ఇది జాతీయ భద్రతను ప్రభావితం చేస్తుంది .. రైతుల సమస్యపై అమిత్ షా తో పంజాబ్ సీఎం
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ బోర్డర్ లో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఎనిమిది రోజులుగా ఢిల్లీలో, ఢిల్లీ బోర్డర్ లో నిరసనల పర్వం కొనసాగుతుంది . ఇక ఈ రోజు రెండో విడత రైతులతో కేంద్రం చర్చలు జరపనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తోనూ, పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ తోనూ కీలక సమావేశాలు నిర్వహించారు.
7వ రోజు ఢిల్లీ బోర్డర్ లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు: ఢిల్లీ -నోయిడా బోర్డర్ దిగ్బంధించిన రైతులు

పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తో అమిత్ షా భేటీ
రైతులతో రెండో విడత చర్చలు జరపనున్న కారణంగా, ముఖ్యంగా పంజాబ్ రైతులే కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలని భీష్మించుకుకూర్చున్న నేపధ్యంలో పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ తో కేంద్ర హోంమంత్రి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇప్పటికే కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు బహిరంగంగా మద్దతు తెలుపుతూ పంజాబ్ సీఎం రాష్ట్ర శాసనసభలో పలు చట్టాలు చేసిన విషయం తెలిసిందే.

పంజాబ్ ఆర్థిక వ్యవస్థను మాత్రమే కాదు.. జాతీయ భద్రత ను ప్రభావితం చేసే సమస్య
ఈ నేపథ్యంలో తాజాగా హోం మంత్రితో భేటీ అయిన పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ ఢిల్లీలోనూ, మరియు ఢిల్లీ సరిహద్దుల్లోనూ కొనసాగుతున్న ఆందోళనలు ఒక్క పంజాబ్ ఆర్థిక వ్యవస్థను మాత్రమే ప్రభావితం చేసే సమస్య కాదని ఇది జాతీయ భద్రత ను ప్రభావితం చేసే సమస్యని పంజాబ్ ముఖ్యమంత్రి హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని ఇరు వర్గాలకు విజ్ఞప్తి చేసిన ఆయన నేడు హోంమంత్రితో భేటీ తర్వాత ఈ విషయంపై స్పందించారు.

వ్యవసాయ చట్టాలపై తమ వ్యతిరేకత కేంద్రానికి చెప్పానన్న పంజాబ్ సీఎం
రైతులకు కేంద్రానికి మధ్య చర్చ జరుగుతోందని, ఇందులో తాను పరిష్కరించటానికి ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు హోం మంత్రితో తన సమావేశంలో వ్యవసాయ చట్టాల పై తన వ్యతిరేకతను పునరుద్ఘాటించానని , ఇది పంజాబ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మాత్రమే కాకుండా దేశ భద్రతను కూడా ప్రభావితం చేస్తుందని అందుకే సమస్యను త్వరగా పరిష్కరించాలని అభ్యర్థించాను అని అమిత్ షాతో భేటీ అనంతరం పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ పేర్కొన్నారు.

నేడు రైతులతో కేంద్రం భేటీపై సర్వత్రా ఆసక్తి
పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ అమిత్ షాను జాతీయ రాజధానిలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం మరియు రైతుల మధ్య ప్రస్తుత వైరుధ్యానికి స్నేహపూర్వక పరిష్కారం కోసం ఈ భేటీకి ఉపయోగపడుతుందా అన్నది చూడాల్సి ఉంది. వివాదాస్పదమైన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం ఈ వారంలో రెండవ రౌండ్ చర్చలు జరుగుతున్న కారణంగా ఈ సమావేశం జరిగింది.
మరి నేడు జరగనున్న భేటీపై ఉత్కంఠ నెలకొంది .