200 కోట్ల మనీ లాండరింగ్ కేసు: ఈడీ విచారణకు హాజరైన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ !!
200 కోట్ల రూపాయలు మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఈడీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ప్రశ్నించింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈడీ విచారణను నాలుగుసార్లు దాటవేసిన తర్వాత, జాక్వెలిన్ బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈడీ ఢిల్లీ కార్యాలయంలో ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద నటుడి స్టేట్మెంట్ రికార్డ్ చేయబడుతోందని ఈడీ వర్గాలు చెబుతున్నాయి.

ఈడీ ముందు విచారణకు హాజరైన జాక్వెలిన్ ఫెర్నాండెజ్
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆర్థిక లావాదేవీలు మరియు సుకేష్ చంద్రశేఖర్‌తో ఆమె అనుబంధం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నిఘాలో ఉన్నాయి. ఇప్పటికే సుకేష్ చంద్రశేఖర్‌తో సంబంధాలు ఉన్నట్టు గుర్తించిన బాలీవుడ్ నటీమణులు నోరా ఫతేహిని ఈడీ అధికారులు విచారించారు. అక్టోబర్ 15 వ తేదీన నోరా ఫతేహి ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యారు. సుకేశ్ చంద్రశేఖర్‌పై దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి నటీమణులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా జాక్వెలిన్ విచారణకు అక్టోబర్ 16 వ తేదీన విచారణకు హాజరు కాలేదు. అనేక మార్లు డుమ్మా తర్వాత నేడు విచారణకు హాజరయ్యారు జాక్వెలిన్.

ఈడీ విచారణకు హాజరు కాకుండా నాలుగు సార్లు డుమ్మా కొట్టిన జాక్వెలిన్
సుకేశ్ చంద్రశేఖర్ మరియు అతని నటుడు-భార్య లీనా మరియా పాల్ వ్యాపార వేత్తను మోసం చేసిన వ్యవహారంలో మనీలాండరింగ్ కేసు నమోదైంది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అక్టోబర్ 16 న విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు పంపించినా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు మొత్తం నాలుగు సార్లు డుమ్మా కొట్టారు జాక్వెలిన్. తన వృత్తిపరమైన పని ఒత్తిడి వల్ల హాజరు కాలేకపోతున్నట్టు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అప్పుడు పేర్కొన్నారు .

జాక్వెలిన్ విచారణకు హాజరు .. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
శుక్రవారం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాజరు కాని పక్షంలో, సోమవారం మళ్లీ హాజరు కావాలని ఈడీ అధికారులు పేర్కొన్నారు. అప్పుడు కూడా జాక్వెలిన్ హాజరు తప్పించుకున్నారు. ఇక తాజాగా ఈ బుధవారం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. మరోమారు సుకేష్ చంద్రశేఖర్ దంపతుల జంటతో ఉన్న సంబంధాలపై విచారణ జరుపుతున్నారు ఈడీ అధికారులు. ఈ రోజు జరుగుతున్న విచారణలో జాక్వెలిన్ ఏం చెప్తారు అన్నది ఆసక్తికర అంశంగా మారింది. ఈ కేసులో జాక్వెలిన్ కు సంబంధం ఉందా? ఈడీ మళ్ళీ మళ్ళీ ఎందుకు జాక్వెలిన్ ను విచారిస్తుంది అన్న చర్చ బాలీవుడ్ వర్గాల్లో జరుగుతుంది.

ఇప్పటికే ఈడీ విచారణ ఎదుర్కొన్న జాక్వెలిన్ .. ఇప్పుడు మళ్ళీ మరోసారి విచారణకు
ఫోర్టిస్ హెల్త్‌కేర్ ప్రమోటర్ శివిందర్ సింగ్ కుటుంబాన్ని దాదాపు రూ. 200 కోట్లు మోసం చేసినందుకు చంద్రశేఖర్ మరియు నటీమణి లీనా మరియా పాల్లను ఢిల్లీ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉందని వారిని కూడా విచారిస్తున్నారు. సుకేష్ చంద్రశేఖర్ తో సంబంధం ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆగస్టు 30 న మొదటిసారిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు, ఈ సమయంలో ఆమె నాలుగు గంటల పాటు ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద ఆమె స్టేట్మెంట్ నమోదు చేశారు. మళ్ళీ ఈ కేసులో ఆమెను విచారించాల్సిన అవసరం ఉందని భావించిన ఈడీ మరోమారు ఆమెను విచారిస్తుంది.