శశికళకు షాక్: 100 ఖాతాలు సీజ్, లేడీస్ హాస్టల్ గదుల్లోని నేలమాళిగల్లో డబ్బు, వజ్రాలు
చెన్నై: శశికళకు షాక్ మీద షాక్ తగులుతోంది. జయ టీవీ ఎండీ వివేక్ జయరామన్ బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపచేసిన విషయం తెలిసిందే. ఆయనకు చెందిన 100 ఖాతాలను ఆదాయపన్ను శాఖ నిలుపుదల చేసింది.
ఈ బ్యాంకు ఖాతాలు వివేక్ నేతృత్వంలోని 20 షెల్ కంపెనీలకు చెందినవేనని ఐటీ శాఖ శనివారం ప్రకటించింది. శశికళ, ఆమె బంధుమిత్రులకు చెందిన 188 సంస్థలు, కార్యాలయాలపై నిర్వహించిన దాడుల్లో గుర్తించారు.

పలు ప్రాంతాల్లో సోదాలు, వేల కోట్ల ఆస్తులు
హైదరాబాద్, బెంగళూరు, తమిళనాడు, పుదుచ్చిరేలలో ఈ సోదాలు నిర్వహించినట్లు ఆదాయపన్ను శాఖ తెలిపింది. శుక్రవారం వరకు జరిగిన సోదాల్లో రూ.6 కోట్ల నగదు, 8.5 కేజీల బంగారం, రూ.1200 కోట్ల విలువైన ఆస్తి పత్రాలను గుర్తించారు.

మహిళా కళాశాలలో విలువైన ఆస్తులు
అంతేకాదు, శశికళ సోదరుడు యాజమాన్యంలో ఉన్న మహిళా కాళాశాలకు చెందిన ఉపయోగించని హాస్టల్ గదుల్లో విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ నేలమాళిగలు కూడా బయటపడ్డాయని, అక్కడ కోట్లాది రూపాయలు, వజ్రాభరణాలు బయటపడ్డాయని తెలుస్తోంది.

దినకరన్ అనుచరులు అడ్డుకున్నా
శశికళ, బంధువుల ఇళ్లలో జరిగిన సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడుతుండటంతో ఐటీ అధికారులే నివ్వెరపోతున్నారు.
మన్నార్గుడి ప్రాంతంలోని సుందరకొట్టాయ్‌లో ఉన్న ఈ హాస్టల్లోకి అధికారులు అడుగుపెట్టకుండా దినకరన్ అనుచరులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాదాపు 60 గంటలపాటు నిర్వహించిన సోదాల్లో రూ. కోట్ల నగదు బయటపడిందని తెలుస్తోంది.

శశికళ లావాదేవీలు జరిపినట్లు అనుమానం
చెన్నైలోని మాజీ సీఎం జయలలితకు చెందిన జయ టీవీ కార్యాలయం, నమదు ఎంజీఆర్ దినపత్రిక సీఈవో వివేక్ జయరామన్, టి నగర్ హబీబుల్లా రోడ్డులోని కృష్ణప్రియ నివాసాల్లో అధికారులు శనివారం మూడో రోజు సోదాలు నిర్వహించారు. కాగా, ఇటీవల పెరోల్‌పై బయటకు వచ్చిన శశికళ స్థిరాస్తుల లావాదేవీలు జరిపినట్టు అనుమానిస్తున్నారు. వాటి పైనా ఐటీ అధికారులు దృష్టి సారించారు.