమైన సమాచారం ఇచ్చిందని పాహ్వా గుర్తు చేశారు.

“దేశ భద్రతకు, సార్వభౌమత్వానికి ముప్పుగా భావించి వీటిని బ్యాన్‌ చేస్తున్నట్లు అప్పట్లో పేర్కొన్నారు’’ అని ఆయన గుర్తు చేశారు.

ప్రభుత్వం ఇలాంటి ద్వంద్వ వైఖరి ఎందుకు పాటిస్తుందో అర్ధం కావడంలేదని పాహ్వా అన్నారు. “కొన్ని మేగజైన్లకు చెందిన ట్విటర్‌ హ్యాండిల్స్‌ను ఎందుకు బ్యాన్‌ చేయాలనుకుంటున్నారు.

ఏవో కొన్ని ట్వీట్లను కాకుండా మొత్తం హ్యాండిల్‌నే బ్యాన్‌ చేయాలని చూడటంలో ఆంతర్యమేంటి” అని పాహ్వా ప్రశ్నించారు.

“ఒక ట్వీట్‌లో పొరపాటుగా మాట్లాడి ఉండొచ్చు. అందుకని మొత్తం భావప్రకటనా స్వేచ్ఛనే లేకుండా చేస్తారా’’ అని ఆయన ప్రశ్నించారు.

విజ్జప్తుల వెల్లువ

ప్రపంచంలోని చాలా ప్రాంతాలలోలాగే ఇండియాలో కూడా ప్రభుత్వంతో ట్విటర్‌కు ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది.

వివాదాస్పద కంటెంట్‌ను తొలగించాలంటూ ప్రపంచవ్యాప్తంగా న్యాయపరమైన విజ్జప్తులు ఇచ్చిన టాప్‌ఫైవ్‌ దేశాలలో భారత్‌ కూడా ఉంది. జపాన్‌, రష్యా, కొరియా, టర్కీలు మిగిలిన నాలుగు దేశాలు.

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మొత్తం విజ్జప్తులలో 96%శాతం ఈ ఐదు దేశాల నుంచే ఉన్నాయి. భారత ప్రభుత్వం నుంచి 5,900 విజ్జప్తులు వెళ్లినట్లు ట్రాన్స్‌పరెన్సీ రిపోర్ట్‌ వెల్లడించింది.

ఒకపక్క ఈ వివాదం కొనసాగుతుండగానే ఇండియా మైక్రోబ్లాగింగ్‌ యాప్‌ 'కూ’ (KOO)ను ట్విటర్‌కు పోటీగా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ట్విటర్‌ను పోలినట్లు ఉండే ఈ యాప్‌ను ఇప్పటికే చాలామంది బీజేపీ మంత్రులు, కార్యకర్తలు, అధికారులు తమ మొబైళ్లలో ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. ఈ యాప్‌ 8 భారతీయ భాషలలో మెసేజింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తోంది.

ట్విటర్‌కు భారతదేశంలో కోటీ యాభై లక్షలమందికి పైగా యూజర్లు ఉన్నారు. అయినా సరే ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అనడానికి ట్విటర్‌ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

“మా కస్టమర్ల భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడే విషయంలో మేం ఎప్పుడూ వెనకడుగు వేయం. సోషల్‌ ప్లాట్‌ఫామ్‌గా మాకు, ప్రభావితమైన ఎకౌంట్లకు భారత చట్టాల ప్రకారం ఉన్న ఇతర ఆప్షన్లను పరిశీలిస్తున్నాం’’ అని ట్విటర్‌ పేర్కొంది.

(ఇన్‌పుట్స్: బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావి)

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Twitter trying to overthrow the Modi government,What do Indian IT laws say
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X