• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బ్లాక్ ఫంగస్‌ కంటే వైట్ ఫంగస్ మరింత ప్రమాదకరమా.. ఈ వ్యాధి ఎవరికి వస్తుంది..

By BBC News తెలుగు
|
బ్లాక్ ఫంగస్

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కానీ ఫంగస్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

బ్లాక్ ఫంగస్‌ (మ్యుకోర్‌ మైకోసిస్) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి దాకా బ్లాక్ ఫంగస్ ఒక్కటే ఉండేది. కానీ ఇప్పుడు వైట్ ఫంగస్, యెల్లో ఫంగస్ కేసులు కూడా బయటపడుతున్నాయి.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘాజియాబాద్ హర్ష్ ఈఎన్‌టీ ఆస్పత్రిలో ఒకే రోగిలో ఈ మూడు ఫంగస్‌లను గుర్తించారు.

ఫంగస్ వల్ల ఇలాంటి వ్యాధులు రావడం కొత్తేం కాదు.

కానీ ఈ అరుదైన వ్యాధికి సంబంధించిన కేసులు కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఎక్కువగా బయటపడుతున్నాయి.

బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ ప్రమాదకరమైనదని వైద్యులు చెబుతున్నారు.

బిహార్‌ రాజధాని పట్నాలో వైట్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

పట్నాలోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురు రోగుల్లో వైట్ ఫంగస్ లక్షణాలు కనిపించాయని హిందుస్థాన్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది.

వైట్ ఫంగస్ కేసులపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వైట్ ఫంగస్

'వైట్ ఫంగస్ బ్లాక్ ఫంగస్ కంటే ఎక్కువ ప్రమాదకరం'

"వైట్ ఫంగస్ బ్లాక్ ఫంగస్ కంటే ఎక్కువ ప్రమాదకరం" అని పారస్ ఆస్పత్రి సీనియర్ సలహాదారు, శ్వాసకోశ చికిత్స నిపుణులు డాక్టర్ అరుణేష్ కుమార్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో చెప్పారు.

రోగ నిరోధకశక్తి తగ్గిపోయి, చర్మంలో తేమ ఎక్కువగా ఉన్నవారిలో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తుందని డాక్టర్ అరుణేష్ కుమార్ చెప్పారు.

ఇది రాకుండా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండడం చాలా ముఖ్యమని తెలిపారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఒక కథనం ప్రకారం వైట్ ఫంగస్‌ను 'కాండిడియాసిస్' అంటారు. ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్.

యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వివరాల ప్రకారం ఈ వైట్ ఫంగస్ మెదడు, గుండె, రక్తం, ఎముకలు, శరీరంలోని మిగతా భాగాలపై ప్రభావం చూపిస్తుంది.

కరోనా వార్డు

కాండిడా ఫంగస్ శరీరంలోనే పుడుతుంది

సీడీసీ వెబ్‌సైట్ ప్రకారం కాండిడియాసిస్ ఒక రకమైన ఫంగస్ వల్ల వస్తుంది. దానిని 'కాండిడా' అంటారు. కాండిడా ఫంగస్ శరీరంలోనే పుడుతుంది. ఇది నోట్లో, గొంతులో, శరీర స్రావాలకు సోకవచ్చు.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాంటి రోగుల శరీరంలో ఫంగస్ ఇన్ఫెక్షన్లకు ఎక్కువ అవకాశం ఉంటుంది.

ఐసీయూలో ఎక్కువ కాలంపాటు గడిపినవారికి, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, కీమోథెరపీ లేదా అవయవ మార్పిడి జరిగిన రోగులకు, తెల్ల రక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నవారికి ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఒకటికి మించి సర్జరీలు చేసుకున్నవారికి, మధుమేహ రోగులకు, ట్యూబ్ ద్వారా ఆహారం తీసుకుంటున్న వారికి కూడా వైట్ ఫంగస్ ఇన్ఫెక్షన్ చాలా ప్రమాదకరం.

బ్లాక్ ఫంగస్

ఇది అంటువ్యాధి కాదు

ఈ వ్యాధి వ్యాపించదు. ఎందుకంటే ఈ ఫంగస్ ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించదు.

అయితే ఇది చర్మానికి వచ్చినపుడు ఇతరులకు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది.

వైట్ ఫంగస్‌కు కూడా కోవిడ్ లాంటి లక్షణాలు ఉంటాయి.

కోవిడ్ రిపోర్టులో నెగటివ్ వచ్చిన వారికి సీటీ స్కాన్, ఎక్స్ రే ద్వారా ఈ ఇన్ఫెక్షన్‌ను గుర్తించవచ్చు.

వైట్ ఫంగస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపడంతోపాటూ శరీరంలోని మిగతా భాగాలు అంటే గోళ్లు, చర్మం, మూత్రపిండాలు, మెదడు, నోరు, జననాంగాలకు కూడా సోకవచ్చు.

కరోనా వార్డు

కోవిడ్ రోగులకు వైట్ ఫంగస్ ప్రమాదం ఎక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అంటే ఇది బ్లాక్ ఫంగస్‌లాగే ఉంటుంది. కానీ శరీరంలోని మిగతా భాగాలపై కూడా ప్రభావం చూపిస్తుంది.

ఫంగస్ రంగు, అది అభివృద్ధి చెందడంపై ఆధారపడి ఉంటుందని ఐసీఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ బలరామ్ భార్గవ్ అన్నారు. ఇలాంటి ఇన్ఫెక్షన్లు చర్మంలోని తేమ ద్వారా వ్యాపిస్తాయని చెప్పారు.

నిర్దిష్ట పరీక్షలు చేయకుండా వైట్ ఫంగస్ గురించి ఏదైనా చెప్పడం కష్టమని చెప్పారు.

దేశంలోని మిగతా ప్రాంతాల్లో వైట్ ఫంగస్‌కు సంబంధించి నిర్దిష్ట ఆధారాలేవీ లభించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Is white fungus more dangerous than black fungus? Who gets the disease
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X