Terrorist: బెంగళూరులో కాశ్మీర్ ఉగ్రవాది అరెస్టు, మసీదులో మకాం, పిల్లలకు పాఠాలు, భార్యతో ఎస్కేప్ అయ్యి!
బెంగళూరు/ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఎలా రెచ్చిపోతుంటారో కొత్తగా చెప్పనవసరం లేదు. అలాంటి కాశ్మీర్ లో ఉగ్రవాదుల జాబితాలో ఉన్న అనుమానితుడు కొన్ని సంవత్సరాల క్రితం అతని భార్య, పిల్లలతో కలిసి మాయం అయ్యాడు. హిజబుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థతో లింక్ పెట్టుకున్న ఆతని కోసం ఇన్ని సంవత్సరాలు కాశ్మీర్ పోలీసులు దేశం మొత్తం వెతుకుతూనే ఉన్నారు. బాషతో సంబందం లేకుండా, ఏ రాష్ట్రం నుంచి ఎవరు వెళ్లినా బతికిపోతున్న బెంగళూరులో కాశ్మీర్ ఉగ్రవాది తలదాచుకున్నాడు.
పక్కా సమాచారం అందుకున్న కాశ్మీర్ పోలీసులు బెంగళూరులో ప్రత్యక్షం అయ్యి మసీదులో పిల్లలలో పాఠాలు చెబుతున్న ఉగ్రవాదిని పట్టుకున్నారు. మసీదు పెద్ద కాశ్మీర్ ఉగ్రవాదికి ఆశ్రయం ఇచ్చాడని వెలుగు చూడటం కలకలం రేపింది. అయితే అతను ఉగ్రవాది అనే విషయం తెలీక నేను ఆశ్రయం ఇచ్చానని మసీదు పెద్ద చెబుతుండటంతో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఐటీ హబ్ లో కాశ్మీర్ ఉగ్రవాది పట్టుబడ్డాడని, అతను నిత్యం హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థతో టచ్ లో ఉన్నాడని వెలుగు చూడటంతో బెంగళూరు ప్రజలు హడలిపోయారు.

కాశ్మీర్ ఉగ్రవాది
కాశ్మీర్ లో ఉగ్రవాదుల జాబితాలో ఉన్న అనుమానితుడు తాలిబ్ హుస్సేన్ అలియాస్ తాలిబ్ (38) కొన్ని సంవత్సరాల క్రితం అతని భార్య, పిల్లలతో కలిసి మాయం అయ్యాడు. హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థతో లింక్ పెట్టుకున్న తాలిబ్ కోసం కొన్ని సంవత్సరాలుగా కాశ్మీర్ పోలీసులు దేశం మొత్తం వెతుకుతూనే ఉన్నారు.

బెంగళూరులో కాశ్మీర్ ఉగ్రవాది మకాం
బెంగళూరులోని ఓకళిపురంలోని ఓ మసీదులో కాశ్మీర్ ఉగ్రవాది తాలిబ్ తలదాచుకున్నాడు. తాలిబ్ బెంగళూరులో తలదాచుకున్నాడని ఇంటెలిజెన్స్ పోలీసులు కాశ్మీర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన పక్కా సమాచారం అందుకున్న కాశ్మీర్ పోలీసులు బెంగళూరులో ప్రత్యక్షం అయ్యి బెంగళూరు పోలీసుల సహకారంతో ఓకళిపురంలోని మసీదులో పిల్లలలో పాఠాలు చెబుతున్న అనుమానిత ఉగ్రవాది తాలిబ్ ను పట్టుకున్నారు.

పేరు మార్చుకున్న ఉగ్రవాది
కాశ్మీర్ నుంచి భార్య, పిల్లలతో కలిసి బెంగళూరు చేరుకున్న తాలిబ్ అతని పేరు తాలిక్ గా మార్చుకున్నాడు. మొదట రైల్వేస్టేషన్ లో కూలీగా పని చేసిన తాలిబ్ తరువాత ఓకళిపురంలోని మసీదు దగ్గరకు మకాం మార్చాడు. మసీదు పెద్ద అన్వర్ కు చెందిన ఇంటిలో కాపురం పెట్టిన తాలిబ్ మసీదులో ప్రవచనాలు చెబుతున్నాడని పోలీసులు అన్నారు.

ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థతో లింక్
కాశ్మీర్ కు చెందిన తాలిబ్ ను పట్టుకున్న కాశ్మీర్ పోలీసులు అతన్ని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచి బాడీ వారెంట్ తో అతన్ని కాశ్మీర్ కు పిలుచుకుని వెళ్లిపోయారు. ఐటీ హబ్ బెంగళూరులో కాశ్మీర్ ఉగ్రవాది తాలిబ్ పట్టుబడ్డాడని, అతను నిత్యం హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థతో టచ్ లో ఉన్నాడని వెలుగు చూడటంతో బెంగళూరు ప్రజలు హడలిపోయారు.

ఆధార్ కార్డు ఉంది... ఇల్లు ఇచ్చాను అంతే
ఈ విషయంపై మసీదు పెద్ద అన్వర్ స్థానిక కన్నడ టీవీ చానల్ తో మాట్లాడుతూ తాలిబ్ అతని పేరు తాలిక్ అని చెప్పాడని, అతను ఉగ్రవాది అనే విషయం తెలీక నేను ఆశ్రయం ఇచ్చానని, అతని దగ్గర ఆధార్ కార్డు కూడా ఉండటంతో తనకు ఎలాంటి అనుమానం రాలేదని మసీదు పెద్ద అన్వర్ కన్నడ మీడియాకు చెప్పారు. మసీదు పెద్ద అన్వర్ చెబుతున్నదానికి, తాలిబ్ చెబుతున్న దానికి ఏమైనా లింక్ ఉందా ?, లేక అన్వర్ కు నిజంగా అసలు విషయం తెలీదా అనేకోణంలో పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు.