అమెజాన్ సంస్థలో కొత్తగా 10 లక్షల ఉద్యోగాలు.. వచ్చే ఐదేళ్లలో కల్పిస్తామన్న జెఫ్ బెజోస్
మూడు రోజుల పర్యటన కోసం ఇండియాకు వచ్చిన అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ శుభవార్త చెప్పారు. ఇండియాలో తమ సంస్థ ద్వారా వచ్చే ఐదేళ్లలో 10 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. టెక్నాలజీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ విభాగాల్లో పెట్టుబడుల విస్తరణ ద్వారా ఉద్యోగాలు పెరుగుతాయని ఆయన చెప్పారు. 2013 నుంచి ఇప్పటిదాకా అమెజాన్ సంస్థ ఇండియాలో 7 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిందని గుర్తుచేశారు.
''ఇండియాలో అమెజాన్ విస్తరణ, ఎదుగుదలలో ఉద్యోగుల భాగస్వామ్యం చాలా గొప్పది. చిన్నవ్యాపారుల సహకారం కూడా మరువలేనిది. అమెజాన్ తో షాపింగ్ నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త సేవలు అందించడానికి మేమూ ఉత్సాహంతో ఉన్నాం. రాబోయే ఐదేళ్లలో మేం ఇండియాలో బిలియన్ డాలర్ల పెట్టుబడులు విస్తరించబోతున్నాం. తద్వారా 2025 నాటికి దేశవ్యాప్తంగా కొత్తగా 10 లక్షల ఉద్యోగాల్ని సృష్టిస్తాం''అని బెజోస్ ఒకప్రకటనలో తెలిపారు.

రిటైల్ నిబంధనల విషయంలో భారత ప్రభుత్వంతో విభేధాలు తలెత్తాయని అంగీకరించిన అమెజాన్ అధిపతి.. వివాదాలను పక్కనపెట్టి పనికి పునరంకితమయ్యామని చెప్పుకొచ్చారు. భారత్ లో మెగాసిటీలు మొదలుకొని చిన్నతరహా పట్టణాల దాకా బిజినెస్ డిజిటలైజేషన్ కోసం అమెజాన్ వంద కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నదని, ఇండియన్ల క్రియేటివిటీ, దేన్నైనా సాధించగల కాన్ఫిడెన్స్ తనకు బాగా నచ్చుతాయని ఆయన చెప్పారు.
చిన్న వ్యాపారులకు వరం..
అమెజాన్ రాకతో భారత్ లోని చిన్నతరహా వ్యాపారులు బాగా లాభం పొందుతున్నారని, వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ ను అందుబాటులోకి తెచ్చామని, అంతర్జాతీయ ఫ్లాట్‌ఫాం ద్వారా భారత్ నుంచి 2025 నాటికి వేయి కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు ఉంటాయని బెజోస్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో భారత్ లో బిలియన్ డాలర్ల పెట్టుబడుల ద్వారా మిలియన్ కొత్త ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.